PREVENTING CHILD DEATHS IN CARS
మీ కారు డోర్‌లాక్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు!
అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత - సెన్సార్ల సాయంతో కారులో ఉన్న చిన్నపిల్లలను సులభంగా గుర్తించే అవకాశం
Preventing Child Deaths in Cars : నిలిపి ఉంచిన కారులో పిల్లలు ఆడుకుంటుండగా సడన్‌గా డోర్లు లాకై ఊపిరాడక మరణించడం, స్పృహ కోల్పోవడం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటి వద్ద కారును పార్కింగ్ చేసినప్పుడు చాలామంది లాక్ చేయకుండా అలా వదిలేస్తుంటారు. ఇదే అదనుగా చిన్న పిల్లలు లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటారు. ఇలాంటప్పుడు అవి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు అరిచినా వినిపించదు. ఈ నేపథ్యంలో వాహనాల్లో చిన్నారులు, పెంపుడు జంతువులు(పెట్స్) ఉంటే వెంటనే అప్రమత్తం చేసే సాంకేతికత అందుబాటులో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ పరికరాలు కారు ఓనర్‌ను అప్రమత్తం చేస్తాయంటున్నారు.
కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఐదేళ్ల చిన్నారి కారులో ఆడుకుంటూ ఊపిరాడక మరణించింది.
ఏపీలోని విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆగి ఉన్న కారులోకి ఎక్కిన 4 చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రేర్ సీట్ రిమైండర్ : కారు పార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ సీట్లో పిల్లలు, పెంపుడు జంతువులు(పెట్స్) ఉన్నాయో? లేదో చూసుకోవాలని అప్రమత్తం చేసేదే రేర్ సీట్ రిమైండర్ వ్యవస్థ. కారు డోర్లను తెరిచినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు ఇది పనిచేస్తుంది. కారు పార్కింగ్ చేసిన తర్వాత ఈ వ్యవస్థ డ్రైవర్ లేదా కారు ఓనర్‌కు ఒక హెచ్చరిక ఇస్తుంది. డోర్ సీక్వెన్సింగ్ సాంకేతికత ఆధారంగా ఇది పనిచేస్తుంది. కొన్ని కార్లు అధునాతన ఫీచర్లలో భాగంగా ఈ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి.
చైల్డ్ డిటెక్షన్ అలర్ట్ : కార్లో పిల్లలు ఉంటే ఈ పరికరం వెంటనే ఫోన్‌కు నోటిఫికేషన్ ద్వారా హెచ్చరికలను పంపిస్తుంది
నిమిషానికోసారి చొప్పున ఈ నోటిఫికేషన్ సెల్‌ఫోన్‌కు వస్తూ ఉంటుంది
దీనికి సంబంధించిన సెన్సార్‌ను వాహనం వెనుకభాగంలో అమర్చాలి.
మీ స్మార్ట్ ఫోన్లోని యాప్‌లో అనుసంధానం చేసుకోవాలి.
కొన్ని వాయిస్‌తో కూడిన హెచ్చరికలు సైతం ఇస్తాయి.
స్పందించకపోతే క్రమంగా హెచ్చరిక సందేశాల తీవ్రతను పెంచుతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం
కారు, ఇతర వాహనం లాక్ చేసేముందు అన్ని సీట్లను తప్పనిసరిగా పరిశీలించడం అవసరం.
వాహనం తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.
వెహికల్స్ సమీపంలో, లోపల ఆటలాడడం సురక్షితం కాదని పిల్లలకు చెప్పడం అవసరం.
వాహనం పార్కింగ్ చేసిన తర్వాత కచ్చితంగా లాక్ చేయడం ఉత్తమం.
వాహనాల కిటికీలకు నలుపు తెర(బ్లాక్ మిర్రర్), అధిక డెంటింగ్ ఉండకూడదు. రవాణాశాఖ వారి నిబంధనలు పాటించాలి.
ఉపయోగంలో లేని వాహనాలైనా సరే తలుపులు, కిటికీలు మూసి తాళం వేయాలి.
పిల్లలు ఇంట్లో లేదా సమీప ప్రాంతాల్లో కనిపించకపోతే వెంటనే వాహనాల్లో పరిశీలించాలి.
COMMENTS