FAKE BIRTH CERTIFICATES ISSUE
మూతపడిన హాస్పిటల్ నుంచి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు - తీగలాగితే డొంక కదిలింది.
మూతపడ్డ మెట్రో ఆసుపత్రి నుంచి 73 సర్టిఫికెట్లు - భారీగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు.
Fake birth and death certificates Issue : హైదరాబాద్ నగరంలో నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల డొంక కదిలింది. 4 నెలల కిందట మూతపడిన హాస్పిటల్ నుంచి 65 జనన, 8 మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. దీనిపై పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం వెంటనే స్పందించి వాటిని క్యాన్సిల్ చేసింది. మరో ఘటనలో ఇతర ప్రాంతాల్లో జన్మించిన నలుగురు పిల్లలకు జీహెచ్‌ఎంసీ ద్వారా సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఈ రెండు ఘటనలతో ప్రమేయమున్న అధికారులు, సిబ్బందిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆర్.వి.కర్ణన్ పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లుగా జీహెచ్‌ఎంసీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అనుమానం వచ్చి : టోలీచౌకిలోని మెట్రో హాస్పిటల్ కొన్నాళ్ల కిందట మూతపడింది. అయినప్పటికీ సదరు ఆసుపత్రి నుంచి తరచూ జనన, మరణాలను ధ్రువీకరిస్తూ బల్దియాకు వివరాలు వెళ్తూనే ఉన్నాయి. డాక్టర్ సంతకంతో పలువురు శిశువులకు జనన, ఎనిమిది మందికి మరణ ధ్రువీకరణ పత్రాలు (డెత్ సర్టిఫికెట్) జారీ చేయాల్సిందిగా అర్జీలు వెళ్లాయి. వాటన్నింటినీ మెహిదీపట్నం సర్కిల్ ఆఫీస్ సిబ్బంది ఆమోదించారు. తాజాగా పోలీసులు ఆ ఆసుపత్రిపై బల్దియాకు ఫిర్యాదు చేయడంతో సర్కిల్ వైద్యాధికారి ఇర్షాద్ విచారణ చేపట్టారు.
హాస్పిటల్ నాలుగు నెలలుగా పనిచేయట్లేదని తేల్చారు. సదరు దవాఖానా ద్వారా జారీ చేసిన 73 సర్టిఫికెట్లను రద్దు చేశారు. తదుపరి విచారణలో సర్టిఫికెట్లు పొందిన వారి పేర్లు రియల్వా?, ఫేక్వా?, వారు ఎందుకు తీసుకున్నారు, హాస్పిటల్ ఎందుకు జారీ చేసింది? వంటి పలు ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని, ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. చట్ట ప్రకారం హాస్పిటల్తో పాటు డాక్టర్ గుర్తింపు రద్దు చేయాలని, చర్యలు తీసుకోవాలని కమిషనర్ కర్ణన్ సంబంధిత శాఖలకు లేఖ రాశారు.
స్పందించిన యంత్రాంగం :
ఇతర జిల్లాల్లో, రాష్ట్రాల్లో జన్మించిన పిల్లలకు కొందరు అధికారులు నగరంలో పుట్టినట్లుగా జనన ధ్రువీకరణ పత్రాలు (ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు) ఇస్తున్నట్లు ఇటీవల పత్రికల్లో కథనం ప్రచురితమైంది. దానిపై ఆరోగ్య విభాగం అధికారులు అంతర్గత విచారణ (ఇంటర్నల్ ఎంక్వైరీ) చేపట్టి సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించారు. గత కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలతో ‘హోమ్ బర్త్’ కేటగిరీలో జారీ అయిన 74 సర్టిఫికెట్లను తనిఖీ చేశామని, అందులో శిశువిహార్‌లోని అనాథ పిల్లలకు జారీ చేసిన 38 సర్టిఫికెట్లున్నాయని బల్దియా వెల్లడించింది. మిగిలిన వాటిలో 4 నకిలీవి ఉన్నట్టు గుర్తించింది. ధ్రువపత్రాలు పొందిన తల్లిదండ్రులు, నకిలీ అఫిడవిట్ ఇచ్చిన న్యాయవాది, తనిఖీ రిపోర్టులో సంతకం చేసిన పొరుగింటి వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. అందుకు సహాయపడిన మలక్‌పేట, ఫలక్‌నుమా సర్కిళ్ల హెల్త్ అసిస్టెంట్లను జాబ్ నుంచి తొలగించారు.
COMMENTS