UPI Scam: The bank's warning to the customers.
UPI Scam: ఖాతాదారులకు ఆ బ్యాంకు హెచ్చరిక.. ఆ స్కామ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..!
ఇటీవల కాలంలో భారతదేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ సేవలు కారణంగా భారతదేశం ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో ఇతర దేశాల సరసన నిలిచింది. అయితే మంచి ఉన్న చోట చెడు ఉన్నట్లే ఇటీవల కాలంలో యూపీఐను వినియోగించి బ్యాంకు ఖాతాదారులను మోసగించే ముష్కరులు కూడా తయారయ్యారు. ముఖ్యంగా ఫేక్ యూపీఐ యాప్‌లతో ఎక్కువగా ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్నారని బ్యాంకులు గుర్తించాయి. తాజాగా యూపీఐకి సంబంధించిన మోసపూరిత కార్యకలాపాలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ అన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగదారులకు. ముఖ్యంగా యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్న వారికి అత్యంత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చింది. యూపీఐ అప్లికేషన్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు మాల్వేర్‌ను ఉపయోగిస్తున్నారని బ్యాంక్ తన కస్టమర్‌లకు పంపిన ఈ-మెయిల్‌లో వెల్లడించింది. ఐసీఐసీఐ తాజా హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసకుందాం.
మోసగింపు ఇలా:
సైబర్ నేరగాళ్లు అనుకూల ఎస్‌ఎంఎస్ ఫార్వార్డింగ్ యాప్‌లను సృష్టిస్తారు. ఇది యూపీఐ పరికర బైండింగ్ సందేశాన్ని నమోదు కోసం బాధితుల బ్యాంక్‌కు చెందిన వర్చువల్ మొబైల్ నంబర్ (వీఎంఎన్)కి ఫార్వార్డ్ చేస్తారు.
మోసగాళ్లు బాధితులకు హానికరమైన ఏపీకే ఫైల్‌లకు లింక్‌లను వాట్సాప్ ద్వారా పంపుతారు.
ఆ లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే యూపీఐ అప్లికేషన్ నమోదు ప్రక్రియ సైబర్ మోసగాళ్లు ప్రారంభించి, అకౌంట్‌లోని సొమ్మును తస్కరిస్తారు.
మీ మొబైల్ పరికరంలో నమ్మదగని మూలాల నుంచి ఎలాంటి అనుమానాస్పద/హానికరమైన అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయలేదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్‌లకు ఎలాంటి ఎస్ఎంఎస్/వాట్సాప్ సందేశాన్ని పంపదు ఆ బ్యాంకు వినియోగదారులను హెచ్చరించింది. వారిని నిర్దిష్ట మొబైల్ నంబర్‌కు కాల్ చేయమని లేదా ఏదైనా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయమని అడగదని ఐసీఐసీఐ బ్యాంక్ ఈ-మెయిల్‌లో ఖాతాదారులను హెచ్చరించింది.
ఈ చిట్కాలతో మోసగాళ్ల నుంచి రక్షణ:
- మీ మొబైల్ పరికరాన్ని తాజా ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్‌డేట్ చేయాలి.
- అధికారిక, విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయాలి.
- విశ్వసనీయ ప్రొవైడర్ నుంచి యాంటీవైరస్/సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరిస్తూ ఉండాలి.
- అనుమతులను ధ్రువీకరించండంతో పాటు యాక్సెస్‌ని అనుమతించే ముందు అప్లికేషన్‌కు సంబంధించిన ఈ-మెయిల్‌లు లేదా సందేశాలలో అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు.
- ఓటీపీ, పాస్‌వర్డ్, పిన్, కార్డ్ నంబర్ వంటి మీ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు.
- ఈ తరహా మోసాలను వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నివేదించాలని బ్యాంక్ వినియోగదారులను కోరింది.
COMMENTS