Suffering from bloating? - Doing this will empty your stomach like a balloon!
కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా? - ఇలా చేస్తే బెలూన్ ఖాళీ అయినట్టుగా పొట్ట ఖాళీ అవుతుంది!
How To Stop Gas Pain : ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమకు దూరంగా ఉండడం వంటి కారణాల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు. పిల్లలు కూడా గ్యాస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇలా కడుపు పట్టేసినట్టుగా ఉండడానికి కారణాలు ఏంటి ? నేచురల్‌గా ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి ? అనే విషయాలను ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ 'డాక్టర్ టి. లక్ష్మీకాంత్' వివరిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఎంతో కొంత గ్యాస్ తయారవుతుంటుంది. అది బయటకు వెళ్లకపోతే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఆహారం తింటున్నప్పుడు కొంత గాలి కూడా లోపలికి వెళ్తుంది. అలాగే పెద్దపేగులు ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలోనూ పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. కొన్నిసార్లు గ్యాస్ కడుపులో ఎక్కువగా ఉన్నప్పుడు కడుపు నొప్పి, ఉబ్బరంగా ఉండడం, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం, పేగులు ముడివేసినట్టుగా ఎంతో బాధ కలుగుతుంటుంది.
"కడుపు ఉబ్బరంగా అనిపించడానికి అనేక కారణాలుంటాయి. ప్రధానంగా టైమ్‌కు ఆహారం తినకపోవడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, స్ట్రా ద్వారా ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలాగే కొంతమందికి పాలు, పాల పదార్థాలు పడవు. వీరు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. మలబద్ధకం కూడా కడుపులో గ్యాస్ పెరిగేలా చేస్తుంది."-డాక్టర్ టి. లక్ష్మీకాంత్
కడుపు ఉబ్బరం తగ్గించుకోవడానికి చిట్కాలు..
- గ్యాస్ సమస్య ఉన్నవారు ఎక్కువగా గాలిని మింగకుండా ఆహారం తీసుకోవాలి. ఇలా చేయాలంటే వేగంగా కాకుండా మెల్లిగా నములుతూ ఆహారం తినాలి.
- అలాగే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. పడని ఆహారం తినకూడదు.
- పుదీనా టీ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
- తినేటప్పుడు మాట్లాడకూడదు.
- నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
- ఫిజీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ తక్కువగా తీసుకోవాలి.
- స్ట్రా ద్వారా డ్రింక్స్ తీసుకోకూడదు.
- కొంతమందికి బ్రోకలీ, ఆకుకూరలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి.
- చూయింగ్ గమ్‌లు, కొన్ని రకాల స్వీట్లలో కృత్రిమ చక్కెర ఉంటుంది. ఇవి గ్యాస్‌ను కలిగిస్తాయి.
- రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కాబట్టి, నైట్ కంటినిండా నిద్రపోవాలి.
- ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం వల్ల కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, ప్రశాంతంగా ఉండాలని డాక్టర్ టి. లక్ష్మీకాంత్ సూచిస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS