World Heritage Day : సుసంపన్నమైన భారత చరిత్రకు సాక్ష్యాలు.. ఈ వారసత్వ ప్రదేశాలు!
World Heritage Day : మన చుట్టూ ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచం 'ప్రపంచ వారసత్వ దినోత్సవం' World Heritage Day గా పాటిస్తున్నారు.
భారతదేశం అపారమైన చారిత్రక వైభవాన్ని, ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగింది. ఈ దేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు, అపురూపమైన కళాఖండాలకు నిలయంగా ఉంది. ఇది నిజంగా మానవసృష్టేనా అనిపించేలా.. ఊహకందని రీతిలో పురాతనకాలంలోనే నిర్మించిన ఎన్నో ఆశ్చర్యకరమైన స్మారక చిహ్నాలు నేటికి జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ మనకు వారసత్వంగా లభించిన సంపదలు. వీటిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత.
ఈరోజు ప్రపంచ వారసత్వ దినోత్సవం. అంతర్జాతీయ స్మారక చిహ్నాలు, ప్రదేశాల దినోత్సవం అని కూడా పిలుస్తారు. తమ దేశానికి చెందిన వెలకట్టలేని వారసత్వ సంపద పరిరక్షణకోసం కట్టుబడి ఉండటంతో పాటు యునెస్కోలో భాగమైన ప్రపంచంలోని సభ్యదేశాలు ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 18న 'ప్రపంచ వారసత్వ దినోత్సవం (World Heritage Day) గా పాటిస్తున్నారు. మన సాంస్కృతిక వైవిధ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఈ రోజు గుర్తుచేస్తుంది.
భారతదేశంలో అనేకమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి, అబ్బురపరిచే కళారూపాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కేవలం 42 చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు మాత్రమే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో (UNESCO- United Nations Educational, Scientific and Cultural Organization) గుర్తింపు పొందాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రసిద్ధ రామప్ప దేవాలయం కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
అలాగే హైదరాబాద్ లోని గోల్కోండ- కుతుబ్ షాహీ టూంబ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లేపాక్షి కూడా యునెస్కో జాబితాలో ఉన్నాయి. అయితే వీటికి అధికారిక గుర్తింపు లభించాల్సి ఉంది.
భారత్లోని 5 గొప్ప కట్టడాలు- వారసత్వ ప్రదేశాలు
దేశంలో ఎన్నో గొప్ప చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో కొన్ని..
రామప్ప దేవాలయం:
వరంగల్ నగరానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరిలో రుద్రేశ్వర దేవాలయం ఉంది. దీనినే రామప్ప దేవాలయం అని కూడా పిలుస్తారు. కాకతీయ రాజవంశ పాలకుడైన గణపతిదేవుని కాలంలో 1213 సంవత్సరంలో రేచర్ల రుద్రారెడ్డి ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఎలాంటి పునాదులు లేకుండానే పూర్తిగా ఇసుకరాయిని ఉపయోగించి చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనం. కాలానికి అతీతంగా ఈ ఆలయం నేటికి చెక్కుచెదరకుండా సజీవకళతో ఉండటం నిజంగా ఓ ఆశ్చర్యం.
అజంతా గుహలు:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న అజంతా గుహలు అద్భుతమైమ బౌద్ధ మత కళాఖండాలతో గొప్ప గుర్తింపును పొందాయి. 2వ శతాబ్దం BCE నుంచి 480 CE వరకు పురాతన కాలాలకు చెందిన 30 రాక్-కట్ బౌద్ధ గుహ స్మారక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి.
తాజ్ మహల్:
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో యమునా నదీ తీరాన వెలిసిన తాజ్ మహల్ ఓ అద్భుతమైన కట్టడం. ప్రేమకు చిహ్నంగా ఈ కట్టడం ప్రాచుర్యం పొందింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణించిన తన మూడవ భార్య బేగం ముంతాజ్ మహల్ స్మారకార్థం దీనిని నిర్మించాడు. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా కూడా గుర్తింపు పొందిన ఈ కట్టడం 1983లో UNESCO గుర్తింపు కూడా పొందింది.
కోణార్క్ సూర్య దేవాలయం:
ఒడిషా రాష్ట్రంలోని కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందినదిగా చెప్తారు. 24 రథ చక్రాల మీద, సప్త అశ్వాలతో సూర్య భగవానుడు కదిలివస్తున్నట్లుగా ప్రతీకాత్మక రాతి శిల్పాలతో అందగా అలంకరించి నిర్మించారు. బంగాళాఖాతం తూర్పు తీరంలో మహానది డెల్టాలో వెలిసిన ఈ క్షేత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది.
హంపి:
తూర్పు-మధ్య కర్ణాటకలో ఉన్న హంపి క్షేత్రం ప్రకృతి ఒడిలో రాతి కట్టడాలతో కనువిందు చేసే ఒక అపూరూప దృశ్యం. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా విలసిల్లిన హంపి ఆనాటి అద్భుత కట్టడాలకు సజీవ సాక్ష్యంగా ఉంది.తుంగభద్ర నదీ తీరాన అనేక దేవాలయాలు, పచ్చని పొలాలతో హంపి నగరం నాటి వైభవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది.
ప్రజల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పట్ల అవగాహన మరియు వాటి సంరక్షణ ఆవశ్యకతను తెల్పడం కోసం యునెస్కో ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
ఈ రోజున అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్థారు.
ఐక్యరాజ్య సమితి 1972 తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటిస్తారు. పురాతన కట్టడాలు, స్థలాలు గురించి అధ్యయనం చేయడం వాటి పరిరక్షణ విషయంలో సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవడం మొదలైన అంశాలు ఈ తీర్మానంలో ముఖ్యాంశాలు.
యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారత్ నుండి స్థానం సంపాదించిన ప్రదేశాలు (42). అందులో కొన్ని కింద ఇవ్వబడ్డాయి.
సాంస్కృతిక ప్రదేశాలు (24)
1. ఆగ్రా కోట (1983)
2. అజంత గుహలు (1983)
3. ఎల్లోరా గుహలు (1983)
4. తాజ్ మహల్ (1983)
5. కోణార్క్ సూర్య దేవాలయం (1984)
6. మహాబలిపురం వద్ద గల కట్టడాల సముదాయం (1984)
7. గోవా చర్చులు మరియు కాన్వెంట్లు (1986)
8. ఫతేహ్పూర్ సిక్రీ (1986)
9. హంపి వద్ద గల కట్టడాల సముదాయం (1986)
10. ఖజురహో కట్టడాలు (1986)
11. ఎలిఫంటా గుహలు (1987)
12. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ (1987)
13. పట్టడకళ్ కట్టడాల సముదాయం (1987)
14. సాంచిలోని బౌద్ధ కట్టడాలు (1989)
15. హుమయూన్ టూంబ్ (1993)
16. ఖుతుబ్ మినార్ కట్టడాలు (1993)
17. మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా (1999)
18. బోధ గయాలోని మహాబోధి ఆలయ సముదాయం (2002)
19. భింబెట్కా రాతి గృహాలు (2003)
20. చంపానేర్ పవాగాద్ ఆర్కియాలజికల్ పార్క్ (2004)
21. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్) (2004)
22. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ (2007)
23. జైపూర్ జంతర్ మంతర్ (2010)
24. రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ (2013)
సహజసిద్ధమైన ప్రదేశాలు (6)
1. కాజీరంగా జాతీయ పార్క్ (1985)
2. కియోలాడియో జాతీయ పార్క్ (1985)
3. మానస్ వన్యప్రాణి సంరక్షణాలయము (1985)
4. సుందర్బన్స్ జాతీయ పార్క్ (1987)
5. నందాదేవి మరియు వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ (1988)
6. పశ్చిమ కనుమలు (2012)
COMMENTS