A YOUNG WOMAN EXCELLING IN BUSINESS
ఆ ఒక్క ఐడియా యువతి జీవితాన్నే మార్చేసింది - ఏడాదికి రూ.కోటి ఆదాయం తెచ్చిపెట్టేలా చేసింది.
'కోహ్ ఫుడ్స్' పేరుతో వ్యాపారం రంగంలో రాణిస్తున్న యువతి - కూరగాయలతో ఒరుగులు, పొడుల తయారీ - ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ చదివిన యువతి - ఉద్యోగం మానేసి సొంతూరిలో బిజినెస్.
Young Girl Excels In Business : ఒకసారి ఈ యువతి తండ్రి మిర్చి పంట వేశారు. పంట కోత దశకు వచ్చినా కోయకుండ అలానే వదిలేశారు. అదేంటని కుమార్తె ప్రశ్నించగా పంట కోసి అమ్మితే వచ్చే లాభం కన్నా దానికయ్యే ఖర్చు ఎక్కువ అని చెప్పారు. రైతులందరికీ ఇలాంటి సమస్యలే ఎదుర్కుంటున్నారని గ్రహించిన ఈ యువతి కోహ్ పుడ్స్ ప్రారంభించింది. కూరగాయలు, పండ్లకు ధరలు లేననప్పుడు వృథాగా పారేయకుండా ఎక్కువకాలం నిల్వ ఉండే ఒరుగులు, పొడులను తయారు చేస్తోంది.
ఒరుగులు, పొడుల వ్యాపారంలో రాణిస్తున్న యువతి :
సూర్యాపేట జిల్లా తొండ గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, విజయలక్ష్మి దంపతులు కుమార్తె కీర్తి ప్రియ. కోదాడలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి బిట్స్ పిలానీలో బీ-ఫార్మసీ చదివింది. ఐఐఎం కోల్‌కతా నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. ముంబై, బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసింది. అయితే, రైతులకు గిట్టుబాటు ధరలేక పోవడం, పండించిన పంటను పారబోయడం చూసి ఆసంసతృప్తికి గురైంది.
వ్యవసాయ మూలాలున్న కుటుంబంలో జన్మించిన కీర్తి ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరికి వచ్చేసింది. రైతు సమస్యలకు ఏదోరకంగా పరిష్కారం చూపాలని భావించి డ్రై- ఫుడ్ వ్యాపారం ప్రారంభించింది. సేంద్రియంగా పండించిన కూరగాయలు, పండ్లను రైతుల నుంచి నేరుగా సేకరిస్తోంది. ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో గ్రేడింగ్ చేసి వాటిని ఒరుగులు, పొడుల రూపంలోకి మార్చి విక్రయిస్తోంది.
"ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను. వారి కష్టాలు తెలుసు, అందుకే వారి జీవితంలో అస్థిరత్వాన్ని తగ్గించేందుకు ఏదైనా చేయాలనుకుని ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాను. కోహ్ ఫుడ్స్ అనే పేరుతో ఆహార పొడులు, ఒరుగులు తయారు చేస్తున్నాను. ప్రస్తుతం 15 -20 మంది మహిళలు మా వద్ద పనిచేస్తున్నారు. మరో 30 -40 మంది రైతులతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. మాతో 70-100 మంది ఈ ప్రక్రియలో భాగస్వామ్యులవుతున్నారు."- కీర్తి ప్రియ, కోహ్ ఫుడ్స్ వ్యవస్థాపకురాలు
ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలతో :
ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆహార ఉత్పత్తుల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉండటం గమనించింది కీర్తి ప్రియ. తన ప్రొడక్ట్స్ అందుకు భిన్నంగా ఉండాలని నిర్ణయించుకుంది. రైతుల సహకారంతో సేంద్రియ పద్థతిలో కూరగాయలు పండించి వాటితో ఆహార ఉత్పత్తులుగా అందించాలని భావించింది. అన్నదాతలు పండించిన కూరగాయలు, పండ్లు సేకరించి స్థానికంగా ఫుడ్ ప్రాసెస్ చేసేలా కోహ్ ఫుడ్స్ యూనిట్ ఏర్పాటు చేసిందీ మహిళామణి. ప్రస్తుతం ఆకుకూరలు, క్యారెట్, బీట్ రూట్, అల్లం, పచ్చి మిర్చి వంటి పదార్థాలతో పొడులు, ఒరుగులు తయారు చేస్తోందీ యువతి. మెుత్తం15 రకాల కాయగూరలు,పండ్లతో 12 రకాల డీహైడ్రేటెడ్ ఆహార ఉత్పత్తులు చేస్తున్నట్లు వివరిస్తోంది. ఇవేగాక సపోటా, మామిడి వంటి పండ్లతో క్యాండీలనూ తయారు చేస్తున్నామని చెబుతోందీ మహిళా వ్యాపారవేత్త.
ఆహారోత్పత్తులను విదేశాలకూ ఎగుమతి చేస్తూ :
కోహ్ పుడ్స్ యూనిట్‌లో తయారవుతున్న పొడులను ఇడ్లీ, దోస, ఆమ్లెట్, రోటీ, మిల్క్‌షేక్ వంటి వాటిలో కలిపి తింటే రుచితో పాటు పోషకాలూ శరీరానికి అందుతాయని చెబుతోంది కీర్తి. రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నామని అంటోంది. వాటిని ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తూ ఈ ఏడాది కోటి రూపాయలు వరకు వార్షిక ఆదాయం పొందినట్లు చెబుతోంది కీర్తి.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్యను పెంచి మరింత మందికి ఉపాధి కల్పిస్తానంటోంది కీర్తి. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు తయారు చేసి దేశవిదేశాలకు వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యం అంటోందా యువతి. సొంతూరులోనే కోహ్ ఫుడ్ ప్రారంభించి మహిళలు, రైతులకు ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోందీ లేడీ ఎంట్రప్రెన్యూర్.
COMMENTS