Armay Warm : మొక్కజొన్నకు కత్తెర బెడద.. నష్టపోతున్న రైతులు
Armay Warm : మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు ప్రభావం తీవ్రంగా ఉంది. పంటపై దాడిచేస్తూ తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. పురుగుమందులకు సైతం లొంగక పోతుండటంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారానికి ఒకటి రెండు సార్లు మందులు పిచికారీ చేస్తున్న దాని ప్రభావం మందు కొట్టిన రోజు మాత్రమే ఉంటుండటం, తరువాత పరిస్ధితి మామూలుగానే మారిపోతుందని రైతులు చెబుతున్నారు.
ఫాల్ ఆర్మివార్ గా పిలిచే కత్తెర పురుగు జీవితకాలం వేసవిలో 30 రోజులు, మిగతా కాలంలో 60 రోజుల వరకు ఉంటుంది. 1500 వరకు గుడ్లు పెట్టటంతోపాటు ఒక చోట నుండి మరో చోటికి వేగంగా వ్యాప్తిచెందుంతుంది. పగలు కంటే రాత్రి సమయంలో వేగంగా ప్రయాణిస్తుంది. మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టాన్ని కలిగించే కత్తెర పురుగు విషయంలో జాగ్రత్తలు పాటించని పక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
కత్తెర పురుగు వ్యాప్తితో ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా మొక్కజొన్న సాగు 25 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుండగా, సేధ్యపు ఖర్చులు పోను 15వేల రూపాయల వరకు మిగులుతుంది. అయితే కత్తెర పురుగు కారణంగా పంట తీవ్రంగా దెబ్బతింటుండటంతో కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్ధితి లేదని అన్న దాతలు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు కత్తెర పురుగు నివారణకు రైతులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. మొక్కజొన్న విత్తనం వేసిన వారం రోజులలోపు ఎకరానికి అరలీటరు వేపనూనెను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 15 నుండి 20 రోజుల మధ్యలో ప్రొఫెనోపాస్ 250 మిల్లీలీటరు ఒక లీటరు వేపనూనె, 200 లీటర్ల నీటిలో కలిపి మిశ్రమాన్ని చల్లుకోవాలి. 20 నుండి 30 రోజుల మధ్యలో ఎకరానికి ఇమామెక్టిన్ బెంజెయట్ 100 గ్రాములు, లీటరు వేపనూనెను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. 35 నుండి 45 రోజుల మధ్యలో అప్పటికీ పురుగు బెడద తగ్గకుంటే కొరజన్ 60మిల్లీలీటరు , వేపనూనె లీటరు, స్టైన్ టారం 100మి.లీ నీటిలో కలిపి పిచికారి చేస్తూ కత్తెర పురుగు ప్రభావం నుండి పంటను కాపాడుకోవచ్చు.
COMMENTS