PM Yashasvi Yojana: Rs 1.25 lakh scholarship scheme for school students..
పీఎం యశస్వి యోజన: పాఠశాల విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్షిప్ ఇచ్చే పథకం... దరఖాస్తుకు ఆఖరు తేదీ ఆగస్ట్ 17.
దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలోపు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.
దీని ద్వారా రూ. 75,000 నుంచి రూ 1.25 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తోంది. ఈ పథకం పేరు ''పీఎం యశస్వి యోజన.
*యశస్వి పథకం అంటే?*
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే పీఎం యశస్వి యోజన.
ఈ పథకం పూర్తి పేరు ''ప్రైమ్ మినిస్టర్- యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (పీఎం-వైఏఎస్‌ఏఎస్‌వీఐ). అయితే, ఇది యశస్వి స్కాలర్షిప్ పథకంగానే అందరికీ ఎక్కువగా తెలిసింది.
ఇతర వెనుకబడిన కులాలు (OBC), ఆర్థికంగా వెనుకబడిన కులాలు(EBC), డీ నోటిఫైడ్ (తెగలు), నొమాడిక్ (సంచార), సెమీ నోమాడిక్ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేయడంతో పాటు దాన్ని పర్యవేక్షిస్తుంది.
తొమ్మిది నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
*ఎవరు అర్హులు?*
9వ తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నవారు, సీబీఎస్ఈ ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థులు.
*ఉపకార వేతనం ఎంత ఇస్తారు?*
9వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.75 వేలు, 11వ తగతి విద్యార్థికి రూ.1.25లక్షల ఉపకారవేతనం ఇస్తారు.
*విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి ఎంత ఉండాలి?*
విద్యార్థి కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ. 2.50లక్షలకు మించి ఉండకూడదు.
*ప్రతీ విద్యార్థికి స్కాలర్షిప్ ఇచ్చేస్తారా?*
ఇవ్వరు. దేశంలోని కేంద్ర పాలితప్రాంతాలు సహా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక్కో రాష్ట్రం నుంచి ఇంతమందిని ఈ పథకానికి ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఈ స్కాలర్‌షిప్‌ల కొరకు మొత్తం 1,401 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 1,001 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
*స్కాలర్ షిప్ ఎలా చెల్లిస్తారు?*
విద్యార్థికి చెందిన ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు.
*ఎంపిక ఎలా?*
ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఇందులో మెరిట్ ప్రకారం విద్యార్థులను ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
*పరీక్ష పద్ధతి ఎలా ఉంటుంది?*
ఇది రాతపూర్వకంగా ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) విధానంలో ఓఎంఆర్ షీట్స్‌పైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటలు.
*ఏయే సబ్జెక్టులు ఉంటాయి?*
మ్యాథమ్యాటిక్స్: 30 ప్రశ్నలు-120 మార్కులు
సైన్స్: 20 ప్రశ్నలు-80 మార్కులు
సోషల్ సైన్స్: 25 ప్రశ్నలు-100 మార్కులు
జనరల్ నాలెడ్జ్: 25 ప్రశ్నలు-100 మార్కులు
*పరీక్ష ఏ భాషలో ఉంటుంది?*
ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో పరీక్షను నిర్వహిస్తారు.
*దరఖాస్తు చేసుకోవడం ఎలా?*
ఈ స్కాలర్షిప్ కొరకు విద్యార్థులు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది
https://yet.nta.ac.in/frontend/web/site/login
ఈ వెబ్సైట్లోకి వెళ్లి విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి.
*దరఖాస్తు చేసుకునే విధానం?*
* విద్యార్థులు ముందుగా పైన చెప్పిన అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
* వెబ్సైట్లో రిజిస్టర్ లింక్‌పైన క్లిక్ చేయాలి
* తరువాత మీ పేరు, ఈ-మెయిల్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ను టైప్ చేసి మీకు ఒక లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.
అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, తరువాత దాని కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి
*దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?*
ఈ నెల అంటే ఆగస్టు 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆ రోజు రాత్రి 11.50 నిమిషాల వరకు ఈ వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కుదరదు.
*దరఖాస్తులో తప్పులుంటే కరెక్షన్ చేసుకోవచ్చా?*
దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు ముగిశాక, దరఖాస్తులో కరెక్షన్ల కొరకు కొంత గడువు ఇచ్చారు.
ఆగస్టు 12వ తేదీ నుంచి 17వ తేదీలోపు మీ దరఖాస్తులో ఏవైనా కరెక్షన్లు చేయాల్సి వస్తే చేసుకోవచ్చు.
*పరీక్ష ఫీజు ఎంత?*
ఒక్క నయాపైసా కూడా చెల్లించక్కర్లేదు. పరీక్షకు పూర్తి ఉచితంగానే దరఖాస్తు చేసుకుని రాయొచ్చు.
*పరీక్ష తేదీ ఎప్పుడు?*
సెప్టెంబరు 29వ తేదీ శుక్రవారం పరీక్ష నిర్వహిస్తారు
దరఖాస్తు కోసం విద్యార్థులు ఏయే పత్రాలు సమర్పించాలి?
- 9వ తరగతి విద్యార్థులు 8వ తరగతి పాసైనట్లు సర్టిఫికెట్
- 11వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పాసైనట్లు సర్టిఫికెట్
- విద్యార్థి మొబైల్ నెంబరు
- విద్యార్థి ఆధార్ నెంబరు
- కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- విద్యార్థి ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా వివరాలు
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- విద్యార్థి సంతకం. ఫొటో తీసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
మీ ప్రాంతంలో ఏ బడిలో పరీక్షా కేంద్రం ఉందో ఎలా తెలుసుకోవాలి?
https://yet.nta.ac.in/frontend/web/schoollists/index వెబ్సైట్లో ''నో యువర్ స్కూల్'' అని ఉంటుంది. అందులో మీరు చదువుతున్న తరగతి, మీ రాష్ట్రం, మీ జిల్లాను క్లిక్ చేస్తే చాలు మీ పాఠశాల అందులో ఉందా లేదా అనేది తెలుస్తుంది.
*వివరాలకు ఎవర్ని సంప్రదించాలి?*
ఈ పరీక్ష కొరకు సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు సహాయపడటం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది
* National Testing Agency Help Desk Number : 011-40759000, 011-69227700
* NTA Email address: yet@nta.ac.in
* Website: www.nta.ac.in, yet.nta.ac.in, socialjustice.gov.in
COMMENTS