టర్మ్ బీమా అవసరం లేని సందర్భాలివే
These are the cases where term insurance is not required: జీవిత బీమా అనగానే చాలా మంది టర్మ్ పాలసీ తీసుకొమ్మని సూచిస్తారు. దీని వల్ల తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ పొందొచ్చు. ధూమపానం వంటి అలవాట్లు లేని 30 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.800 నుంచి రూ.1000 ప్రీమియంతో టర్మ్ బీమాను తీసుకోవచ్చు. అయితే, తక్కువ ప్రీమియానికి లభిస్తోందని బీమా కొనుగోలు చేయడం సరైంది కాదు. టర్మ్ బీమా అవసరం లేని సందర్భాలు కూడా ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక మద్దతు లభించాలనే ఉద్దేశంతో టర్మ్ బీమాను రూపొందించారు. అందువల్ల టర్మ్ బీమాలో మరణ ప్రయోజనం మాత్రమే లభిస్తుంది. అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే బీమా సంస్థ పాలసీదారుని నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. పాలసీ కాలపరిమితి ముగిసే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే ఏవిధమైన చెల్లింపులూ చేయరు. అయితే ఆధారిత కుటుంబ సభ్యులు లేని వారికి టర్మ్ పాలసీ అవసరం ఉండదు. మీకు వివాహం కాకుండా ఉండి, తల్లిదండ్రులు ఆర్థికంగా మీపై ఆధారపడే పరిస్థితి లేని సందర్భంలో టర్మ్ పాలసీని తీసుకోనవసరం లేదు. ఒకవేళ మీరు ఉద్యోగి అయ్యి ఉండి పిల్లలుంటే టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. వార్షిక ఆదాయానికి కనీసం 15-20 రెట్లు అధికంగా కవరేజ్ ఉండేలా చూసుకోవాలి. గృహ రుణం వంటివి ఉన్నప్పుడు కూడా టర్మ్ బీమా పాలసీ తీసుకోవడం మంచిది.
మీకు తక్కువ బాధ్యతలు ఉండి స్థిరాస్తులు ఎక్కువగా ఉంటే కూడా జీవిత బీమాను తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ స్థిర, చరాస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి మీరు చెల్లించాల్సిన రుణాలను తీసివేయాలి. మిగిలిన ఆదాయ మొత్తం కుటుంబంలోని సంపాదించే వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువ ఉండాలి. అలాగే పిల్లల చదువు, వివాహం, జీవిత భాగస్వామి రిటైర్మెంట్ తర్వాతి ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని ముందే సమకూర్చుకుని ఉండాలి. ఇలా అన్ని ఆర్థిక అవసరాలకు సరిపోయే డబ్బు ఉన్నప్పుడు టర్మ్ బీమా పాలసీ అవసరం లేదు. లేదంటే టర్మ్ బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి.
టర్మ్ పాలసీకి చెల్లించిన ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే కేవలం పన్ను మినహాయింపు కోసం మాత్రమే జీవిత బీమా కొనుగోలు చేయొద్దు. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, గృహ రుణం వంటి వాటికి కూడా సెక్షన్ 80సి కింద లభించే మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ కుటుంబ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే టర్మ్ బీమాను కొనుగోలు చేయాలి. పన్ను మినహాయింపు అనేది అదనపు ప్రయోజనం కింద మాత్రమే చూడాలి.
COMMENTS