The old woman trapped between two walls.
వామ్మో.. బామ్మ! రెండు గోడల మధ్య ఇరుక్కుని వృద్ధురాలు విలవిల.. ఆ తర్వాత జరిగిందిదే..
చీపురు కట్టకోసం వెళ్లిన ఓ వృద్ధురాలు రెండు ఇళ్ల గోడల మధ్య పొరబాటున ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా వృద్ధురాలు బయటకు రాలేకపోయింది. దీంతో భయంతో వృద్ధురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు పోగై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి మహిళను క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
చెన్నైలోని మణలి కామరాజర్ వీధిలోని నివాసంలో బొమ్మి (60) అనే మహిళకు ఇంకా వివాహం జరగలేదు. ఒంటరి అయిన సదరు మహిళ బంధువులతో కలిసి నివసిస్తుంది. శనివారం ఇంట్లో బంధువులంతా తిరుపతి ఆలయానికి వెళ్లారు. ఇంట్లో ఓంటరిగా ఉన్న బొల్లి.. బంధువులు ఇంటికొచ్చే సమయానికి ఇళ్లంతా శుభ్రం చేద్దామని అనుకుంది. అంతే మేడపై ఆరబెట్టిన ఇల్లు తుడిచే కర్ర తెచ్చేందుకు వెళ్లింది. దానిని తీసుకువస్తున్న క్రమంలో పొరబాటున వారి ఇల్లు, పక్కింటికి మధ్య ఉన్న చిన్న సందులో పడిపోయింది. దానిని తీయడానికి ఆమె ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో సందులోకి వెళ్లి తీయడానికి ప్రయత్నించింది. అదే అమె చేసిన పొరబాటు. అనుకోకుండా రెండు ఇళ్ల గోడల మధ్య చిక్కుపోయిన మహిళ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది.
దీంతో ఆమె భయంతో కేకలు వేయగా.. విన్న పొరుగువారు పరిగెత్తుకుంటూ వచ్చి బొమ్మిని బయటకు లాగడానికి ప్రయత్నించారు. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే తిరువొత్తియూర్ జోనల్ కమిటీ చైర్మన్ ఎ.వి. అరుముగం, మనాలి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 3 గంటలపాటు శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మహిళ వీపు, ముఖంపై స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
COMMENTS