The government declared by Paramvira Chakra that he was martyred in the war.. The story of Major Dhan Singh who returned from China..
యుద్ధంలో అమరుడయ్యాడని పరమవీర చక్ర ప్రకటించిన ప్రభుత్వం.. చైనా నుంచి తిరిగి వచ్చిన మేజర్ ధన్ సింగ్.. వీరుని కథ.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది మొదలు.. ఎప్పుడూ మనదేశంలో అస్తితర కొనసాగాలని.. మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పొరుగు దేశమైన డ్రాగన్ కంట్రీ కంత్రీ ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అలా 1962 లో కూడా భారత్ పై చైనా దాడికి దిగింది. ఈ యుద్ధంలో మన సైనికులు చైనా సైనికుల కంటే తక్కువే.. అయినప్పటికీ శత్రుదేశ జవాన్లకు మన వారు చుక్కలు చూపించారు. శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించారు. అయితే భారత్-చైనా యుద్ధం ముగిసిన తర్వాత చైనా యుద్ధ ఖైదీల జాబితాను భారత్‌కు పంపింది. ఈ జాబితాలో అమరవీరుడుగా ప్రకటించిన ఓ సైనికుడి పేరు కూడా ఉంది. భారత ప్రభుత్వం కూడా ఆ సైనికుడికి మరణానంతరం పరమవీర చక్ర ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సైనికుడి కుటుంబ సభ్యులు కూడా అతడి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అందరూ చనిపోయారని భావించిన వ్యక్తి, మరణాన్ని తప్పించుకొని తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ వీర సైనికుడు మేజర్ ధన్ సింగ్ థాపా. ధన్ సింగ్ థాపా జన్మదినం సందర్భంగా అతని సాహస కథలను తెలుసుకుందాం.
లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా ఏప్రిల్ 10, 1928న సిమ్లాలో జన్మించారు. అతని తల్లిదండ్రులది నేపాలీ మూలాలు. 1/8 గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్‌లో భాగం కావడంతో 1949 ఆగస్టు 28న సైన్యంలో ధన్ సింగ్ థాపా ప్రయాణం ప్రారంభమైంది. 1962లో చైనా.. భారత్ యుద్ధం సమయంలో మేజర్ ధన్ సింగ్ పాంగోంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న సిరిజాప్ వ్యాలీలో ఒక ప్లాటూన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న మిలిటరీ పోస్ట్ చుషుల్ ఎయిర్‌ఫీల్డ్ రక్షణకు చాలా ముఖ్యమైనది.
రెండుసార్లు శత్రువుల దాడులను అడ్డుకుంది, భారీ నష్టం కలిగించింది.
భారత్, చైనాల మధ్య 1950ల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. 1962 నాటికి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధంలో మేజర్ ధన్ సింగ్ లడఖ్‌లోని ఫార్వర్డ్ పోస్ట్ ‘సిరిజాప్’కి కమాండర్‌గా ఉన్నాడు. ప్రభుత్వ నివేదిక ప్రకారం 21 అక్టోబర్ 1962 తెల్లవారుజామున చైనా సైనికులు ఫిరంగులు , మోర్టార్లతో భారత్ పోస్ట్‌పై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయడం ప్రారంభించారు. అప్పుడు మేజర్ ధన్ సింగ్ నాయకత్వంలో భారతీయ సైనికులు, శత్రువుల కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, దాడిని విఫలం చేసి శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించారు. శత్రువులు రెండోసారి దాడి చేసి ఈసారి కూడా డ్రాగన్ కంట్రీ తమ ప్రణాళికల్లో విఫలమయ్యింది.
మూడవ సారి దాడి చేసే సమయంలో చైనా పదాతిదళానికి సహాయం చేయడానికి ట్యాంకులు కూడా రంగంలోకి దిగాయి. అప్పటికి భారత సైనికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయినా పట్టు వదలకుండా చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉన్నాడు మేజర్ ధన్ సింగ్. చైనీస్ సైనికులు పోస్ట్‌ను స్వాధీనం చేసుకున్న సమయంలో మేజర్ ధన్ సింగ్ చాలా మంది చైనా సైనికులను తన చేతులతో సంహరించాడు. చివరకు తనను శత్రువులు బంధించే ముందు తన చేతులతో శత్రువుని చంపుతూనే ఉన్నాడు.
మరణానంతరం ‘పరమవీర చక్ర’తో సత్కరించారు మేజర్ మేజర్ ధన్ సింగ్ ను చైనా సైనికులు బంధించారు. అయితే ఈ విషయం భారత సైన్యానికి తెలియలేదు. పోస్ట్‌పై విధ్వంసక దాడి తరువాత, గూర్ఖా సైనికులందరూ అమరులయ్యారని భావించారు. నివేదిక ప్రకారం మేజర్ ధన్ సింగ్ థాపా కుటుంబం అతని అంత్యక్రియలను కూడా చేసింది. ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర ఇవ్వనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పరమ వీర చక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం.
యుద్ధం ముగిసిన తర్వాత.. చైనా ప్రభుత్వం యుద్ధ ఖైదీల జాబితాను పంపినప్పుడు మేజర్ థాపా మనుగడ గురించి ప్రజలకు తెలిసింది. అందులో అతని పేరు కూడా ఉంది. ఈ వార్త అతని కుటుంబంలో సంతోషాన్ని నింపింది. అతను మే 10, 1963 న విడుదలై దేశానికి తిరిగి వచ్చినప్పుడు, అతనికి ఆర్మీ ప్రధాన కార్యాలయంలో స్వాగతం పలికారు. మేజర్ ధన్ సింగ్ అప్పటికి ఇంకా సైన్యంలో భాగంగానే ఉన్నాడు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా మేజర్ ధన్ సింగ్ కు పరమవీరచక్ర అవార్డును ప్రదానం చేశారు. ధన్ సింగ్ థాపా లెఫ్టినెంట్ కల్నల్‌గా పదవీ విరమణ చేశారు. అతను 77 సంవత్సరాల వయస్సులో 5 సెప్టెంబర్ 2005న సహజ కారణాలతో మరణించాడు.
COMMENTS