FARMERS PROBLEMS IN GRAIN SALES
అటు కొనుగోలు కేంద్రాల్లో 'అదనపు తూకం' - ఇటు రైస్ మిల్లుల్లో 'తరుగు భారం'
కొనుగోలు కేంద్రాల్లో అదనపు తూకం - రైస్ మిల్లుల్లో తరుగు భారం - ధాన్యం విక్రయాల్లో అన్నదాతలు అవస్థలు - తీవ్రంగా నష్టపోతున్న రైతులు.
Farmers Face Fraud in Grain Sales : యాసంగిలో అనేక కష్టాలను అధిగమించి వరి సాగుచేసిన రైతులు ధాన్యం విక్రయాల్లో దగా పడుతున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్ల చేతిలో అన్నదాతలు నలిగిపోతున్నారు. ఎంత నష్టపోతున్నా ఏమీచేయలేని స్థితిలో మిన్నకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒక సంచి బస్తాలో 40 కిలోల ధాన్యం తూకం వేయాలి. అయితే శుద్ధిచేయలేదని, కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది బస్తాకు అదనంగా 2 కిలోల 300 గ్రాముల మేరకు తూకాలు వేస్తున్నారు.
వారి నష్టం అంతటితో ఆగడం లేదు. తర్వాత రైస్‌మిల్లుల్లో ధాన్యం దించే సమయంలో తూకంవేసి చాలారోజులైందని, ధాన్యం బరువు తగ్గిందని, తాలు ఉందన్న కారణాలను చూపుతూ మిల్లర్లు లారీలోడ్‌లో (250కి పైగా క్వింటాళ్లు) సగటున 5 నుంచి 10 క్వింటాళ్లు తరుగు పేరిట కోత విధిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, అదిలాబాద్ జిల్లాలోని కేంద్రాల్లో ఇదే పరిస్థితి. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ప్రభుత్వం గురువారం నాటికి దాదాపు 10 లక్షల మంది రైతుల నుంచి 60.61 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే 80 శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తయ్యాయి.
కొనుగోళ్లు చివరిదశకు వస్తుండటంతో రైస్‌మిల్లర్లు తరుగు పేరిట ఎక్కువగా కోతలు విధిస్తున్నారు. వరి కోతలకు రైతులు పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. నూర్పిడి సమయంలోనే యంత్రంలోనే 90 శాతం ధాన్యం శుద్ధిచేసి, తాలులేకుండా వస్తుంది. కేంద్రాలకు వచ్చాక తేమశాతం చూసుకుంటే సరిపోతుంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో రెండురోజులు ఆరబెడితే చాలు. అకాల వర్షాలకు తడిస్తే మళ్లీ ఆరబెట్టాల్సి వస్తుంది. అయితే నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఎదురుచూడలేక రైతులే అదనపు తూకాలకు ఒప్పుకొంటున్నారు.
విచారణ చేపడితేనే :
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వరకే రైతుల బాధ్యత అని అధికారులు చెబుతుంటారు. వాస్తవంగా రైతులు ధాన్యం మిల్లుకు చేరేవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని రైస్‌మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. దీనిపై రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.
రైతులు నష్టపోతున్నారు ఇలా :
జోగులాంబ గద్వాల జిల్లా అమ్మాయిపల్లికి చెందిన వెంకట్రావు వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించారు. తూకంలో అదనపు భారంతోనే 56 క్వింటాళ్లు వచ్చింది. అతనితో పాటు మరో నలుగురు రైతుల ధాన్యం కలిపి లారీలో ఎర్రవల్లి సమీపంలోని రైస్‌మిల్లుకు తరలించారు. మిల్లర్ మళ్లీ ఒక్కో రైతుకు రెండు క్వింటాళ్లు చొప్పున తగ్గించేశారు.
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు కొనుగోలు కేంద్రంలో 4 రోజుల క్రితం ఏడుగురు రైతులకు చెందిన 250 క్వింటాళ్ల ధాన్యం దహెగాంలోని రైస్‌మిల్లుకు వెళ్లగా, అంతకు ముందు కేంద్రంలోనే బస్తాకు 2 కిలోలకు పైగా అదనపు తూకం వేశారు. అనంతరం మిల్లర్ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తేనే దించుకుంటానని చెప్పడంతో నిస్సహాయస్థితిలో రైతులు అంగీకరించారు.
21 బస్తాల కోతా? :
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతారామనాయక్తండాకు చెందిన భూక్యా గజన్‌లాల్, జమిల్లాల్, సజన్‌లాల్ ఈనెల 2న స్థానిక కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించారు. తూకంలోనే అదనపు నష్టాన్ని భరించారు. అనంతరం 710 బస్తాలతో లారీని ఎల్లారెడ్డిపేటలోని రైస్‌మిల్లుకు తరలించగా అక్కడ 21 బస్తాలు అంటే 8 క్వింటాళ్లకు పైగా తరుగు తీసి 689 బస్తాలుగానే నమోదు చేశారు.
COMMENTS