Amount in banks Rs. 35 thousand crores.. This may include your money.. Find out with RBI's new portal!
బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 35వేల కోట్లు.. ఇందులో మీ డబ్బులు కూడా ఉండొచ్చు.. RBI కొత్త పోర్టల్‌తో తెలుసుకోండి!
Saving Account Money: అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు.. అంటే ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం రిజర్వ్ బ్యాంక్.. ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. ఏదైనా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్లు ఇందులో తెలుసుకోవచ్చు. బ్యాంకుల్లో ఏళ్లుగా దాదాపు రూ. 35 వేల కోట్లు అలాగే పేరుకుపోయాయి. వీటిని అర్హులకు చేర్చేందుకే RBI కృషి చేస్తోంది.
RBI Portal: ఆయా బ్యాంకుల్లో కొన్ని సంవత్సరాలుగా అలాగే మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరో ముందడుగు వేసింది. వేర్వేరు బ్యాంకుల్లో అలాగే పేరుకుపోయిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలన్నీ ఒకే చోట తెలుసుకునేందుకు వీలుగా UDGAM పేరిట ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ లాంఛ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్డ్ మొత్తాలను కావాలంటే తీసుకోవచ్చు. లేదా ఆయా అకౌంట్లను పునరుద్ధరించుకునేందుకు కూడా వీలు పడుతుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఏదైనా బ్యాంక్ అకౌంట్‌లోని అమౌంట్ 10 సంవత్సరాలు లేదా అంతకు మించి ఏళ్లుగా వాడుకలో లేకుండా పోతే దాన్నే అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు.
ఇలా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల పేరిట ఆ డబ్బులు బ్యాంకుల్లోనే పేరుకుపోతుంటాయి. అలాంటి అకౌంట్ల వివరాలను ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB- పంజాబ్ నేషనల్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో లభ్యం అవుతాయి. అక్టోబ్ర 15 కల్లా ఇతర బ్యాంకుల వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది కేంద్ర బ్యాంక్.
ఇక అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి అవగాహన కోసం తాము చేపట్టిన, చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయని.. సంబంధితులు పలు బ్యాంకులకు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఇప్పుడు తీసుకొచ్చిన పోర్టల్.. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు గుర్తించడంలో ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ఫైనాన్షియల్ అండ్ అలైడ్ సర్వీసెస్ సహా వివిధ బ్యాంకులు కలిసి ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశాయి.
10 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ కాలంలో ఎవరూ క్లెయిం చేసుకోకుండా బ్యాంకుల్లో ఉన్న సుమారు రూ. 35 వేల కోట్ల డిపాజిట్లను.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే RBI కి బదిలీ చేశాయి. ఈ డిపాజిట్లలో రూ. 8086 కోట్లతో SBI అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో పీఎన్‌బీ (రూ.5340 కోట్లు) ఉండగా.. రూ. 4558 కోట్లతో కెనరా బ్యాంక్, రూ. 3904 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా వరుసగా నిలిచాయి.
ఇలా ఉపయోగం..
హఠాత్తుగా ఎవరైనా చనిపోయిన సమయంలో ఆ మృతుడికి ఏ బ్యాంకుల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి.. వాటిల్లో డబ్బులు ఎంత ఉన్నాయనేది తెలియకపోవచ్చు. కాలగమనంలో దీనిని మర్చిపోతుంటారు. అందుకే ఇప్పుడు ఈ పోర్టల్‌తో ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.
ఎలా సెర్చ్ చేయాలంటే?
తొలుత ఆర్‌బీఐ ఉద్గమ్ పోర్టల్ https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login లోకి వెళ్లాలి. లాగిన్ లేదా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఖాతాదారు పేరు వెల్లడించాలి. ఫలానా బ్యాంకు లేదా అన్ని బ్యాంకులు ఆప్షన్ పెట్టుకోవచ్చు. వివరాలు మరింత మెరుగ్గా రావాలంటే ఆ తర్వాత పాన్ , ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పుట్టిన తేదీ వివరాలు, పాస్ పోర్ట్ వివరాలు వంటివి పేర్కొనాలి. ఈ వివరాలేం లేకుంటే గ్రామం, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలతో తెలుసుకోవాలి. అలా సెర్చ్ చేస్తే.. ఆ వ్యక్తుల పేరుతో ఉన్న వ్యక్తుల వివరాలు కనిపిస్తాయి. ఏదైనా బ్యాంకులో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు కనిపిస్తే బ్యాంకుకు వెళ్లి అకౌంట్ పునరుద్ధరించుకోవచ్చు.
COMMENTS