The names of those villages are Diwali, how did those names come about...
ఆ గ్రామాల పేర్లు దీపావళి, ఆ పేర్లు ఎలా వచ్చాయంటే...
శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఆ పేరును ఆ గ్రామస్తులు పెట్టుకున్నది కాదు. అలా అని ఈ మధ్యకాలంలో మార్చుకున్న పేర్లు కూడా కాదు. వందల ఏళ్లుగా ఆ గ్రామానికి అవే పేర్లు కొనసాగుతున్నాయి. ఆ పేర్ల వెనుక ఉన్న కథలను ఆ ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఉంటారు.
గ్రామాల పేర్లు రకరకాలుగా ఉంటాయి. కానీ పండగల పేర్లే గ్రామాలకు ఉండడం మాత్రం కాస్త విచిత్రమే. శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఆ పేరును ఆ గ్రామస్తులు పెట్టుకున్నది కాదు. అలా అని ఈ మధ్యకాలంలో మార్చుకున్న పేర్లు కూడా కాదు. వందల ఏళ్లుగా ఆ గ్రామానికి అవే పేర్లు కొనసాగుతున్నాయి. ఆ పేర్ల వెనుక ఉన్న కథలను ఆ ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఉంటారు.
శ్రీకాకుళం నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీపావళి అనే ఒక గ్రామం. ఇది గార మండలంలోకి వస్తుంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. పూర్వం కళింగరాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని చెబుతారు. ఓ రోజు కళింగ రాజు గుర్రంపై స్వారీ చేస్తూ అటుగా వెళ్ళాడు. మార్గంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలు రాజుకు సపర్యలు చేసి అతడి ఆరోగ్యాన్ని కుదుటపరిచారు.
అప్పుడు రాజు వారికి కృతజ్ఞతలు చెప్పి, ఆ గ్రామం పేరు ఏమిటని అడిగాడు. తమ గ్రామానికి ఎలాంటి పేరు లేదని గ్రామస్తులు చెప్పారు. దీంతో రాజు తానే నామకరణం చేస్తానని... దీపావళి అని గ్రామానికి పేరు పెట్టారు. ఆ గ్రామంలో వెయ్యి కుటుంబాలు ఉంటున్నాయి. అందరికీ ఏడాదికి ఒక్కసారే దీపావళి... కానీ మాకు మాత్రం ప్రతిరోజు దీపావళి అంటారు ఆ గ్రామస్తులు.
ఇక మరో గ్రామం టెక్కలికి దగ్గరలో ఉంది. ఆ గ్రామం పేరు దీపావళి పేట. దాదాపు వందేళ్ల క్రితం ఆ గ్రామంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో నూనె దీపాన్ని వెలిగించారు. అప్పుడు అన్ని పూరిళ్లు ఉండేవి. ఎలుకలు ఆ నూనె దీపాన్ని పడవేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రామంలోని ఇళ్లన్నీ వరుసపెట్టి కాలిపోయాయి. అప్పటినుంచి ఆ గ్రామాన్ని చుట్టుపక్కల ప్రజలు దీపాలపేటగా పిలవడం ప్రారంభించారు. అది కాస్త వాడుకలో దీపావళి పేటగా మారింది.
రెవెన్యూ శాఖలో కూడా ఈ గ్రామం పేరు దీపావళి పేటగానే నమోదయింది. తమ గ్రామం పేరును అదృష్టంగా భావిస్తారు గ్రామస్తులు. దీపావళి వచ్చిందంటే ఈ గ్రామాల్లో సందడే సందడి.
COMMENTS