Bananas Flour : అరటితో అద్భుతాలు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు
Bananas Flour : కర్ణాటకలో అరటి పంటను రైతులు అధికంగా సాగుచేస్తుంటారు. ఎంతో కష్టపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట పండించినప్పటికీ ఒక్కో సందర్భంలో సరైన గిట్టుబాటు ధరలేక అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పండించిన పంటను విక్రయించుకునేందుకు వ్యాపారులపై ఆధారపడాల్సి రావటంతో సరైన గిట్టుబాటు ధర లభించని పరిస్ధితి ఉండేది. కొన్ని సందర్భాల్లో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక పశువులకు , గొర్రెలకు ఆహారంగా వేయాల్సి వచ్చేది. ఈ పరిణామాలు రైతులకు ఆర్థికంగా నష్టం కలిగించేవి.
ఇలాంటి సమస్యకు చక్కటి పరిష్కారం చూపించింది కర్ణాటకకు చెందిన ఓ మహిళ రైతు. తుమకూరు జిల్లా అతికట్టె గ్రామానికి చెందిన 43ఏళ్ళ నయనా ఆనంద్ సేంద్రీయ విధానంలో అరటి సాగు చేపడుతుంది. ఈ క్రమంలో తనతోపాటు చాలా మంది రైతులు పండిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవటంతో చాలా మందికి అరటి గెలలను ఉచితంగా అందించేవారు. మిగిలిపోయిన వాటిని ఏంచేయాలో తెలియక పారేసేవారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కేజీ రూ.4-5 మాత్రమే చెల్లించి నాణ్యమైన అరటిని దళారులు కొనుగోలు చేసేవారు. ఇది రైతులకు తీవ్రనష్ట కలిగించేది.. నాణ్యత తక్కువగా ఉన్న అరటి గెలలు పెద్ద మొత్తంలో రైతుల దగ్గరే మిగిలిపోయేవి. అరటి ఎక్కువ రోజులు నిల్వ ఉండే పంట కాదు కాబట్టి వృధాగానే కాయలన్నీ పాడైపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన నయనా ఆనంద్ అరటికాయ నుంచి ఏవైనా ఉత్పత్తులు చేయవచ్చు నేమో అని ఆలోచించసాగింది.
ఈ తరుణంలో కేరళలో అరటి పండ్ల ఉత్పత్తి అధికంగా ఉన్న సమయంలో రైతులు వాటిని పొడిగా మార్చటం సర్వసాధారణం. ఆసమయంలో ఆవిషయం గుర్తుకు రాటంతో వెంటనే కర్నాటకు చెందిన పాత్రికేయుడు పాద్రే ను సంపద్రించింది. పాద్రే కేరళలోని అలిప్పీలోని వ్యవసాయశాఖ పరిశోధకులైన జార్జి జస్సీని సంప్రదించారు. ఫోన్ లో జస్సీతో మాట్లాడిన నయన అదే రోజు అరటిని పొడిగా మార్చే ప్రయత్నం మొదలు పెట్టింది.
అరటికాయ లేదా పండు నుంచి అరటి పొడిని తయారు చేసే ప్రక్రియకు సంబంధించి పరిశీలిస్తే… ఒక పాత్రలో 800 మి.లీ. నీరు, 200 మి.లీ. గంజి కలిపి తీసుకోని దాన్లో పది గ్రాముల ఉప్పు కలపాలి. తొక్క తీసిన పచ్చి లేదా పండిన అరటిని దాంట్లో అరగంటసేపు నానబెట్టాలి. తర్వాత వాటిని గుండ్రని ముక్కలుగా కోయాలి. ఆ ముక్కల్ని రెండ్రోజులూ లేదంటే పూర్తిగా తేమ పోయేంత వరకూ ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిగా చేసి ఏదైనా పాత్రలో పోసి, గాలి సోకకుండా మూతపెట్టాలి. వారం తర్వాత ఆ పొడిని వాడొచ్చు. పొడి అయితే ఆరు నెలల, ఎండ బెట్టిన అరటి ముక్కలు ఏడాదీ నిల్వ ఉంటాయి.
అలా తయారు చేసుకున్న అరటి పొడితో ఏయే వంటకాలు చేయొచ్చో నయనా ఆనంద్ ప్రయోగాలు చేసింది. గోధుమపిండి, మైదాతో తయారు చేసే వంటకాలన్నీ అరటి పొడితో కూడా తయారు చేసుకోవచ్చని నిరూపించింది. అంతేకాదు అరటి పొడితో రుచికరమైన గులాబిజామున్ లను కూడా తయారు చేసి అందరికి రుచిచూపించింది. అరటి పొడితో తయారుచేసే చపాతీలు, బిస్కెట్లు , గులాబ్ జామ్ వంటి రుచికరమైన ఆహార పదార్థాలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని చెప్తోంది ఆమె.
అరటి పొడి తయారీ విధానాన్ని, అరటి పొడితో చేసుకోగల ఆహారపదార్థాల వివరాలను స్ధానిక రైతులతో పంచుకుంది. దీంతో రైతులందరూ ఈ పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అరటి ముక్కల్లో తేమ పోగొట్టడానికి డ్రైయ్యర్లనీ రైతులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్క తుముకూరు జిల్లాలోనే రైతుల దగ్గర 1500 దాకా డ్రైయ్యర్లు కొనుగోలు చేశారు. వందల మంది రైతులు అరటి కాయలూ, పండ్లతో పొడి చేస్తూ తమ పంట వృథా పోకుండా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
అరటి కాయలతో తయారు చేసిన పొడి సుమారు 6మాసాల పాటు నిల్వవుంటుంది. ఎండిన అరటి ముక్కలతో తయారు చేసే పొడి ఏడాది పాటు నిల్వచేయవచ్చు. ప్రస్తుతం కర్ణాటక ప్రాంతానికి చెందిన రైతులు అరటితో అద్భుతాలు చేస్తున్నారు. తాము పండించిన అరటి పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా వాటిని పిండిగా మార్చి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
COMMENTS