Higher Education: Higher education abroad.. Select the right university like this..
Higher Education: విదేశాల్లో ఉన్నత విద్య.. సరైన యూనివర్సిటీని ఇలా సెలక్ట్ చేసుకోండి..
Higher Education: విదేశాలకు వెళ్లడం ఒక ఎత్తైతే, అక్కడ సరైన యూనివర్సిటీ ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే మంచి యూనివర్సిటీ సెలక్ట్ చేసుకుంటేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి పరిగణించాల్సిన కీలక అంశాలేంటో చూద్దాం.
విదేశాల్లో ఉన్నత విద్య (Higher Education) చదువుకోవడం చాలామంది విద్యార్థుల (Students) కల. వివిధ దేశాలు వీసా నిబంధనలను సరళీకరిచడంతో ఇటీవల కాలంలో ఫారెన్ కంట్రీస్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్‌పై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తుండడంతో అబ్రాడ్ వెళ్లేందుకు యువత మొగ్గుచూపుతోంది. ఉన్నత విద్య కలను సాకారం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లడం ఒక ఎత్తైతే, అక్కడ సరైన యూనివర్సిటీ ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే మంచి యూనివర్సిటీ సెలక్ట్ చేసుకుంటేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి పరిగణించాల్సిన కీలక అంశాలేంటో చూద్దాం.
కోర్సుపై ఫోకస్
విదేశాల్లో ఏ యూనివర్సిటీలో చేరాలి అనే దాని కంటే ముందు చదవాల్సిన కోర్సుపై ముందుగా నిర్ణయం తీసుకోవడం బెటర్. సదరు కోర్సు ద్వారా ఉద్యోగ అవకాశాలు, జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో పరిశోధించాలి. అందుకు అనుగుణంగా యూనివర్సిటీ/కాలేజీని ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంపిక చేసుకున్న కోర్సుకు ఇతర దేశాల్లోని కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ, దరఖాస్తు విధానం, క్యాంపస్ లైఫ్, బోర్డింగ్ వంటి వివరాలను పోలుస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలి.
యూనివర్సిటీ ర్యాంక్
విదేశాల్లో ఉన్నత విద్య కోసం యూనివర్సిటీని ఎంపిక చేసుకునే క్రమంలో మీ జాబితాలోని వర్సిటీల ర్యాంకింగ్స్‌పై దృష్టిసారించాలి. ప్రస్తుతం వివిధ ఆర్గనైజేషన్స్ వివిధ రకాల ర్యాంకింగ్ స్టిస్టమ్స్‌ను డెవలప్ చేశాయి. బెస్ట్ వర్సిటీల జాబితాను రూపొందించడానికి ఈ సంస్థలు విభిన్న పద్దతులను ఆవలంభిస్తున్నాయి. ప్రైమరీ ర్యాంకింగ్ సిస్టమ్స్ అనేది డేటా ఆధారంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ యూనివర్సిటీల ఎడ్యుకేషన్, పర్ఫార్మెన్స్, టీచింగ్ ఎన్విరాన్ మెంట్, ప్లేస్‌మెంట్స్ వంటి వివరాలను అంచనా వేస్తూ ర్యాంకింగ్ ప్రకటిస్తుంటారు. వీటిపై పరిశోధించి సరైన యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి.
ఆర్థిక స్థితిగతులు
విదేశాల్లో ఉన్నత విద్య అంటేనే ఖర్చు భారీగా ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక స్థితికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజు, రోజువారీ ఖర్చులు, బోర్డింగ్ వంటి అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అందుకు తగ్గట్టు సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం వర్సిటీల అధికారిక వెబ్‌సైట్స్ ప్రతి ప్రోగ్రామ్‌కు సంబంధించిన ట్యూషన్ ఫీజు వివరాలను సమగ్రంగా అందిస్తున్నాయి. అన్ని వివరాలను క్షుణంగా పరిశీలించి మీ బడ్జెట్ తగ్గట్టు యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి.
ప్లేస్‌మెంట్స్
విదేశాల్లో ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ ఎంపికలో పరిగణించాల్సిన కీలక అంశాల్లో ప్లేస్‌మెంట్ ఒకటి. వర్సిటీల ప్లేస్ మెంట్ ట్రాక్ రికార్డ్ పరిశీలించడం ద్వారా అక్కడ చదివితే భవిష్యత్ ఎలా ఉంటుందో అన్నదానిపై ఓ అంచనాకు రావచ్చు. ప్రస్తుతం చాలా దేశాలు 6 నెలల నుంచి నాలుగేళ్ల మధ్య ఎప్పుడైనా కోర్సును పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ, ఆ తరువాత వర్క్ పర్మిట్‌ను అందిస్తున్నాయి. వివిధ యూనివర్సిటీల్లో చదివిన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ యాక్సెస్ పొందితే యూనివర్సిటీ ఎంపిక సులభతరం అవుతుంది.
పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ యాక్సెస్
యూనివర్సిటీ ఎంపికలో ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాకపోతే, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను గతంలో ఇతర విద్యార్థులు ఎలా హ్యాండిల్ చేశారో తెలుసుకోవాలి. విదేశీ ఉన్నత విద్యలో ఎదురయ్యే ఇబ్బందులు, స్టడీ కల్చర్, క్యాంపస్ పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై గైడెన్స్ పొందవచ్చు. అయితే అంతకంటే ముందు పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ యాక్సెస్ పొందడం కీలకం.
COMMENTS