If an employee dies before retirement, will he give the pension money in the PF account to his wife?
రిటైర్మెంట్‌కు ముందే ఉద్యోగి చనిపోతే భార్యకు పీఎఫ్ ఖాతాలోని పించన్ డబ్బును ఇస్తారా..?
ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. అందులో కొంత భాగం పెన్షన్ స్కీమ్‌కు వెళ్తుంది. ఈ డబ్బు అంతా ఆ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పించన్ రూపంలో ఇస్తారు. ఇదంతా మనకు తెలిసిన మ్యాటరే. సర్వీసులో పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ పింఛన్‌కు అర్హత సాధిస్తారు. ఉద్యోగి వయసు 58కి చేరుకున్నా లేదంటే పదవీ విరమణ పొందిన వెంటనే పింఛన్ మొదలవుతుంది. అయితే ఉద్యోగి ముందే మరణిస్తే భాగస్వామికి పింఛను వస్తుందా? ఏకమొత్తంలో ఇస్తారా? లేదా మరణించిన ఉద్యోగికి 58 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వేచి చూడాలా?
ఉద్యోగి పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకోగానే అర్హత సాధించినా పదవీ విరమణ పొందాకే పింఛను ఇస్తారు. సాధారణంగా 58 ఏళ్ల నుంచి ఫించన్ మొదలవుతుంది. ఈపీఎఫ్, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ సమాంతరంగా కొనసాగినా.. ఉద్యోగి ముందుగానే మరణిస్తే ఈపీఎఫ్‌లోని మొత్తం డబ్బును జీవిత భాగస్వామికి అందిస్తారు. అయితే పింఛన్ విషయంలో మాత్రం అలా ఉండదట. ఏకమొత్తంలో పింఛన్ ఇవ్వాలన్న నిబంధన లేదు. పింఛన్‌కు అర్హత సాధించిన ఉద్యోగి 58 ఏళ్ల కన్నా ముందే మరణిస్తే జీవిత భాగస్వామికి ప్రతి నెలా వితంతు పింఛన్ ఇస్తారట.
ఉద్యోగి ముందుగా మరణించినా జీవిత భాగస్వామి వెంటనే పింఛన్ పొందొచ్చు. అతడు/ఆమె మరణించిన ఈపీఎస్ మెంబర్‌కు 58 ఏళ్లు వచ్చేంత వరకు వేచిచూడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత పింఛన్ అందుకుంటారన్నది కొన్ని సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సభ్యుడు పదవీ విరమణ పొందితే జీతంలో సగం వరకు పింఛన్ వస్తుంది. ఒకవేళ ఉద్యోగి పదవీ విమరణ వయసుకు ముందే మరణిస్తే.. అదే రోజు రిటైర్ అయితే వచ్చే డబ్బుకు సమానంగా జీవిత భాగస్వామికి పింఛన్ అందజేస్తారు.
పదవీ విరమణ వయసు, మరణించిన తేదీ అంతరాన్ని బట్టి అందుకొనే పింఛన్ మొత్తం మారుతుందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగి రిటైర్మెంట్ వయసుకు ఎంత ముందుగా మరణిస్తే అంత తక్కువ పింఛన్ వస్తుంది. జీవిత భాగస్వామి అందుకొనే పింఛన్ చాలా అంశాలపై బేసై ఉంటుంది. పదవీ విరమణ కన్నా చాలా ముందుగా మరణిస్తే జీవిత భాగస్వామి అందుకొనే పింఛన్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన సందర్భంలో కనీస వితంతు పింఛన్ రూ.1000గా ఉంటుందట.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. శాలరీలో కొంత కట్ అవుతుంది అంతే కనీసం ఆ పీఎఫ్ నెంబర్ కానీ అసలు ఆ నెంబర్ ఎక్కడ ఉంటుంది, బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఇవి కూడా తెలియకుండా ఉంటారు కొంతమంది. ఖాళీగా ఉన్నప్పుడు వీటిపై అవగాహన పెంచుకోండి. మీకు బాగా ఉపయోగపడుతుంది.
COMMENTS