PM Kisan AI Chatbot: Farmers have a new friend.. Any problem can be solved..
PM Kisan AI Chatbot: రైతులకు కొత్త మిత్రుడొచ్చాడు.. సమస్య ఏదైనా ఇట్టే పరిష్కారం..
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రైతే దేశానికి వెన్నెముక అని భావించి అనేక పథకాలను అమలు చేస్తుంది. ఆర్థికంగా దన్నుగా నిలబడుతోంది. అలా తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి(పీఎం-కిసాన్). దీని ద్వారా రైతులకు గౌరవ నిధిని అందిస్తుంది. అర్హులైన రైతులకు ఆర్థిక చేయూతను అందిస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతలుగా రూ.2000 చొప్పున అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ పథకం 2018డిసెంబర్లో ప్రారంభించారు. భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ ఇది వర్తిస్తుంది. వారి జీవనోపాధికి భద్రత కల్పించడానికి ఈ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మొదలైన వారి వ్యవసాయ ఇన్‌పుట్ అవసరాలను తీర్చడంలో రైతులకు సహాయం చేస్తుంది. రైతులు, వారి కుటుంబాల మొత్తం ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. రైతులను శక్తివంతం చేస్తుంది. వ్యవసాయాన్ని మరింత ఆకర్షణీయమైన వృత్తిగా చేస్తుంది. కాగా ఈ పథకానికి సాంకేతికతంగా కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ‘కిసాన్-ఈమిత్రా’ పేరుతో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) చాట్ బాట్ ను ప్రవేశపెట్టింది. దీని వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ ఏఐ చాట్ బాట్ వల్ల రైతులకు ఒనగూరేది ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పీఎం కిసాన్ చాట్‌బాట్ (కిసాన్-ఈమిత్రా)..
కిసాన్-ఈమిత్రా అనే ఏఐ చాట్ బాట్ ను 2023లో వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి సంబంధించిన సందేహాలు, ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా రూపొందిన డిజిటల్ అసిస్టెంట్.
కిసాన్-ఈమిత్రా రైతులకు రియల్ టైం సపోర్టుతో పాటు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, వారి దరఖాస్తు స్థితి లేదా వాయిదా చెల్లింపులు, ఫిర్యాదు పరిష్కారంతో సహా పీఎం-కిసాన్ పథకం గురించిన వారి ప్రశ్నలకు వారు సమాధానాలను పొందవచ్చు.
కిసాన్-ఈమిత్రా సాంకేతికంగా రైతులను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కిసాన్-ఈమిత్రా బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పీఎం కిసాన్ నమోదు కోసం ఈ-కేవైసీ తప్పనిసరా?, పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్వీయ-నమోదు చేసుకోవడం ఎలా? పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కోసం ఏదైనా రుసుము ఉందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.
మీకు నచ్చిన భాషలో..
పీఎం కిసాన్ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ లో ఈ ఏఐ చాట్ బాట్ అందుబాటులో ఉంటుంది. మీకు అనువైన భాషలో దానితో సంభాషించొచ్చు. ఈ చాట్‌బాట్ హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ, పంజాబీ, ఆంగ్లంతో సహా పలు భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. దీని ద్వారా రైతులు తమకు నచ్చిన భాషలో సమాచారాన్ని పొందేందుకు సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
COMMENTS