The sensational death after 50 years is a mystery.. This is what happened that day..!?
50 ఏళ్ల తర్వాత వీడిన సంచలన మృతి మిస్టరీ.. ఆ రోజు జరిగింది ఇదే..!?
భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశాలైన హిమాలయాల్లో పర్వతారోహకుల సందడి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దీనితో పాటు రోజూ అక్కడి సాహస యాత్రికుల్లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.
అలాంటి చోట ఏర్పడే మరణాలు సాధారణంగా సంచలనంగా మారవు. ఎందుకంటే అక్కడి పర్వతారోహణ అత్యంత ప్రమాదకరమని తెలిసే వెళ్తుంటారు గనుక. కానీ, 50 ఏళ్ళ క్రితం ఒకరి మరణం మాత్రం సంచలనంగా మారింది. అన్నదమ్ములు కలిసి చేసిన ఆ పర్వతారోహణలో ఒకరు మృతిచెందగా, తన ఒంటిరి విజయం కోసం సొంత సోదరుణ్నే చంపేశాడంటూ మరొకరిపై ఆరోపణ వచ్చింది. అయితే, తాజాగా ఒక బూటు వల్ల ఈ మిస్టరీ వీడింది.
ఇటాలియన్ యువ పర్వతారోహకుడు గుంథర్ మెస్నర్ 1970లో పాకిస్తాన్‌లోని నాగా పర్బత్ కొండపై హిమపాతంలో కొట్టుకుపోయి మరణించాడు. 26,660 అడుగుల పర్వతాన్ని అధిరోహిస్తున్న అతని సోదరుడు, రీన్‌హోల్డ్ మెస్నర్, ఒంటరిగా శిఖరాన్ని చేరుకున్నాడనే కీర్తిని పొందడానికి పర్వతంపై తన సోదరుణ్ణి విడిచిపెట్టడం వల్లే మరణం సంభవించిందని పుకార్లు రీన్‌హోల్డ్‌ను విపరీతంగా బాధపెట్టాయి. కానీ అప్పటికి ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా నిలిచిన ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు రెయిన్‌హోల్డ్ దగ్గర ఆ ఆపవాదును తుడిచేయడానికి ఎలాంటి ఆధారం లేదు. ఆ రోజు హిమపాతం ముంచేస్తున్న తరుణంలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరు రోజుల తర్వాత రెస్క్యూ టీమ్‌కు దొరికిన రెయిన్ హోల్డ్ పర్వతం నుండి కిందికి రావడానికి ఎన్నో ప్రమాదాలను తప్పించుకున్నాడు. మృత్యువును మోసం చేసి బయటపడ్డానని అతడు ఆ తర్వాత ప్రపంచానికి చెప్పాడు.
అయితే, ఇప్పుడు, 52 ఏళ్ల తర్వాత, తన తమ్ముడిని తాను విడిచిపెట్టలేదని రెయిన్‌హోల్డ్ నిరూపించుకోగలిగాడు. హిమానీనదంలో గుంథర్ కాలి బూట్ ఉన్న ప్రదేశానికి అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఆ యాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన క్లైంబింగ్ బూట్‌ని పర్వతానికి పశ్చిమ దియామిర్ ఎంట్రన్స్ కింద స్థానికులు కనుగొనగా, సరిగ్గా అక్కడే తన సోదరుడు కొట్టుకుపోయాడని రీన్‌హోల్డ్ అప్పట్లో చెప్పాడు. ఇక, ఈ కొత్త రుజువుతో పాటు, 2005లో అదే ప్రాంతంలో గుంథర్‌కు చెందిన ఎముక అతని ఇతర బూట్‌తో పాటు దొరకడం వల్ల ఇప్పటి వరకూ రెయిన్ హోల్డ్‌పై ఉన్న అపవాదు వీడింది. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరాతో రెయిన్ హోల్డ్ మాట్లాడుతూ, "నేను గుంథర్‌ను విడిచిపెట్టలేదని ఇది మరింత రుజువు. ప్రజలు నేను నా స్వంత ఆశయం కోసం నా తమ్ముణ్ని మృత్యువుకు వదిలిపెట్టానని చెప్పారు. అయితే, పర్వతం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఇంకా అవసరమైతే, ఈ బూట్ ఆవిష్కరణ ఖచ్చితంగా నా సోదరుడి మరణంలో సత్యాన్ని నిర్ధారిస్తుంది. గుంథర్ ఆరోహణ సమయంలో కాకుండా, అవరోహణ సమయంలో అదృశ్యమయ్యాడనడానికి ఇది తిరుగులేని రుజువు" అన్నాడు. లభించిన ఆ బూటును పర్వతారోహణ, రాక్ క్లైంబింగ్ చరిత్రను వివరించడానికి రూపొందించిన మెస్నర్ మౌంటైన్ మ్యూజియంలో ప్రదర్శిస్తామని అన్నాడు.
COMMENTS