చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారాలివే!
These are the foods to take in the winter : చలికాలంలో వేడివేడి ఆహారపదార్థాలు తినాలనిపిస్తుంది. అయితే చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సీజన్ లో కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ మెనూతో కలిపి తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.
ఈ సీజన్లో ముతక తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలతో చేసిన సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సాయపడతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. చలికాలంలో మన శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఆహారంలో ముతక తృణ ధాన్యాలను చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.
- మొక్కజొన్న, జొన్న, బజ్రా, రాగులను ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో తయారుచేసిన వంటకాలను తినడం మంచిది. రోటీ, దోస వంటి పదార్థాలను తింటుండాలి. ఇవి మన శరీరం బరువును నియంత్రించడంతో పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
- ఈ సీజన్ లో లభించే వివిధ కూరగాయలతో సూప్ తయారు చేసుకుని తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలో నీరు, పోషకాల కొరతను భర్తీ చేస్తుంది. వీటిలో నల్ల మిరియాల పొడిని చేర్చడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. మిక్స్డ్ వెజిటబుల్ సూప్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.
- మెంతికూర, బచ్చలికూర, ఆవాలు వంటి వాటిలో విటమిన్లు ఏ, ఈ, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లంచ్ లేదా డిన్నర్ కోసం ఏదో ఒక రూపంలో వీటిని తినడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు.
- నువ్వులు, పల్లి, బెల్లం లను కలిపి లేదా విడివిడిగా తింటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వీటి ప్రభావంతో వేడి లభించడమే కాకుండా చలికాలంలో మనకు అవసరమైన ఇనుము కూడా లభిస్తుంది. చలికాలంలో వచ్చే చర్మం పొడిబారడం నుంచి బయటపడొచ్చు. టీ లేదా క్యారెట్ పాయసం వంటి వాటిలో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం మంచిది.
- చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. అందుకే చలికాలం అయినప్పటికీ నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు తక్కువగా తాగడం మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
COMMENTS