SUGAR TEST WITH BREATH
ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్- రక్తంతో పని లేదు! మధుమేహం రోగులకు గుడ్ న్యూస్
మధుమేహం వ్యాధిగ్రస్థులకు గుడ్ న్యూస్-శ్వాసతో షుగర్ టెస్టు- ఇక బ్లడ్ తీయక్కర్లేదు!
Sugar Test With Breath : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వ్యాధి షుగర్. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ మధుమేహం వచ్చేస్తోంది. అయితే, ఈ షుగర్ స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్‌తో పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా కేవలం శ్వాసతోనే షుగర్ స్థాయిలను గుర్తించే పరికరాన్ని రూపొందించారు మధ్యప్రదేశ్‌లోని జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు. ఈ క్రమంలో వీరు రూపొందించిన షుగర్ బ్రీత్ ఎనలైజర్ మెషీన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
ఈ మెషీన్ ఎలా పనిచేస్తుందంటే?
షుగర్ పేషెంట్ల కోసం బాలాఘాట్లోని జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి ఒక యంత్రాన్ని తయారు చేశారు. ఈ మెషీన్లో ఒకసారి శ్వాసను ఊదగానే శరీరంలో షుగర్ స్థాయిలను సెకన్లలో తెలుసుకోవచ్చు. పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు. ప్రస్తుతం ప్రొఫెసర్లు, విద్యార్థుల కలిసి రూపొందించిన షుగర్ బ్రీత్ ఎనలైజర్ మెషీన్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. భోపాల్‌లో నిర్వహించిన సృజన్ కార్యక్రమంలో మొత్తం 150 ప్రాజెక్టులు పోటీ పడ్డాయి. ఇందులో బాలాఘాట్ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి రూపొందించిన షుగర్ బ్రీత్ అసిటోన్ 3.0 అనే ప్రాజెక్ట్ తొలిస్థానం దక్కించుకుంది.
షుగర్ బ్రీత్ అసిటోన్ 3.0 మెషిన్ అంటే ఏమిటి?
ఇది సూదిని గుచ్చకుండానే, అంటే శరీరం నుంచి రక్తాన్ని తీయకుండానే షుగర్ స్థాయిని గుర్తించగల పరికరం. ఈ పరికరంలో మనం శ్వాసను ఊదాలి. ఈ యంత్రం కొన్ని సెకన్లలో మీ షుగర్ స్థాయిని తెలియజేస్తుంది. ఇది కచ్చితమైన చక్కెర స్థాయిని వెల్లడించనప్పటికీ, రీడింగ్‌ను మూడు విధాలుగా చూపిస్తుంది. తక్కువ (లో) అంటే శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉందని అర్థం. మితమైనది (మోడరేట్) అంటే చక్కెర స్థాయి సాధారణంగా ఉందని, అధిక(హై) అని చూపిస్తే ఎక్కువగా ఉందని అర్థం. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.
8ఏళ్ల క్రితమే ప్రాజెక్ట్ ప్రారంభం
జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేశ్ అగాసే ఈ ప్రాజెక్టుపై స్పందించారు. "2017లో ఈ ప్రాజెక్ట్ చేయడం ప్రారంభించాం. షుగర్ రోగుల్లో కీటోజెనిక్ జీవక్రియ ప్రారంభమై వారి శరీరం లోపల కీటోన్లు ఏర్పడతాయి. అప్పుడు కీటోన్లలో ఉండే అసిటోన్ వారి శ్వాసలోకి వస్తుంది. అటువంటి పరిస్థితిలో అసిటోన్, గ్లూకోజ్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశాం. దీని ఆధారంగా ఈ యంత్రాన్ని కనుగొన్నాం. దీనికి 2023లో పేటెంట్ లభించింది. ఈ నమూనాలో ఇంజనీరింగ్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అసిటోన్, గ్లూకోజ్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసి వాటి నిష్పత్తిని స్పష్టం చేయడానికి కోడింగ్ చేశాం. తరువాత రెండింటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రోగ్రామింగ్ చేశాం. అనంతరం ఇంజనీరింగ్ సహాయంతో ఈ ప్రాజెక్ట్ పూర్తైంది." అని దుర్గేశ్ అగాసే తెలిపారు.
ఇదొక మంచి ఆవిష్కరణ!
ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి మంచి ఆవిష్కరణ చేశారని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వేదప్రకాశ్ అభిప్రాయపడ్డారు. రక్తాన్ని తీయకుండానే దీనితో షుగర్ టెస్టు చేయొచ్చని చెప్పారు. ప్రతి చక్కెర రోగిలో అసిటోన్ ఉత్పత్తి కాదని, ఇదే విషయంపై ప్రొఫెసర్ దుర్గేశ్ అగాసేతో నిరంతరం చర్చిస్తున్నానన్నారు.
COMMENTS