KARPOORAVALLI HEALTH BENEFITS
ఇంటి ఆవరణలో కనిపించే ఈ ఆకును లైట్ తీసుకోకండి! - తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలట!
జలుబు, దగ్గు, గొంతు వాపు నుంచి ఉపశమనం - ఈ ఆకుల వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
Karpooravalli Health Benefits: కర్పూరవల్లి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధ మొక్క. దీనిని ఇండియన్ బొరేజ్ లేదా మెక్సికన్ మింట్, వామాకు అని కూడా పిలుస్తారు. ఇంటి చుట్టుపక్కల, కుండీల్లో ఎక్కడైనా దీన్ని పెంచుకుంటుంటారు. అయితే చాలా మంది ఈ వామాకుతో బజ్జీలు, పచ్చడి సహా ఇతర వంటలు చేస్తుంటారు. అయితే దీనిని కేవలం వంటల్లో ఉపయోగించడానికి మాత్రమే కాకుండా నేరుగా తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.
శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం :
కర్పూరవల్లి ఆకులు జలుబు, దగ్గు, లారింగైటిస్, బ్రోన్కైటిస్, ముక్కు దిబ్బడ, నోటి, గొంతు వాపు నుంచి ఉపశమనానికి దోహదపడుతుందని పలు పరిశోధనలో తేలినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను మరగకాచి, ఆవిరి పడితే ఛాతీలో పేరుకున్న కఫం కరుగుతుందని, అంతేకాకుండా ఈ ఆకు రసాన్ని ఛాతీపై పూసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభం అవుతుందని పేర్కొంటున్నారు. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కూడా ఈ వామాకు దోహదపడుతుందని, ఆయుర్వేదంలో దీన్ని కడుపు ఉబ్బరం, అలసట, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి వివిధ చికిత్సలకు ఉపయోగించే వారని National Library of Medicine పేర్కొంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :
వామాకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని తెలుపుతున్నారు. ఆకలి తక్కువగా ఉన్నవారిలో ఆకలిని పెంచడానికి కూడా ఇది దోహదపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. భోజనం తర్వాత కొన్ని ఆకులను నమిలితే జీర్ణక్రియ సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు.
కిడ్నీ ఆరోగ్యం :
కర్పూరవల్లి ఆకులను తినడం లేదా కషాయం తాగడం వల్ల కిడ్నీల్లో ఉప్పు నిల్వలు కరిగిపోతాయని పలు అధ్యయనాల్లో తేలినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను తినడం వల్ల కిడ్నిలో రాళ్లు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడిస్తున్నారు.
డయాబెటిస్ నియంత్రణ :
ఆకులు లేదా రసం అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కర్పూరవల్లి దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు.
నోటి ఆరోగ్యం :
కర్పూరవల్లిలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఆకులను నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గి, నోటి దుర్వాసన, ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుందని వివరిస్తున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :
కర్పూరవల్లిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని, ఫలితంగా అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుందని వివరిస్తున్నారు.
నొప్పి, వాపు తగ్గిస్తుంది :
నొప్పి, వాపు వంటి సమస్యలతో బాధపడేవారికి కర్పూరవల్లి ఆకులు ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పుల వల్ల వచ్చే బాధను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయని పేర్కొంటున్నారు. ఈ ఆకుల రసాన్ని ఎముకలు, కీళ్ల నొప్పులపై రుద్దడం వల్ల నొప్పి లేదా వాపు నుంచి ఉపశమనం పొందవచ్చనని వివరిస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో కర్పూరవల్లిని రుమాటిక్, కీళ్ల, తలనొప్పి, నాడీ సంబంధిత నొప్పి నుంచి ఉపశమనం కోసం ఉపయోగిస్తున్నారని National Library of Medicine పేర్కొంది.
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ : కర్పూరవల్లి ఆకుల్లో యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు వల్ల శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా అజీర్తి, నోటి పుండ్లు, చర్మ ఇన్ఫెక్షన్లు, వెక్కిళ్లు, కడుపు నొప్పి నుంచి ఈ ఆకులు ఉపశమనం అందిస్తాయని వివరిస్తున్నారు.
చర్మ సంరక్షణలో :
కర్పూరవల్లిలోని ఔషధ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు చర్మంపై ఏర్పడే వాపు, ఎరుపు, దురద, మంటను తగ్గిస్తుందని, అంతే కాకుండా ఈ ఆకులు కీటకాల కాటు, దద్దుర్లు, తామర వాపు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు కూడా ఉపయోగిస్తారని International Journal of Pharma Research and Health Sciences అధ్యయనంలో పేర్కొంది.
NOTE: కర్పూరవల్లికు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS