Supreme Court gives green flag to SC, ST sub-category- states have power
SC, ST ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా- రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పు.
SC on SC/ST sub classification :షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చిచెప్పింది. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు- అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
ఒక కేసు- ఆరు తీర్పులు:
జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసులో 6 తీర్పులను విడివిడిగా ఇచ్చారు. ఉపవర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ మిశ్రాకు, తనకు కలిపి సీజేఐ ఒక తీర్పు రాశారు. మిగిలిన నలుగురు ఇదే వైఖరితో నాలుగు తీర్పులు విడివిడిగా ఇచ్చారు. వీరిలో ఒకరైన జస్టిస్ బీఆర్ గవై- కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించి, వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని, రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
కేంద్రం వాదన ఇదీ!:
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న కల ఉపవర్గీకరణ ద్వారా సాకారం అవుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు తీసుకురావడం వెనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని వివరించారు.
ఇదీ కేసు:
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎస్సీ కోటాలో ఉపవర్గీకరణలు రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని 2004లో 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టింది. దీనిపై పునఃసమీక్ష కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఇప్పుడు ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
COMMENTS