Let's know how Rajya Sabha MPs are elected.
రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాం.
రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. 15 రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల అయింది.
వీటిల్లో ఆంధప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న 3 స్థానాలు కూడా ఉన్నాయి. రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యేవారిలో వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు.
తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ స్థానాలు ఖాళీ కానున్నాయి.
రాజ్యసభ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికల్లా నేరుగా ప్రజా భాగస్వామ్యంతో జరగవు. అలాగే ఐదేళ్ళకోసారి కూడా జరగవు.
రాజ్యసభ ఓ శాశ్వత సభ. ఇది నిరంతరం మనుగడలో ఉండే సభ. రాజ్యంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు.
వీరిలో 233 మందిని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మిగిలిన 12 మందిని సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాలనుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
రాజ్యసభ సీట్లను ఎలా నిర్థరిస్తారు?
రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ ప్రకారం దేశంలోని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు జరుపుతారు.
ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. అంటే, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ రాజ్యసభ స్థానాలు దక్కుతాయి.
ఈ దృష్ట్యా చూసినప్పుడు దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌కు 31 రాజ్యసభ సీట్లు ఉన్నాయి.
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు కారణంగా రాజ్యసభ సీట్ల కేటాయింపు 1952 నుంచి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 18 రాజ్యసభ స్థానాలు ఉండేవి. కానీ, ఆంధప్రదేశ్ విడిపోయాక వీటిని ఏపీకి 11, తెలంగాణకు 7 స్థానాలు కేటాయించారు.
రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు. ఆగస్టు 23, 1954లో ఈ మండలిని రాజ్యసభగా హిందీలో నామకరణం చేశారు. రాజ్యసభను పెద్దలసభ, ఎగువ సభ, మేధావుల సభగానూ వ్యవహరిస్తారు. ఇది శాశ్వత సభ.
సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ క్రమాన్ని నియంత్రించడానికి వీలైన నిబంధనలను రూపొందించే అధికారం రాష్ట్రపతికి ఉంది.
ఎవరు పోటీ చేయవచ్చు?
రాజ్యసభకు పోటీ చేయాలనుకునే వ్యక్తి భారతీయుడై ఉండాలి. కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. దేశంలోని ఏదో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి.
రాజ్యసభ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థిని కనీసం 10మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది.
2003లో రాజ్యసభ ఎన్నికలలో రెండు మార్పులు చేశారు. ఒక నిర్దిష్ట రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి, ఆ అభ్యర్థికి ఆ రాష్ట్రంలో తప్పనిసరిగా ఓటరు కావాలనే నిబంధనను తొలగించారు.
అలాగే రహస్య బ్యాలెట్ స్థానంలో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఓపెన్ బ్యాలెట్ విధానంలో సంబంధిత ఎమ్మెల్యే తాము ఎవరికి ఓటు వేసింది తమ పార్టీ అధీకృత ఏజెంటుకు చూపించాల్సి ఉంటుంది.
ప్రతి రెండేళ్ళకు రాజ్యసభ సభ్యులలో మూడింట ఒక వంతు మంది పదవీ విరమణ చేస్తారు.
ఎమ్మెల్యేల ఓట్లను ఎలా లెక్కిస్తారు?
పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు నేరుగా ఓట్లు వేస్తారు. ఈవీఎంలపై తమకు నచ్చిన పార్టీ గుర్తుపై బటన్ నొక్కుతారు. అలా తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు.
ఈ క్రమంలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థి కూడా విజేతగా నిలుస్తారు.
రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ దీనికి భిన్నంగా ఉంటుంది. రాజ్యసభ ఎంపీల ఎన్నిక విధానం పరోక్ష పద్దతిలో ఉంటుంది. ఈ ఎంపీలను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(4) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీల్లో ఎన్నికైన సభ్యులు ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు.
ఒక అభ్యర్థికి అవసరమైన ఓట్ల సంఖ్య , అక్కడి ఖాళీల సంఖ్య, సభా బలంపై ఆధారపడి ఉంటుంది.
రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నిక కావాల్సిన అభ్యర్థికి నిర్ణీత ఓట్లు వచ్చి తీరాలి. ఈ నిర్ణీత ఓట్లనే కోటా అంటారు.
ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మరొకరు కూడా రంగంలోకి ఉంటే వీరిలోంచి ముగ్గురిని ఎలా ఎంపిక చేస్తారో చూద్దాం.
ఏపీ శాసన సభ సంఖ్యాబలం : 175. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకు 100 పాయింట్లు కేటాయిస్తారు.
దీనినే ఇలా చూద్దాం.
మొత్తం సభ్యుల సంఖ్య : 175
ఒక్కోసభ్యుని విలువ : 100 పాయింట్లు
మొత్తం విలువ : 175X100 = 17500
అప్పుడు n+1 సూత్రం ప్రకారం
17500/3+1=+1 = 4374… గా లెక్కవేస్తారు.
దీని ప్రకారం ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎంపీగా నిలబడే అభ్యర్థికి కనీసం ఎమ్మెల్యే నుంచి 44 ఓట్లు పడాల్సి ఉంటుంది.
ఇలా నిర్ణీత ఓట్లు రావడాన్ని కోటా అంటారు. అంటే 4వ వంతుకంటే ఎక్కువ ఓట్లు రావాలి.
అలాగే ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కిస్తారు.
ఎమ్మెల్యేలు వేసే ఓటును సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు (ఎస్టీవీ) అంటారు.
ఒకే ఓటు ద్వారా ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓటు వేయడాన్నే ఎస్టీవి అంటారు.
ఉదాహరణకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉంటే నలుగురికి తమ ప్రాధాన్యతను బట్టి నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే రాజు, రవి, రాము, గోపి బరిలో ఉంటే వారిలో రాజుకు 1, రవికి 4, రాముకి 2, గోపికి 3 నెంబర్లు వేశారనుకుందాం.
ముందుగా మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. ఈ క్రమంలో కోటా కంటే అధికంగా వచ్చిన ఓట్లను నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులు ఎంపికయ్యేవరకు బదిలీ చేసి విజేతలను నిర్ణయిస్తారు.
ఉదాహరణకు రాజుకు 60 ఓట్లు వచ్చాయనుకుందాం. ఆయనకు 44 ఓట్లు వస్తే చాలు. కానీ 16 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఈ 16 ఓట్లను ప్రాధాన్యత క్రమంలో బదిలీ చేస్తారు. అంటే మొత్తం 60 ఓట్లలో 50శాతం ఓట్లు రెండో ప్రాధాన్యం కింద రాముకు పడ్డాయనుకుంటే మిగిలిన 16 ఓట్లలో 50 శాతాన్ని అంటే 8 ఓట్లను రాముకు బదిలీ చేస్తారు.
అయితే, ప్రాధాన్యతా ఓట్లు వేసే క్రమంలో ఎమ్మెల్యేలు గందరగోళానికి గురవుతారననే ఉద్దేశంతో చాలా పార్టీలు ముందుగానే తాము నిలబెట్టిన రాజ్యసభ ఎంపీకి ఏ ఎమ్మెల్యే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలో చెప్పి, వారందరిని (కోటాకు తగినట్టుగా) ఓ గ్రూపులా తయారుచేసి, సంబంధిత అభ్యర్థికి కేటాయిస్తాయి.
వీరంతా తమ అభ్యర్థికి కేవలం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వచ్చేస్తారు.
రాజ్యసభ ప్రయోజనాలు ఏమిటి?
రాజ్యసభ ఓ చెక్‌పాయింట్‌లా పనిచేస్తుంది. లోక్‌సభ రద్దు అయిన కాలంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుంది.
రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యుల నుంచే ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు.
లోక్‌సభ తరహాలోనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే, ఆర్థిక బిల్లులకు సంబంధించి, రాజ్యసభ నిర్ణయాన్ని లోక్‌సభ అమలు చేయకపోవచ్చు.
ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్య వివాదం తలెత్తినపుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు.
రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది.
రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగు జరిపినపుడు, సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినపుడు, సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు.
ఏ పార్టీకి ఎన్ని రాజ్యసభ స్థానాలున్నాయి?
ప్రస్తుతం బీజేపీకి 93, కాంగ్రెస్‌కు 30, టీఎంసీకి 13, ఆప్ 10, డీఎంకే 10, బిజూ జనతాదళ్ 9, వైసీపీ 9, బీఆర్ఎస్ 7, రాష్ట్రీయ జనతా దళ్ 6, సీపీఎం 5, జనతాదళ్ 5, నామినేటెడ్ 5, ఏఐడీఎంకె 4, ఎన్‌సీపీ 4, స్వతంత్రులు, ఇతరులు 3, సమాజ్ వాదీ పార్టీ 3, శివసేన 3, సీపీఐ 2, ఝార్ఖండ్ ముక్తి మోర్చా 2, అసోం గణ పరిషత్ 1, బహుజన సమాజ్ పార్టీ 1, ఇండియన్ ముస్లిం లీగ్ 1, జనతాదళ్ (సెక్యూలర్)1, కేరళ కాంగ్రెస్ (ఎం)1, ఎండీఎంకే 1, మిజో నేషనల్ ఫ్రంట్ 1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1, పట్టలి మక్కల్ కచ్చి 1, రాష్ట్రీయ లోక్ దళ్ 1, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) 1, సిక్కిం డమోక్రటిక్ ఫ్రంట్ 1, తమిళ్ మన్నీళ కాంగ్రెస్ 1, తెలుగుదేశం పార్టీ 1, యునైటెడ్ పీపుల్స్ పార్టీకి 1 స్థానం ఉన్నాయి.
COMMENTS