A safety stick that protects farmers and the elderly - a young lady who got the patent
రైతులు, వృద్ధులను రక్షించే సేప్టీ స్టిక్ - పేటెంట్ హక్కు పొందిన యువతి.
Girl Made Safety Stick for Farmers : ఇక్కడ చేతి కర్రతో తిరుగుతున్న ఈ యువతి పేరు శ్రావణి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన పరుశురాములు-కవిత దంపతుల చిన్న కుమార్తె. వారిది నిరుపేద కుటుంబం. తండ్రి పరశురాములు ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు, తల్లి కవిత గృహిణి. కుమార్తె శ్రావణిని పదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివించారు. ఖమ్మంలోని గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివించారు.
ప్రస్తుతం బిహార్‌లోని పాట్నా ఐఐటీలో శ్రావణి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మొదటి నుంచి ఆటపాటల్లో చురుకుగా ఉండేది. తొమ్మిదో తరగతి చదివే సమయంలో పాఠశాలలో సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించారు. వినూత్నమైన ప్రాజెక్ట్‌ను తయారు చేయాలని శ్రావణికి టీచర్స్ సూచించారు. దీంతో తన తండ్రితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వృద్ధులు రాత్రివేళల్లో నడిచేటప్పుడు, పంట పొలాల్లో తిరిగేటప్పుడు పాము కాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం చూసిన శ్రావణి, రైతుల ప్రాణాలను రక్షించేందుకు చేతి కర్ర యంత్రాన్ని రూపొందించింది.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సత్తా చాటింది. రాష్ట్రపతి భవన్, జపాన్‌లో నిర్వహించిన ప్రదర్శనలకు ఎంపికైంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వృద్ధులు రాత్రివేళల్లో నడిచేటప్పుడు, పంట పొలాల్లో తిరిగేటప్పుడు పాము కాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం శ్రావణిని కలచివేసింది. రైతుల ప్రాణాలను రక్షించేందుకు ఏదైనా వినూత్నంగా తయారు చేయాలనుకుంది. దానికి కోసం చేతి కర్ర యంత్రాన్ని రూపొందించింది.
కర్ర పెట్టిన స్థలంలో ప్రకంపనలు : ఆలోచన వచ్చినప్పటికీ చేతి కర్ర యంత్రం చేయడానికి సరైన అవగాహన లేకపోవడంతో కొంత నిరాశ చెందింది. అయినా ప్రయత్నం అపలేదు, సుమారు నాలుగు నెలలు పాటు శ్రమించి పరికరం తయారు చేసినట్లు శ్రావణి చెబుతోంది. చేతి కర్ర యంత్ర పరికరం అడుగు భాగంలో ఒక వైబ్రేటర్, దాని పైనా బజర్, టార్చ్‌లైట్, మధ్యలో బ్యాటరీని అమర్చారు. దీన్ని పట్టుకుని అడుగులు వేసినప్పుడు వైబ్రేటర్ ఆన్ అవుతుంది. కర్ర పెట్టిన స్థలం నుంచి రెండు మీటర్ల విస్తీర్ణంలో ప్రకంపనలు వస్తాయి.
ఆ ప్రకంపనలకు పాములు, ఇతర విష పురుగులు దూరంగా వెళ్లిపోతాయి. దీనికి అమర్చిన బజర్ సౌండ్‌తో పంట పొలాల్లోకి వచ్చిన అడవి పందులు, పిట్టలు పారిపోతాయి. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టలేదని రూ.3 వేలతో పరికరం అందుబాటులోకి వస్తోందని శ్రావణి చెబుతోంది. చేతి కర్ర యంత్ర పరికరాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావించిన శ్రావణి. ఎక్కువగా చేతి కర్రని వాడిదే వృద్ధులే అందుకే వారికి అవసరమైన మందులు కూడా ఇందులో అమర్చే విధంగా ప్లాన్ చేసింది.
దీంతో పాటు హ్యాండిల్ వద్ద ఒక సైడ్‌లో మందులు, మరొక సైడ్‌లో ఎలక్ట్రికల్ కిట్ పెట్టుకునే విధంగా డిజైన్ చేసింది. ఇందులో అత్యవసరమైన బీపీ, షుగర్, పారాసెటమాల్ టాబ్లెట్స్ నాలుగు ఐదు షీట్స్ పెట్టుకోవచ్చు. ఈ స్టిక్ మల్టీ పర్పస్‌గా ఉపయోగపడుతుందని శ్రావణి చెబుతోంది. విద్యార్థినిగా శ్రావణి ఆవిష్కరించిన చేతి కర్ర యంత్రం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సత్తా చాటింది. 2019లో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పోటీల్లో 60వ స్థానం దక్కించుకుంది.
చేతి కర్ర పరికరంపై శ్రావణికి పేటెంట్ హక్కు : అంతేకాకుండా రాష్ట్రపతి భవన్, జపాన్‌లో నిర్వహించిన ప్రదర్శనలకు ఎంపికైంది. ఇలా పలు ప్రదర్శనల్లో తనకు ఆవిష్కరణకు గుర్తింపు వచ్చిందని శ్రావణి చెబుతోంది. జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పోటీల్లో పాల్గొని అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదగా ప్రశంస పత్రం, అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని శ్రావణి చెబుతోంది. తొమ్మిదో తరగతిలో రూపొందించిన చేతి కర్ర యంత్రానికి గత నెల జూన్‌లో పేటెంట్ హక్కు లభించింది.
జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన చేతి కర్ర యంత్రానికి గత ఏడాది పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పేటెంట్ అధికారులు చేతి కర్ర పరికరంపై శ్రావణికి పేటెంట్ హక్కును కల్పించారు. ఏదైనా కంపెనీ ముందుకు వస్తే వారితో కలిసి యంత్రాల తయారికి సిద్ధంగా ఉన్నట్లు శ్రావణి చెబుతోంది.
ప్రాజెక్టు తయారికి సైన్స్ ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు బాగా సహకరించారని, ధైర్యం చెప్పి వివిధ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొనేలా చేశారని, వారి సహకారంతోనే పాట్నా ఐఐటీలో బీటెక్ చదువుతున్నట్లు శ్రావణి చెబుతోంది. తమ కుమార్తె చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో చురుకుగా ఉండేదని, ఆమె బాగా చదవి మంచి స్థితిలో ఉండాలనేదే తమ లక్ష్యమని తల్లిదండ్రులు చెబుతున్నారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని కొత్త ఆవిష్కరణకు కృషి చేస్తానని, ఐఏఎస్ కావటమే తన అంతిమ లక్ష్యమని శ్రావణి చెబుతోంది.
'తొమ్మిదో తరగతి చదివే సమయంలో పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో నేను లైఫ్ సేవ్స్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అనే ప్రాజెక్టు చేశాను. పొలాల్లో పాము కాటుకు రైతులు చనిపోతున్నారని ఈ ప్రాజెక్టు చేశా. దానికి కోసం చేతి కర్ర యంత్రాన్ని తయారు చేశా. ఈ యంత్రానికి గత నెల జూన్‌లో పేటెంట్ హక్కు లభించింది'-శ్రావణి, ఇన్నోవేటర్
COMMENTS