Puri Jagannath Temple Ratna Bhandar Open
Puri Ratna Bhandar : 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం.. లోపల ఏముంది?
Puri Jagannath Temple Ratna Bhandar Open :
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం గురించి ఎన్నో రహస్యాలు.. మరెన్నో కథలు. అయితే భాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ.. కొన్ని విఫలయ్యాయి. 2024 జులై 14న ఎట్టకేలకు రత్న భాండాగారం తెరుచుకుంది. ఇందుకోసం ఆలయ పూజారులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత రత్నభాండాగారాన్ని తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో ఓ బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను తీసుకెళ్లారు.
పూరీ రత్న భాండాగారానికి సంబంధించి మెుత్తం మూడు గదులు ఉన్నాయి. మెుదటిది స్వామి వారికి పూజలో భాగంగా ప్రతీ రోజూ తీస్తారు. రెండోది ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు. ఇక మూడోది అసలైన రత్న భాండాగరం. దీనిని 46 ఏళ్ల కిందట తెరిచారు. అంటే 1978లో ఓపెన్ చేశారు. మళ్లీ తెరవలేదు. ఇందుకోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి.. కానీ విఫలమయ్యాయి. గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజల నమ్మకం. ఈ గదికి నాగబంధం కూడా ఉందని చెబుతారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు.
ప్రస్తుతం వెళ్లిన బృందంలో పాములు పట్టే వ్యక్తులను కూడా తీసుకెళ్లారు. అంతేకాదు సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే.. వెంటనే చికిత్స చేసేందుకు వైద్యులను కూడా వెంట తీసుకెళ్లారు. రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ గురించి తెలిసి చాలా మంది గుడికి వచ్చే ప్రయత్నం చేశారు. గుడి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
రత్న భాండాగారంలోని సంపదను పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపరుస్తారు. అందుకే పెట్టెలను తీసుకెళ్లారు. ఆ తర్వాత వాటికి డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు. 1978లో భాండాగారంలోని సంపద లెక్కించేందుకు సుమారు 70 రోజులు పట్టింది. అయినా కూడా లెక్కతేలలేదని అంటారు.
పూరీ జగన్నాథుడికి భాండాగారంలో వజ్రా వైడూర్యాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణా భరణాలు, వెండి తదితర విలువైన వస్తువులు ఉంటాయని అంటున్నారు. రాజుల కాలంలోనూ ఇందులో స్వామివారికోసం చేయించిన నగలను దాచి పెట్టారని కొందరు చెబుతారు. దీంతో స్వామి వారి సంపద గురించి అందరికీ ఆసక్తి నెలకొంది.
పూర్వ కాలంలో మూడేళ్లు లేదంటే ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. దీంతో తాజాగా పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
COMMENTS