SUSPICIOUS RATION CARDS TELANGANA
సన్నబియ్యమూ తీసుకోవట్లేదు - ఆ 1.6 లక్షల మంది కార్డుదారులేమయ్యారు?
సన్నబియ్యానికీ ముందుకు రాని వారు 1,62,773 మంది - జిల్లాల వారీగా కొనసాగుతున్న విచారణ - ఇప్పటికే 6 వేలకు పైగా కార్డులు అనర్హమైనవిగా గుర్తింపు.
Suspicious Ration Cards Telangana : రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్‌కార్డులపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. కార్డులు, లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతి నెలా రేషన్ బియ్యం పంపిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని తీసుకోవడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ గడిచిన ఆరు నెలల నుంచి బియ్యం తీసుకోని వారి లెక్కలు తీయగా, ఏకంగా 1,62,773 రేషన్ కార్డులు తేలాయి. ఇందులో ఈ నెల 22 వరకు చేపట్టిన విచారణలో 6 వేలకు పైగా రేషన్‌కార్డులు అనర్హమైనవిగా ఆ శాఖ అధికారులు గుర్తించారు.
క్షేత్రస్థాయిలో విచారణ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్‌కార్డే ప్రామాణికం కావడంతో భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల్లో అనేక మంది అనర్హులున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే నెల మొదటివారం నాటికి 90.71 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లుగా ఉంది. వీరి కోసం ప్రతి నెలా 1.90 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వం డీలర్లకు పంపిస్తోంది. ఉచితంగా సన్నబియ్యం పంపిణీ మొదలయ్యాక వాటిని తీసుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నా, లక్ష 60 వేల మంది మాత్రం ముందుకు రావడం లేదు.
దీంతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారి జాబితా తీసి ఆయా మండలాల్లో తహసీల్దార్లతో క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ చేయిస్తోంది. లబ్ధిదారులు చిరునామాలో ఉంటున్నారా? లేదా మరణించారా? అనే వివరాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు వందేళ్ల వయసు పైబడి చనిపోయిన వారు రేషన్ లబ్ధిదారుల జాబితాలో భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరి పేర్లు రెండేసి కార్డుల్లో ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో తేలిన వివరాలను పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి అధికారులు పంపిస్తున్నారు.
సూర్యాపేటలో 100 శాతం విచారణ :
రేషన్‌కార్డుల విచారణలో భాగంగా సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో ఉంది. కామారెడ్డిలో 83.33 శాతం, సిరిసిల్లలో 68.06 శాతం, కరీంనగర్‌లో 63.49 శాతం పూర్తయ్యింది. 12 జిల్లాల్లో మాత్రం ఇంకా ఈ ప్రక్రియ మొదలే కాలేదు. వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, భూపాలపల్లి, గద్వాల, మహబూబాబాద్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు కామారెడ్డిలో 726, సిద్దిపేట 519, ఖమ్మం 371, సిరిసిల్లలో 360, కరీంనగర్ 330, యాదాద్రి 176, మెదక్‌లో 106 రేషన్ కార్డులు అనర్హమైనవిగా తేలాయి. రాష్ట్రవ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత అనర్హుల కార్డులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భారీగానే అనర్హులు : క్షేత్రస్థాయి పరిశీలనలో రేషన్ కార్డుల్లో అనర్హులు భారీగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 22 వరకు 11.13 శాతం కార్డులపై విచారణను పూర్తి చేేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.
అనుమానాస్పద రేషన్‌కార్డులు : 96,240
ఇందులో లబ్ధిదారుల సంఖ్య : 1,62,773
పరిశీలించిన కార్డుల సంఖ్య : 10,712
అనర్హమైనవిగా తేలినవి : 6 వేలకు పైగా
అత్యధికంగా ఈ జిల్లాల్లోనే : అనుమానాస్పద రేషన్‌కార్డులు 5 వేల పైచిలుకు ఉన్న జిల్లాలు ప్రధానంగా ఐదు. నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జాబితాలో ఉన్నాయి. అనర్హమైనవిగా తేలిన 6 వేల కార్డుల్లోనూ అత్యధికంగా సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి.
COMMENTS