FAKE MEDICINE IN HYDERABAD
మీరు కొంటున్న మెడిసిన్ అసలైనవా? నకిలీవా? - ఇలా సింపుల్‌గా గుర్తించండి.
మార్కెట్లో నకిలీ మందుల హల్చల్ - అసలు కల్తీ ఏవిధంగా జరుగుతోంది? - నకిలీ మందులను ఏవిధంగా గుర్తించాలి?
Fake Medicine In Hyderabad : హైదరాబాద్ నగర మార్కెట్లో నకిలీ మందులు(ఫేక్ మెడిసిన్) హల్చల్ చేస్తున్నాయి. వీటిని ఉత్తరభారత్‌లోని కాశీపూర్(ఉత్తరాఖండ్), ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్(యూపీ) తదితర ప్రాంతాల్లోనే కాకుండా నగరం కేంద్రంగా తయారు చేస్తున్నట్లుగా అధికారుల సోదాల్లో తేటతెల్లమైంది. గతంలో ఎల్‌బీనగర్, మూసాపేట, మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, దూలపల్లి, సుల్తాన్ బజార్, ముసారంబాగ్ తదితర ప్రాంతాల్లోని ఔషధ దుకాణాల్లో నకిలీ మెడిసిన్‌ను డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ రూల్స్ లేబిలింగ్ చట్టంలోని షెడ్యూల్ హెచ్2 కిందకు వచ్చే టాప్ 300 ఫార్మూలా బ్రాండ్స్‌ను కల్తీ చేసి మార్కెట్లోకి తరలిస్తున్నట్లుగా తెలిసింది.
కల్తీ ఏ విధంగా జరుగుతోందంటే? :
అధిక శాతం మంది కొనుగోలు చేసే ఖరీదైన మెడిసిన్‌ను కల్తీ చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. చాక్‌పీస్ పొడి, మొక్కజొన్న, బంగాళదుంప పిండితో తయారు చేసి బ్రాండెడ్ మందుల తరహాలో ప్యాకింగ్‌చేసి దుకాణాలకు సరఫరా చేస్తారు. మరికొందరు ఒక టాబ్లెట్‌లో నిర్ణీత మొత్తం కంటే తక్కువ ఔషధం పెట్టి విక్రయిస్తారు. దీంతో పేషెంట్ల శరీరానికి సరిపడా ఔషధం అందక రోగం తగ్గకపోగా వ్యాధి ఇంకా ముదిరిపోతుంది. ఇంకొన్నిసార్లు ప్రమాదకరమైనటువంటి కెమికల్స్‌తో తయారు చేసి గోలీలు, ఇంజక్షన్లలో నింపుతున్నారు. వీటిని వాడటం ద్వారా రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అధికారులు వివరిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల మెడిసిన్ అమ్మకాల్లో ఎక్కువగా క్యాన్సర్, అధిక కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్, మధుమేహం(షుగర్ వ్యాధి), నొప్పి నివారణ, యాంటీ అల్సర్లు, యాంటీబయోటిక్స్, థైరాయిడ్ తదితర రోగాలకు సంబంధించినవే అధికంగా ఉంటాయని చెబుతున్నారు.
ఎలా గుర్తించాలంటే :
రూల్స్ ప్రకారం ఎక్కువగా అమ్ముడయ్యేటువంటి టాప్ బ్రాండ్ మెడిసిన్‌పై విధిగా క్యూఆర్ కోడ్, బార్‌కోడ్ ఉంటాయి. వాటిని విక్రయించే సమయంలో స్కాన్ చేస్తే రియల్‌దా, నకిలీదా అన్నది తేలిపోతుంది. ఏమాత్రం సందేహం కలిగినా కొనుగోలు దారులు చెక్ చేసుకోవాలి. వాటిని స్కాన్ చేశాక యూనిక్ ప్రొడెక్ట్ ఐడెంటిఫికేషన్ కోడ్, మందు జనరిక్ నేమ్, బ్రాండ్ పేరు, తయారీ ప్రాంతం, తేదీ, బ్యాచ్ నంబరు, గడువు తేదీ, లైసెన్సు నంబరు డిస్ప్లే అవుతాయి. ఒరిజినల్‌దో లేదా కూడా తెలుస్తుంది. సదరు ఔషధ ప్యాకింగ్‌పై బార్‌కోడ్, క్యూఆర్ కోడ్ లేకపోయినప్పటికీ వాటిని స్కాన్ చేసిన తర్వాత వివరాలు కనిపించకపోయినా అది నకిలీ కిందే గుర్తించాలని అధికారులు చెబుతున్నారు.
ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు
2023 నుంచి ఇప్పటివరకు పట్టుకున్న నకిలీ మందుల విలువ- రూ. 1.73 కోట్లు
నగరంలో తనిఖీలు చేసిన మందుల దుకాణాలు- 90
రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న మందుల దుకాణాలు - 17
క్యూఆర్ కోడ్ పరిశీలనతో చేసిన తనిఖీలు- 296
గుర్తించిన అనుమానిత మెడిసిన్ రకాలు- 06
కల్తీలపై కంప్లైంట్ చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబరు- 1800 599 6969 (ఉదయం 10.30 నుంచి సా. 5 గంటల వరకు)
COMMENTS