HAWALA NETWORK IN HYDERABAD
కమీషన్ ఇస్తే చాలు - ఎంత సొమ్మయినా ఎక్కడికైనా తరలించేస్తారు!
హైదరాబాద్ నగరంలో ఏళ్లుగా పాతుకు పోయిన హవాలా గ్యాంగ్ - ఏటా రూ.వందలకోట్ల హవాలా దందా - టీజీన్యాబ్ దర్యాప్తులో వెలుగులోకి కొత్తకోణం.
Massive Hawala Racket In Hyderabad : హైదరాబాద్ నగరంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన హవాలా నిర్వాహకులు దేశ, విదేశాల్లో ఎక్కడికైనా ఎంతడబ్బునైనా క్షణాల్లోనే చేరవేస్తారు. సర్కారుకు పైసా పన్ను చెల్లించే అవకాశం లేకుండా రూ.వందలకోట్లు దేశ సరిహద్దులను దాటించగలరు. డ్రగ్స్, సైబర్‌క్రైమ్ లాంటి చీకటి కార్యకలాపాల ద్వారా కాజేసినటువంటి ప్రజాధనం బడాబాబుల నల్లధనం(బ్లాక్ మనీ) వేర్వేరు బ్యాంకు అకౌంట్లు, వ్యక్తుల చేతులు మారి గమ్యానికి చేర్చటమే హవాలా ఏజెంట్ల చాకచక్యం.
గతంలో ఇలాంటి ఘటనలు :
2023 సంవత్సరంలో బంజారాహిల్స్‌లో ఓ ఖరీదైన కారులో తరలిస్తున్నటువంటి రూ.3.35కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు జూబ్లీహిల్స్‌లో అందజేసేందుకు బయల్దేరి పోలీసులకు పట్టుబడ్డారు.
2024లో సుల్తాన్‌బజార్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.1.21కోట్ల డబ్బు దొరికింది. ముంబయిలోని బబ్లూ అనే వ్యక్తి ఆదేశాలతో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 2 డబ్బుతో వెళ్తూ పోలీసులకు చిక్కారు.
నైజీరియా డ్రగ్ డాన్ ఎబుకా సూజీ ఫారెక్స్ ఏజెంట్ల ద్వారా రూ.120 కోట్లను పలు దేశాలకు చేరవేశాడు. ఆధారాలు(ఎవిడెన్స్) లభించటంతో టీజీన్యాబ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఇటీవల పోలీసులు చేధించిన హవాల రాకెట్‌లో :
ఇటీవల టీజీన్యాబ్ అధికారులు ఛేదించిన అంతర్జాతీయ హవాలా రాకెట్‌లో ఫారెక్స్ ఏజెంట్లు నగదు తరలింపులో 40శాతం కమీషన్ తీసుకున్నట్లుగా వెల్లడైంది. కోటి రూపాయల నగదు మార్పిడికి రూ.40లక్షలు వీరి చేతికి చేరింది. దీనిలో దళారులు, సహాయకులకు పంచగా 30శాతం వీరి జేబుల్లోకి చేరినట్లుగా తేలింది.
ఇప్పుడేం జరుగుతుందంటే :
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్, బేగంబజార్, సికింద్రాబాద్, సుల్తాన్‌బజార్, అబిడ్స్, ఛత్రినాక, బంజారాహిల్స్, కాటేదాన్ కేంద్రంగా అధికశాతం హవాలా నిర్వాహకులు చక్రం తిప్పుతున్నారు. హవాలా మార్గం ద్వారా లక్ష రూపాయలకు రూ.1000 కమీషన్ తీసుకొని దళారులతో చేరవేస్తారు. వారి ఆనవాళ్లు బయటపడకుండా కోడ్ భాషను కూడా ఉపయోగిస్తారు.
ఎన్నికలు, అత్యవసర సమయాల్లో పోలీసులు చేసే తనిఖీల్లోనే ఏటా రూ.100-200 కోట్లు నగదు పట్టుబడుతుంటుంది. రోజూ సోదాలు జరిపితే ఏటా రూ.2-3వేల కోట్ల హవాలా సొమ్ము పట్టుబడుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు.
COMMENTS