Rythu Bima Scheme : Another good news for Telangana food donors - opportunity to apply for Rythu Bima, more than ever..!
Rythu Bima Scheme : తెలంగాణ అన్నదాతలకు మరో గుడ్ న్యూస్ - రైతు బీమా దరఖాస్తులకు అవకాశం, ఎప్పటివరకంటే..!
Rythu Bima Applications 2024 : అన్నదాతలకు తెలంగాణ వ్యవసాయశాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.రైతులు మరణించినపుడు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేదోడు కల్పించే రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పొడిగించేలా అడుగులు వేసింది. గతంలో ఉన్న వారి పాలసీలను రెన్యూవల్ చేయటంతో పాటు.... కొత్తగా అర్హులైన రైతులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
రైతు బీమా స్కీమ్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న రైతులు స్థానిక ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది.
జులై 28వ తేదీ వరకు పట్టాదారు పాస్‌బుక్ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అర్హులైన రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు దరఖాస్తుకు తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంది.
2018 ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ పథకంలో నమోదైన రైతు ఏ కారణంతో మృతి చెందినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.2,271 చొప్పున చెల్లించగా గతేడాది.... రూ.3,556 చొప్పున చెల్లించింది. తొలి రెండు సంవత్సరాలు ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించారు. 2020 నుంచి ప్రతి వానాకాలంలో ఒకసారి మాత్రమే అర్హుల నుంచి సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. పథకంలో చేరిన రైతుపేరిట ప్రభుత్వం ఎల్‌ఐసీకి నిర్ణయించిన మేరకు ప్రీమియం చెల్లిస్తోంది.
అర్హతలు:
18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు వయసున్న అన్నదాతులు మాత్రమే పథకంలో నమోదుకు అర్హులుగా ఉంటారు.
ప్రస్తుతం వయసు నిండినవారిని, చనిపోయినవారి పేర్లను పథకంలోనుంచి తొలగించి నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారివి చేరుస్తున్నారు.
ఇప్పటికే ఈ పథకంలో నమోదైనవారు నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఈనెల 28 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా పరిగణిస్తారు. కొత్తగా వీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలు ఉంటాయి. అయితే పేరు నమోదు చేసుకునే రైతు స్థానికంగా ఉండాలి.
పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, రైతుతోపాటు నామినీ ఆధార్‌కార్డుల నకలు ప్రతులను, నామినీ నమోదు పత్రాన్ని పూరించి ఏఈవోలకు ఇవ్వాలి.
చట్టపరమైన వారసత్వం కలిగినవారు నామినీగా ఉండాలి. గతంలో పథకంలోని రైతుల పేరిట నమోదైన నామినీ చనిపోతే నామినీ పేరు మార్పునకు అవకాశం ఉంటుంది.
మరోవైపు పంట పెట్టుబడి సాయం కోసం ప్రకటించిన రైతు భరోసా స్కీమ్ పై కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరించగా… ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్ని ఎకరాల లోపు రైతుకు రైతు భరోసా అందించాలనే దానిపై ఓ క్లారిటీ రానుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత…. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
COMMENTS