Grandpa was furious when he got married again.
Hyderabad: తాతకు మళ్లీ పెళ్లంటే ఎగిరి గంతేశాడు.. కట్‌చేస్తే లబోదిబోమంటూ రోడ్డెక్కాడు!
కష్టపడకుండా తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు దొడ్డి దారులు పనికిరావనేది అందుకే..! పెళ్లి సంబంధాల ఆశ చూపి వయసు మీరిన తాతలకు గేలం వేసి మోసాలకు పాల్పడున్న ఇద్దరు కిలాడీ లేడీలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వృద్ధాప్యంతో పండిపోయిన తాతలకు మళ్లీ పెళ్లి చేస్తామంటూ నమ్మబలికి అందినకాడికి దోచుకుని ఉడాయిస్తున్న ఈ పెళ్లిళ్ల పేరమ్మలను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. సీఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన కటారు తాయారమ్మ అలియాస్ సరస్వతి గృహిణి. కొంతకాలం క్రితం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని పిఅండ్‌టీ కాలనీకి సరస్వతి షిఫ్ట్ అయింది. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కూనపరెడ్డి స్వాతి కూడా గృహిణి. ఆమె గత కొంతకాలంగా మల్కాజిగిరిలోని సత్యనాగేంద్ర కాలనీలో నివాసం ఉంటోంది. గతంలో ఈ ఇద్దరి కుటుంబాలు పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉండేవి. ఈ సమయంలో సరస్వతి, స్వాతికి పరిచయం ఏర్పడింది. వారి వారి భర్తల సంపాదనలు సరిపోక అడ్డదారుల్లోనైనా డబ్బులు కూడబెట్టాలని అనుకున్నారు. ఇందుకు ఓ పథకం కూడా పన్నారు. వీరి ప్లాన్‌లో భాగంగా మ్యారేజి బ్యూరో ప్రారంభించినట్లు, ఇందులో ఒంటరి వృద్ధులకు పెళ్లి సంబంధాలు చూస్తామని ఓ దినపత్రికలో ప్రకటనలు ఇచ్చారు.
ఈ ప్రకటన చూసిన ఖమ్మం జిల్లా మధిర జామాపురానికి చెందిన ఇరుకుమాటి చిన్నకొండయ్య (80) అనే వృద్ధుడి కంట పడింది. గతంలో అతడు ధర్మహోమియో మెడికల్ ప్రాక్టిషనర్‌గా పనిచేసేవాడు. పదేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. గతేడాది అక్టోబరులో పేపర్‌లో వచ్చిన పెళ్లి ప్రకటన చూసి స్వాతి, సరస్వతిని ఫోన్‌లో సంప్రదించాడు. వారు అందమైన మహిళ ఉందని, హైదరాబాద్‌కు రావాలని ఫోన్‌లో చెప్పారు. దీంతో సదరు తాతగారు గంపెడు ఆశతో హైదరాబాద్‌కు వచ్చాడు. పెళ్లి మాటలు రెండురోజుల పాటు జోరుగా సాగాయి. అనంతరం ఇద్దరు లేడీలు ఆయన్ని సికింద్రాబాద్‌లోని ఓ షోరూంకు తీసుకెళ్లి చీరలు, సారెలు, పలు రకాల వస్తువులు భారీగా కొనిపించారు. అనంతరం మళ్లీ కలుస్తామని చెప్పి.. వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం చిన్నకొండయ్య ఫోన్‌చేయగా వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయన రూ.1.77 లక్షలు కాజేశారని సదరు మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ మహంకాళి పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.
COMMENTS