Lifestyle: Does body temperature increase with depression? Interesting things in research..
Lifestyle: డిప్రెషన్‌తో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా.? పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
ఒకప్పుడు అనారోగ్యం అంటే కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే అనుకునే వారు. కానీ ఇప్పుడిప్పుడే మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. మానసిక అనారోగ్యానికి సైతం చికిత్స తీసుకోవాలనే అవగాహన ప్రజల్లో పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం కారణంగా డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా డిప్రెషన్‌కు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక అధ్యయనం ప్రకారం శరీర ఉష్ణోగ్రతకు, డిప్రెషన్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20,000 మందిని పరిగణలోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులకు సంబంధించి వారి శరీర ఉష్ణోగ్రతలను, ఒత్తిడి స్థాయిలను పర్యవేక్షించారు. 2020 ప్రారంభంలో ప్రారంభమైన ఈ అధ్యయనం ఏడు నెలల పాటు సాగింది.
అనంతరం డేటాను క్రోడీకరించగా.. డిప్రెషన్ లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులు ఇతరుల కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రతలను కలిగి ఉన్నట్లు తేలింది. అయితే దీనికి గల కారణం ఏంటన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డిప్రెషన్ అనేది ఒక సాధారణ మానసిక ఆరోగ్య రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా 3.8 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. ఈ సంఖ్య చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా తీవ్రమైన వ్యాధి, దీని కారణంగా ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిప్రెషన్‌తో ఇబ్బందిపడే వారు నిస్సహాయంగా భావిస్తారు, నిత్యం అలసటగా ఉంటుంది. చిరాకు, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ప్రతీ చిన్న విషయం గురించి దీర్ఘంగా ఆలోచించడం, విషయాలపై ఆసక్తిని కోల్పోవడం వంటివి కనిపిస్తాయి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్‌ను జయించడానికి యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
COMMENTS