Free Coaching: Karimnagar young man who left his job and is doing free coaching
Free Coaching: ఉద్యోగం వదిలి ఫ్రీ కోచింగ్, ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ యువకుడు.
Free Coaching: ఉన్నత విద్యను అభ్యసించాడు.. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాడు. అయితే దానితో సంతృప్తి చెందకుండా ఉద్యోగాన్ని వదిలి, గ్రామీణ పేద విద్యార్థులు ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించేందుకు కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. ఐదేళ్ళుగా విజయవంతంగా ఉచిత కోచింగ్ తో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు కరీంనగర్ లో నివాసం ఉండే చింతల రమేష్.
పుట్టి పెరిగింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో.. ఇంజనీరింగ్ విద్య కోసం కరీంనగర్ కు చేరిన రమేష్ ఎంటెక్ పూర్తి చేసి 2007 లో ఉద్యోగం సాధించారు. రమేష్ ఐఈఎస్ కు ఎంపికై బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. స్వల్ప కాలమే ఉద్యోగంలో కొనసాగిన ఆయన 2019లో కరీంనగర్ లో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంబించారు.
ఇందులో ప్రభుత్వ ఐఐఐటీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగం సాధించడమెలా అన్న విషయాలపై పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ట్రిపుల్ ఐటీల్లో చదువుకున్న విద్యార్థులకు ఫిజికల్ కోచింగ్ ఇస్తు వారి జీవితాలకు బంగారు బాట వేస్తున్నారు.
చదువు కొందాం కాదు.. చదువుకుందాం..
కలలు కనండి సాకారం చేసుకోండి అని ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం. అలానే చింతల రమేష్ "చదువు కొందాం కాదు...చదువు కుందాం" అనే నినాదంతో విద్యార్థులను లక్ష్యం వైపు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు.
సింగరేణి కార్మికుని ఇంట పుట్టిన రమేష్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)కు ఎంపికై బీఎస్ఎన్ఎల్ లో చేస్తున్నా ఉద్యోగాన్ని కూడా వదులుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఉద్యోగం పొందాలన్న తపన ఉన్నా దిశా నిర్దేశం చేసే వారు లేక పోవడంతో ట్రిపుల్ ఐటీలాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు లక్ష్యం వైపునకు అడుగులు వేయలేకపోతున్నారని గమనించి, వారి చింతను దూరం చేస్తున్నారు.
ఆర్థిక పరిపుష్టి పొందాలన్న తపనతో కాకుండా నేటి తరాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తొలి ప్రయత్నంలో తన చింతల రమేష్ ఇనిస్ట్యూట్ లో కోచింగ్ తీసుకున్న ఇద్దరు ఉద్యోగాలు పొందారు. వారిలో ఒక అమ్మాయి ఐఈఎస్‌లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో సైంటిస్ట్ గా పని చేస్తుండగా, మరో అబ్బాయి 527 ర్యాంకు సాధించి మిడియా టెక్ కంపెనీల్ రూ. 25 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నారు.
గత రెండేళ్ళలో చింతల రమేష్ వద్ద శిక్షణ పొందిన వారిలో 20 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగా, మరో 25 మంది వరకు వివిధ కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు. బ్యాచ్ కు 30 మందిని చేర్చుకోవాలని అనుకున్నప్పటికీ 50 మంది వరకు విద్యార్థులు ఆసక్తి చూపడంతో వారికి మెలుకువలు నేర్పుతు తర్ఫీదు ఇస్తున్నారు. ఆఫ్ లైన్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా... స్టడీ మెటిరియల్ కూడా ఫ్రీగానే అందిస్తున్నారు.
ఇవ్వాల్సింది డబ్బులు కాదు సమయం ఇవ్వాలి..
ఐఈఎస్ కు ఎంపికై బీఎస్ఎన్ఎల్ లో ఉన్నతస్థాయి అధికారిగా పదోన్నతులు పొందుతూ దర్జాగా కాలం వెల్లదీయాల్సిన చింతల రమేష్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కారణమేంటంటే... ఐఈఎస్ సాధించిన రమేష్, అలాంటి జీవనం గడిపితే తన కుటుంబం మాత్రమే బావుంటుంది కానీ... ఉద్యోగాల అన్వేషణలో నిరుత్సాహానికి గురై...ప్రిపరేషన్ కావడంలో ఢీలా పడిపోయి... చతకిలపడిపోతున్న యువతలో నూతనోత్సాహం నింపాలన్న ఒకేఒక్క సంకల్పమే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు పురికొల్పింది.
దీంతో చదువు కొనడం కాదు...చదువుకోవడం ముఖ్యం అన్న నానుడిని చేతల్లో నిజం చేస్తున్నారు. సాంకేతికపరమైన అవగాహన ఉన్నా సక్సెస్ కాలేకపోతున్న వారు కొందరు...బేసిక్ నాలెడ్జ్ చాలినంత లేక మరికొందరు... కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేక మరికొందరు జీవితం స్థిరపడలేకపోతున్నారన్న విషయాన్ని గమనించిన రమేష్ తాను తన కుటుంబం కోసం మాత్రమే జీవిస్తే సరిపోదని... నేటి తరాన్ని అన్నింటా తయారు చేయాల్సిన అవసరం ఉందని గమనించారు.
ఈ కారణంగానే రమేష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి యువతకు దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నమైన రమేష్, ఇవ్వాల్సింది డబ్బులు కాదు, సమయం ఇవ్వాలని అంటున్నారు.
కోవిడ్ ఎఫెక్ట్ తో...
కోవిడ్ లాక్ డౌన్ కారణంగా పిజికల్ క్లాసులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆన్ లైన్ లో కోచింగ్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత యథావిధిగా ఆఫ్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆన్ లైన్ క్లాసులను కూడా నిర్వహిస్తున్న రమేష్ బీటెక్ చదువుకుంటున్న వారికి మాత్రమే కోచింగ్ ఇస్తున్నారు. అటు బీటెక్ చేస్తూ ఇటు ప్లేస్ మెంట్ పొందే విధంగా బీటెక్ స్టూడెంట్స్ ను సుశిక్షితులను చేస్తున్నారు.
ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న వారి నుండి మాత్రం ఏడాదికి రూ. 615 నామ మాత్రపు ఫీజు వసూలు చేస్తున్నారు. తన స్నేహితులు, సన్నిహితులు అంతా వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో తన లక్ష్యం వైపు సాగుతున్నానని అంటున్నారు చింతల రమేష్.
విద్య అందుకోవడం గొప్పతనం కాదని... పట్టాలు పొందిన తరువాత ఉద్యోగాలు చేయడం అత్యంత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించిన రమేష్ సాంకేతిక నిపుణులను ఉద్యోగార్థులుగా చేయడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ట్రిపుల్ ఐటీ పూర్తి చేసిన వారిలో ఆత్మస్థైర్యం నింపడమే కాదు... వారిలోని జిజ్ఞాసకు పదును పెట్టి తీర్చిదిద్దుతున్న ఐఈఎస్ రమేష్ సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.
COMMENTS