Govt Scheme PMEGP: Central scheme.. Loan up to Rs. 50 lakh.. 35 percent subsidy.. Who is eligible?
Govt Scheme PMEGP: కేంద్రం స్కీమ్.. రూ.50 లక్షల వరకు లోన్.. 35 శాతం సబ్సిడీ.. అర్హులేవరంటే?
Govt Scheme: దేశంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ప్రధాన మంత్రి ఉపాధ కల్పన కార్యక్రమం (PMEGP Scheme). స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు ఈ స్కీమ్ ద్వారా రూ. 1 లక్ష నుంచి ఏకంగా రూ. 50 లక్షల వరకు లోన్ అందజేస్తుంది కేంద్ర సర్కార్. ఈ లోన్‌లో కేంద్ర ప్రభుత్వం 35 శాతం వరకు రాయితీ ఇస్తోంది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే తపన ఉన్న నిరుద్యోగ ఔత్సాహికులకు ఎంతగానే ఉపయోగపడే పథకం ఇది అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరకాస్తు ప్రక్రియ మొదలు ఎంపిక వరకు అంతా పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తోన్న స్కీమ్ ఇంది. ఈ క్రమంలో ఈ ప్రధాన మంత్రి ఉపాధి కల్పిన స్కీమ్ అంటే ఏమిటి? ఎవరెవరికి రుణాలు కల్పిస్తారు? అర్హతలు ఏమిటి? దరఖాస్తు చేసుకునే విధానం ఎలా? ఈ పథకం విధి విధానాలేంటి? తదితర పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దేనికి రుణమిస్తారు?
కొత్తగా ఏర్పాటు చేసే చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల యూనిట్లు మొదలు మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు. అయితే ఈ పథకంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్తరణకు.. వాటి నవీకరణ రుణం ఇవ్వరు. నెగిటివ్ పరిశ్రమల జాబితాలో ఉన్నవాటికి ఈ పథకం వర్తించదు. ఈ పథకాన్ని 2026 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021-2022 నుంచి 2025-2026 మధ్య కాలంలో ఈ పథకం అమలుకోసం 15వ ఆర్థిక సంఘం రూ.13,554.42 కోట్లు కేటాయించింది.
PMEGP అంటే ఏమిటి?
దేశంలోని గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకమే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. గతంలో దీని కోసం ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన పథకం అనే రెండు రకాల స్కీమ్స్ ఉండేవి. ఈ రెండింటినీ కలిపి ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ KVIC జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ ద్వారా, రాష్ట్రాల పరిధిలో కేవీఐసీ బోర్డులు, జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంటుంది.
ఈ పథకానికి అర్హతలేమిటీ?
18 సంవత్సరాల వయసు నిండిన వారంతా అర్హులే. కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు. స్వయం సహాయక బృందాలు (ఏ ఇతర పథకాల కింద ప్రయోజనాలు పొందని బిపిఎల్‌కు చెందిన వారితో కలిపి) అర్హులు.
(వ్యక్తి, తన భార్య/భర్త కలిపి) ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు.
ఎంత రుణమిస్తారు?
మీరు పెట్టబోయే కొత్త తయారీ యూనిట్‌కు రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ అందిస్తుంది కేంద్రం. సర్వీసు యూనిట్లకైతే రూ.20 లక్షల వరకు లోన్ సదుపాయం కల్పిస్తారు. గతంలో ఈ రుణ సదుపాయం గరిష్ఠంగా 25 లక్షల వరకు మాత్రమే ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందివ్వాలనే ఉద్దేశంతో రుణ పరిమితిని రూ. 50 లక్షల వరకు పెంచింది.
వడ్డీ ఎంత ఉంటుంది?
ఈ పథకం కింద ఇచ్చే రుణాలకు బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా వడ్డీ శాతం విధిస్తోంది. 7 నుంచీ 10 శాతం వడ్డీ సాధారణంగా ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టాలి?
జనరల్ కేటగిరీ వ్యక్తులు తాము ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు సంబంధించి మొత్తం వ్యయంలో 10 శాతం పెట్టుబడి భరించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాలి.
రుణంలో సబ్సిడీ ఎంత? ఎవరెవరికి ఇస్తారు?
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే వాటికి గరిష్ఠంగా 35 శాతం రాయితీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వాటికి 25 శాతం రాయితీ ఉంటుంది. అయితే ఈ రాయితీ ప్రత్యేక కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వైకల్యం కల్గినవారికి మాత్రమే కల్పిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకూ రుణంలో సబ్సీడీ సదుపాయం ఉంటుంది. అయితే ఈ కేటగిరీ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు 25 శాతం సబ్సిడీ, పట్టణ ప్రాంతాల్లో వాటికి 15శాతం సబ్సిడీ కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఈ స్కీమ్ కింద లబ్ధిదారుల దరఖాస్తు చేసుకోవడం మొదలు, ఎంపిక ప్రక్రియ వరకు మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. ప్రాజెక్టు ఏర్పాటును మాత్రం భౌతికంగా తనిఖీ చేసి పరిశీలన చేస్తారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.kviconline.gov.in క్లిక్ చేసి పీఎంఈజీపీఐ పోర్టల్‌లోకి వెళ్లాలి.అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపిక చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీకి, పట్టణ నిరుద్యోగులైతే డీఐసీలో వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకోవాలి. https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైటుకు వెళ్లి అక్కడ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా మీరు ఈ సైటులో లాగిన్ అవడం కోసం మీకు ప్రత్యేకంగా ఒక యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ పొందుపరచాలి. దరఖాస్తు చేసిన వెంటనే 10 నుంచీ 15 రోజుల వ్యవధిలో అధికారుల నుంచీ స్పందన వస్తుంది. ఆ తర్వాత మీ ప్రాజెక్టు మంజూరుకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి. ప్రాజెక్టుకు సంబంధించి మీకు కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజుల శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉండొచ్చు. ఈ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దరఖాస్తు చేసుకోకముందే కూడా ఈ శిక్షణ పూర్తి చేసుకుని తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
COMMENTS