Apartment: On which floor should I buy a flat in an apartment.. Is the middle one better?
Apartment: అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొనాలి.. మిడిల్ అయితే బెటరా?
మొదటిసారి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనే వారికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మందికి అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది.
Apartment Flat : ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన అపార్ట్‌మెంట్ కల్చర్ ఇప్పుడు చిన్న పట్టణాలకు వచ్చేసింది. సొంతిల్లు కొనుక్కోవాలనుకునే మధ్య తరగతి వారికి బడ్జెట్‌లో ఇల్లు దొరకడంతో అపార్ట్‌మెంట్ వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు అపార్ట్‌మెంట్స్ అన్నీ గేటెడ్ కమ్యునిటీల్లో ఉండటం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో చాలా మంది అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలా వరకు హైరైజ్ అపార్ట్‌మెంట్స్ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు ఏకంగా 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నాయి. అయితే మొదటిసారి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనే వారికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మందికి అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది.
ప్రధానంగా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను కొనేముందు ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, పరిసరాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు వంటివి పరిశీలించాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటి బడ్జెట్‌తో పాటు భవిష్యత్తులో వృద్ధికి సంబంధించిన అవకాశాలను బేరీజు వేసుకోవాలి. ఇక ఏ అంతస్తులో ఫ్లాట్ కొనాలన్నది చాలా మందిని మెదిలే ప్రశ్న. ఐదు నుంచి పది అంతస్తుల్లోని అపార్ట్‌మెంట్స్‌లో ఏ ఫ్లోర్‌లో తీసుకోవాలన్నది తేల్చుకోవడం కష్టం అంటే ఇప్పుడు 50 అంతస్తులకు పైన హైరైజ్ అపార్ట్‌మెంట్స్ వెలుస్తున్నాయి. అపార్ట్‌మెంట్స్‌లో అంతస్తుల ఎంపిక విషయంలో వారి వారి అవసరాలు, కుటుంబ సభ్యుల ఇంట్రస్ట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లోర్స్ ఎంపిక సందర్భంగా ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కాంక్రీట్ జంగిల్‌లా కాకుండా శివార్లలో అపార్ట్‌మెంట్ చుట్టూ తగిన ఖాళీ స్థలం ఉండి, చుట్టూ పచ్చదనం ఉంటే క్రింది అంతస్తుల్లో కొనుగోలు చేయవచ్చు. క్రింది అంతస్తులో గాలి, వెలుతురు సమృద్ధిగా వస్తుందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఉండి, వారు ప్రతిసారి లిఫ్ట్ ఎక్కడం ఇబ్బంది అనుకుంటే క్రింది ఫ్లోర్స్‌లో ఉండటమే మేలంటున్నారు నిపుణులు. క్రింది అంతస్తుల్లో ఉంటే అపార్ట్‌మెంట్స్‌కు వచ్చిపోయే వారి సందడితో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా క్రింది ఫ్లోర్స్‌లో భద్రతాపరంగా కూడా ఇబ్బంది ఉండవచ్చని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. తరచూ ఇల్లు మారే వారికి సామగ్రి తరలించడం కింది అంతస్తుల్లో సులువు కాబట్టి అలాంటి వారికి సౌలభ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
ఇక కాస్త థ్రిల్ కోరుకునే వారు పైఅంతస్తుల్లో కొనుక్కోవడం మేలంటున్నారు నిపుణులు. ప్రధానంగా పైఫ్లోర్స్‌లో ఉంటే గాలి వెలుతురు కావాల్సినంత వస్తుంది. బాల్కనీల్లోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ ఉండదు. పైఅంతస్తుల్లోకి దోమలు కూడా రావని చెబుతున్నారు. నగరం అంతా కనిపించడంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పైఅంతస్తుల్లో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంతే కాకుండా భద్రతా పరమైన సమస్యలు పెద్దగా ఎదురవ్వవు. పైగా పైఅంతస్తులో నివసించడం అంటే ఇప్పుడు హోదాగా భావిస్తున్నారు. అయితే పై అంతస్తుల్లోంచి ప్రతిసారి క్రిందకు రావాలంటే లిఫ్టుల్లోనే టైం గడిచిపోతుంది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో క్రిందికి రావాలంటే సమయం పడుతుంది. ఇలా అన్ని బేరీజు వేసుకున్నాక ఎటూ తేల్చుకోలేక పోతే మాత్రం మధ్య అంతస్తుల్లో ఫ్లాట్ కొనుక్కోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
COMMENTS