New Traffic Rules 2025
ఇకపై ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే తాట తీస్తారు.. కొత్త నిబంధనలు తెలుసుకోండి.. లేదంటే జీతం ఇవ్వాల్సిందే.
భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల కారణంగా చాలా మంది చనిపోతున్నారు. వేగ పరిమితిని అతిక్రమించి అతి వేగంగా వాహనాన్ని నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్‌లను అనుసరించకపోవడం వంటి పలు కారణాల కారణంగా దేశంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగిన వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది వాహనదారులు తమ ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తుండటం వలన ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అందుకే ఇటీవల కేంద్రం మార్చి 1 నుంచి కొత్త, కఠినమైన మోటారు వాహన జరిమానాలను అమలు చేసింది.
దీంతో ఇకపై ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జేబులకు చిల్లులు పడటం కాయం. గతంలో ఉన్న జరిమానాలతో పోలిస్తే, ఇప్పుడు వాటిని 10 రేట్లు పెంచారు. అందుకే తప్పు చేసి ఫైన్‌లు కట్టడం కంటే జాగ్రత్తగా ట్రాఫిక్ నియమాలు పాటించడం ఉత్తమం. అలాగే కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా విధిస్తారు. దీని ద్వారా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిని అరికట్టడంతో పాటు దేశవ్యాప్తంగా రహదారి భద్రతను పెంచడానికి వీలవుతుంది.
హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపినట్లయితే గతంలో రూ.100 జరిమానా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని భారీగా పెంచారు. ఇకమీదట ఇలాంటి కేసులపై రూ.1000 ఫైన్ విధిస్తారు. అంతే కాకుండా, మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయించే అవకాశం కూడా ఉంది. ఇక మద్యం తాగి వాహనం నడిపితే.. రూ.10,000 జరిమానా లేదంటే పరిస్థితిని బట్టి 6 నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
అదే విధంగా రెండోసారి కూడా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడినట్లయితే రూ.15,000 జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇవి గతంలో రూ.1,000 నుంచి మొదలుకొని రూ.1,500 మాత్రమే ఉండేది, అయితే ఇప్పుడు వాటి పక్కన మరో సున్నా యాడ్ చేసి జరిమానాలు భారీగా పెంచారు. సీట్ బెల్ట్ లేకుండా కారును నడిపితే ఇకపై రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడినట్లయితే గతంలో రూ.500గా ఉన్న జరిమానా ఈ సారి ఏకంగా రూ.5,000కు పెరిగింది. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా రోడ్లపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, రయ్ మంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో వారిని కట్టడి చేయడానికి ఇకపై రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే ప్రమాదకరమైన డ్రైవింగ్ లేదా రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా స్టంట్, రేసింగ్ లాంటివి చేస్తే రూ.5000 జరిమానా ఉంటుంది.
ముఖ్యంగా అంబులెన్స్‌ల వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినట్లయితే రూ.10,000 జరిమానా ఉంటుంది. నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా ఉల్లంఘనలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని కట్టడి చేయడానికి సిగ్నల్ జంపింగ్ లాంటివి చేసిన వారు ఇకపై రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంది. ఓవర్‌లోడ్ వాహనాలకు రూ.20,000 జరిమానా ఉంటుంది. వీటితో పాటు మరిన్ని ఫైన్‌లు కూడా భారీగా పెరిగాయి.
COMMENTS