PMAY: Good news for common people, middle class.. Center's key announcement.. What did it say?
PMAY: సామాన్యులు, మధ్య తరగతికి గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
PMAY: సొంతింటి కల కోసం ఆరాటపడుతున్న సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కీలక ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
PMAY: దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. సామాన్యుల సొంతింటి కల నెరవేరేందుకు ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం వచ్చే ఏడాది డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలోని చాలా మంది సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. సొంతిల్లు నిర్మించుకోవాలని భావించే వారికి బెనిఫిట్ చేకూరనుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ 2022, మార్చి 31తోనే ముగియాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ గడువును పలుమార్లు పొడిగింది. తాజాగా మరోసారి పొడిగించినట్లు తెలిపింది. పీఎం ఆవాస్ యోజన స్కీమ్ పై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్ కిషోర్ తాజాగా లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2015 నుంచి కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ అమలు చేస్తూ వస్తోందని తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా అర్హత కలిగిన వారికి కనీస వసతులతో ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్, 2022 నాటికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ ద్వారా 120.45 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. మంజూరు చేసిన ఇళ్లలో 107.3 లక్షల ఇళ్లు అంటే దాదాపు 89 శాతం ఇళ్లకు పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇప్పటికే 67.1 లక్షల ఇళ్లు నిర్మాణ పూర్తయి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు వాటిని అందించామని చెప్పారు.
జులై 24, 2023 నాటి లెక్కల ప్రకారం చూస్తే 112.25 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. వీటిల్లో 75.51 లక్షల ఇళ్లు పూర్తయి లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ స్కీమ్ కింద 21.32 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిల్లో 19.96 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను పొడిగించామన్నారు. అందరికీ సొంతిల్లు లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తోందన్నారు. అర్హత కలిగిన వారు పట్టణ ప్రాంతాలలో సొంత ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందగా.. మరో ఏడాది వరకు మరింత మందికి లబ్ధి చేకూరనుంది.
COMMENTS