Aloevera Cultivation : 50వేల పెట్టుబడి.. 10లక్షల ఆదాయం
Aloevera Cultivation : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే దిశగా రైతాంగం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ అదాయం సమకూరే పంటల సాగు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఔషదగుణాలు కలిగిన కలబంద సాగుకు చాలా మంది రైతులు శ్రీకారం చుడుతున్నారు. కలబందనే మరో పేరుతో అలోవేరా అని కూడా పిలుస్తున్నారు. ఇప్పటికే మనదేశంలోని తెలంగాణా, రాజస్ధాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతులు కలబందసాగు చేస్తున్నారు.
కలబందసాగుకు అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి, నీరు నిల్వ ఉండని నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక చలి వాతావరణంలో మినహా మిగిలిన అన్ని వాతావరణ పరిస్ధితుల్లో దీనిని పెంచవచ్చు. నాటిన పదిమాసాల్లోనే ఇది మొదటి కోతకు వస్తుంది. అనంతరం నాలుగునెలలకొకమారు ఆకులు సేకరించుకోవచ్చు. 5సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది.
కలబంద వేరు, పిలక మొక్కల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. దీనిని ఎకరాకు 8వేల నుండి 10వేల పిలకలను నాటుకోవచ్చు. పశువుల ఎరువు తప్ప దీనికి పెద్దగా ఎరువులు వాడాల్సిన పనికూడా లేదు. నీటి పారుదల వసతి ఉన్న ప్రాంతాల్లో అధిక దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటను ఆశించే తీవ్రమైన తెగుళ్ళు పెద్దగా ఏమి ఉండవు.
కలబంద మొక్క ఆకులు 60 సెం.మీ పొడవు, 10సెం.మీ వెడల్పు, 1.5 నుండి 2.0సెం.మీ మందం కలిగి ఉంటాయి. ఈ ఆకులను ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే సేకరించాలి. బాగా పెరిగిన ఆకులను సంవత్సర కాలంలో 3సార్లు కోసుకోవచ్చు. ఆకులతోపాటు పిలకలను అమ్ముకోవటం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు.
కలబంద సాగు చేసిన మొదటి సంవత్సరం 25టన్నుల దిగుబడి వస్తుంది. రెండవ సంవత్సరం 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీనికి పెద్దగా పెట్టుబడి ఖర్చులు కూడా ఉండవు. పిలకలు నాటింది మొదలు కోత వరకు ఎకరానికి 50వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. టన్ను కలబంద ఆకులు ప్రస్తుతం మార్కెట్ లో 15వేల నుండి 25వేల వరకు ధర పలుకుతున్నాయి. ఒక హెక్టారు కలబంద సాగు చేస్తే 40 నుండి 50 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు. అంటే సుమారుగా 7నుండి 10లక్షల మేర అదాయం లభిస్తుంది.
కలబంద వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో ఈ పంటకు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. ఆరోగ్యపరంగా ప్రజలు ఇటీవలికాలంలో కలబందను బాగా వినియోగిస్తున్నారు. ఆయుర్వేదం, ఫేస్ క్రీమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫార్మా, అలువేరా జెల్ వంటి వాటిని కలబందతోనే తయారు చేస్తున్నారు. దీని నుండి తయారైన ప్రొడక్ట్ లు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి.
అయితే కొన్ని కంపెనీలే రైతులతో ముందస్తు అగ్రిమెంట్లు కుదుర్చుకుని వేసిన పంటను కొనుగోలు చేస్తున్నాయి. దీని వల్ల రైతుకు ముందే పంట ధర నిర్ణయించబడుతుంది. కలబంద ఆకులను నేత్రరోగాల నివారణ, అల్సర్లు, చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు, కుష్టు, తదితర వ్యాధుల నివారణలో వినియోగిస్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో కలబందకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
COMMENTS