Himanshu IAS... a mission to reunite missing children with their parents.
హిమాన్షు ఐఏఎస్… తప్పిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులను చేర్చే ఓ మిషన్…
కనిపించకుండా పోయిన పిల్లలు.. ఎంత వెతికినా ఆచూకీ లభించక ఆశలు వదులుకుని నీళ్లింకిపోయిన కళ్లకు మళ్లీ కనిపిస్తే.. ఆ తల్లిదండ్రుల్లో కనిపించే ఆనందం మాటలకందనిది. మరలాంటి పిల్లల్ని ఓ మిషన్ తరహాలో పనిచేస్తూ వాళ్ల పేరెంట్స్ వద్దకు చేరుస్తున్న ఓ ఐఏఎస్ గురించి ఎందుకు చెప్పుకోవద్దు..? ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఎన్నోచోట్ల ఈ రెస్క్యూ కొనసాగుతూనే ఉన్నా.. చిత్తశుద్ధిగా పిల్లల్ని తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే ఆ ప్రక్రియలో ఆ ఐఏఎస్ చొరవ కచ్చితంగా అభినందనీయమే.
వారణాసి..
నిత్యం వేల మంది పర్యాటకులు, భక్తులతో రద్దీకి కేరాఫ్. కాశీ విశ్వనాథుడి కోసం వచ్చేవాళ్లు కొందరైతే.. అక్కడి పర్యాటకాన్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చేవారు మరికొందరు.. వ్యాపార, వాణిజ్యరిత్యా వచ్చేవారు ఇంకొందరు. ఇలా ఎందరినో తన అక్కున జేర్చుకుంటున్న ఆ గంగమ్మ ఒడిలో.. తల్లిదండ్రులకు దూరమై… అనాథలై బతుకుతున్న పిల్లలూ భిక్షగాళ్లుగా మారిన కథలూ కళ్లకు కడుతాయి. టెంపుల్ టౌన్ లోని ఆలయాల పరిసరాలతో పాటు.. రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్, ఫ్లైఓవర్స్ కింద ఇలా ఎక్కడ చూసినా అలాంటి పిల్లలు బిచ్చగాళ్లుగా రూపాంతరం చెందిన దృశ్యాలు కనిపిస్తాయి. వాళ్లంతా ఎవరో పర్యాటకులు కాశీ క్షేత్రాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు.. తప్పిపోయినవాళ్లో.. లేక, తెలిసో, తెలియకో బస్సో, ట్రైనో ఎక్కి విశ్వనాథుడి సన్నిధికి చేరుకున్నవారో అయ్యుంటారు. అలాంటి యాచకస్థితిలోకి మారిపోయిన పిల్లల వైపు ఓ ఐఏఎస్ దృష్టి పడింది. ఆయనే హిమాన్షు నాగపాల్. ఇంతకీ హిమాన్షు ఏం చేశాడంటారా..?
ఇప్పటివరకూ 730 మంది పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. ఎంత సీరియస్ గా పనిచేస్తే ఇలాంటి మహత్తర కార్యక్రమం ముందుకు వెళ్తుందో ఆయన మాటల్లోనే వినాల్సి ఉంటుంది. ఏ ఎన్నోచోట్ల ఆపరేషన్ ముస్కాన్ జరగడం లేదా…? మిగిలిన ఆఫీసర్స్ అలా పని చేయడం లేదా..? చేస్తూనే ఉన్నారు. ప్రతీ పిల్లవాణ్నో, పిల్లనో వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రక్రియలో అలా ఒక్కరిని చేర్చినా నిజంగా అది హర్షించదగ్గ సక్సెస్ స్టోరీనే. కానీ, హిమాన్షు చిత్తశుద్ధిగా.. ఓ టాస్క్ లా పనిచేసి.. ఇప్పటికే 730 మంది పిల్లల్ని వాళ్ల పేరెంట్స్ వద్దకు చేర్చడమే ఆయన విజయగాధలో మానవీయ మంత్రం. అందుకే ఇప్పుడు ఎన్నో కుటుంబాల పాలిట హిమాన్షు.. సాక్షాత్తూ ఆ కాశీ విశ్వనాథుడయ్యాడు.
ఉత్తరప్రదేశ్ షమ్లీ జిల్లాకు చెందిన షోయబ్ అహ్మద్ అనే 12 ఏళ్ల మెంటల్లీ ఛాలెంజ్డ్ బాలుడు.. హెయిర్ కటింగ్ కోసం బార్బర్ షాపుకు వెళ్లాడు. కానీ, అది ముగిశాక ఇంటికెళ్లకుండా షమ్లీ బస్టాండ్ బాట పట్టాడు. ఆ తర్వాత బస్సెక్కి కూర్చున్న బాలుడు.. అలా అలా బస్సులు, ట్రైన్స్ మారుతూ ఏకంగా తన గ్రామం నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసికి చేరుకున్నాడు. ఈ ఘటన 2019లో జరిగింది. కానీ, ఆ పిల్లవాడు పొట్టకూటి కోసం యాచకుడయ్యాడు. కాశీలోని ఓ ఫ్లైఓవర్ కింద అడుక్కుంటున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లవాడు కనిపించడలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
చుట్టుపక్కల గ్రామాల్లో గోడలకు తమ పిల్లవాడి ఫోటోను అదృశ్యమైనట్టు.. కనిపిస్తే సమాచారమివ్వాలని వాల్ పోస్టర్స్ వేశారు. సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో బండి పైన తిరుగుతూ జల్లెడ పట్టారు. కానీ, బాలుడు దొరకలేదు. దాంతో ఇక తమ పిల్లవాడు తిరిగిరాడేమోనన్న ఇంకిపోయిన కన్నీళ్ల నడుమ ఆశలు వదిలేసుకున్నారు. అలా నాల్గేళ్లు గడిచిపోయింది. ఒకరోజు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. ఒక పిల్లవాడు దొరికాడు.. ఆ అబ్బాయి మీ వాడేనో, కాదో చూసి చెప్పండి అంటూ. ఇంకేం వాట్సప్ కాల్ చేశారు. తల్లిదండ్రులను చూసిన ఆ పిల్లవాడిలో ఒక్కసారి కోటి సూర్యులుదయించిన తేజస్సు కనిపిస్తే… ఇక రాడనుకున్న కొడుకు మళ్లీ కనిపించడంతో ఆ తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆనందభాష్పాల సంగతి వర్ణనాతీతం.
హర్యానా హిస్సార్ జిల్లాకు చెందిన హిమాన్షు 2019 బ్యాచ్ ఐఏఎస్. వారణాసిలో ఆయన ఉద్యోగం చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్. ఒకరోజు తన ఫీల్డ్ విజిట్ లో భాగంగా వెళ్లినప్పుడు కాశీలోని ఓ ఫ్లైఓవర్ కింద కూర్చున్న షోయబ్ లాంటి పిల్లల గుంపును చూసి ఆగిపోయిన హిమాన్షులో.. అప్పటికప్పుడు కల్గిన సంకల్పబలమే.. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకూ 730 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ప్రధాన హేతువైంది. వారిని అలాగే వదిలేస్తే జరిగే పరిణామాలను ఊహించి ఒక సీరియస్ టాస్క్ గా ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమానికే ఒక సార్థకత కల్పించాడు హిమాన్షు.
శిశు, సంక్షేమ, సాంఘిక సంక్షేమ, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, పోలీస్ ఇలా 60 మంది ఆఫీసర్స్ తో కలిసి 12 బృందాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ ముస్కాన్ ను వారణాసిలో ఒక లెవల్ లో నిర్వహిస్తున్నారు హిమాన్షు అనే సివిల్ సర్వెంట్. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారి వరకూ ఒక షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసి.. వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేవరకూ చదువు, కావల్సిన ఫుడ్, ఏసీ హాల్స్, యోగా వంటివాటితో పాటు అన్ని సకల వసతులూ కల్పించారిప్పుడు. చాలామంది మానసిక ఎదుగుదల లేని పిల్లల ఆలనాపాలనలో సైకలాజిస్టుల సలహాలు, సూచనలతో ఆపరేషన్ ముస్కాన్ కు సంపూర్ణార్థాన్నిస్తున్నాడు.
ఒక్కో పిల్లవాణ్ని తమ తల్లిదండ్రులు ఫలాన అని తెలిశాక కూడా.. భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాకుండా వారేనా, కాదా అని నిర్ధారించుకుని అప్పగించే ప్రక్రియకు కనీసం 5 నుంచి 15 రోజుల సమయం వరకూ పడుతుందంటున్న హిమాన్షు.. ప్రతీ వారంకొకసారి అనాథ పిల్లలుండే షెల్టర్స్ ను సందర్శిస్తుంటారు. అయితే, హిమన్షు ఒక్కడి వల్లే ఇది సాధ్యమా..? ఎందరో అధికారులు కలిస్తే.. ఓ బృందం సాధిస్తున్న విజయం కదా..? అవునూ! కచ్చితంగా వారి కృషి, శ్రమా చెప్పుకోవాల్సిందే!! అయితే, ఆ బృందం మొత్తాన్ని నడిపిస్తున్న నాయకుడవ్వడం వల్లే.. బాలా సినిమా తరహాలో తానే దేవుడయ్యాడు.
షోయబ్ వంటివాళ్ల విషయంలో టాస్క్ ఇంకా కఠినంగా ఉంటుందని.. మానసిక స్థితి సరిగ్గా లేని ఆ అబ్బాయి వంటివాళ్లను పేరెంట్స్ వద్దకు చేర్చే ప్రక్రియలో వారి బయోమెట్రిక్స్ నమోదు చేసి ఆధార్, అడ్రస్ వంటివి కనుక్కోవల్సి ఉంటుందంటారు హిమాన్షు. అయితే, షెల్టర్ హోమ్స్ కు కావల్సిన సదుపాయాలను సమకూర్చడంలో ఇంకా ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయని.. తన ఉద్యోగంలో భాగమైన ఆపరేషన్ ముస్కాన్ లో తల్లిదండ్రుల నుంచి దూరమైన పిల్లల్ని వారి చెంతకు చేర్చకపోతే.. ఇక ఉద్యోగం చేసి ఎందుకని ప్రశ్నిస్తాడు..? ఆ పిల్లల్ని చూసిన తల్లిదండ్రుల ఆనందం.. తమ అమ్మానాన్నలను మళ్లీ కలిసిన ఆ పిల్లల అనుభూతితో.. ఆ రోజు విజేతలం మనమే అనుకునే ఆ సంతృప్తి చాలదా జీవితానికి అనేది హిమాన్షు ఫిలాసఫీ. అలా తన మనస్సాక్షినే ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ పేరెంట్స్, పిల్లల్ని కలుపుతున్న హిమాన్షు మరి నిజంగా ఆ కాశీ విశ్వనాథుడు కాదంటారా..?
COMMENTS