PMEGP Scheme: A golden opportunity for those who want to start their own business.. On subsidy of Rs. Loan up to 50 lakhs.. Details are..
PMEGP Scheme: సొంతంగా వ్యాపారం చేయాలనుకొనే వారికి సువర్ణావకాశం.. సబ్సిడీపై రూ. 50 లక్షల వరకూ రుణం.. వివరాలివి..
చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ విసిగిపోయారా? పని భారం ఎక్కువ, జీతం తక్కువ కావడంతో ఇబ్బందులు పడుతున్నారా? ఎప్పటికైనా చిన్న కంపెనీ మొదలు పెట్టాలని భావిస్తున్నారా? మంచి ఆలోచన ఉంది.. కానీ నిధులులేక ఆగిపోతున్నారా? వ్యాపారవేత్తగా మారాలన్న కల కలాగానే మిగిలిపోతుందని భయపడుతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మీ ఆలోచనలకు మరింత పదును పెట్టండి.. మీ కల సాకారమయ్యే ప్లాన్ ఇక్కడ ఉంది. నిధుల సమస్య మీకిక ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీ కవసరమైన నిధులను సమకూర్చుతుంది. అదెలా అంటారా? ఈ కథనం చివరి వరకూ చదవండి.. పూర్తిగా అవగతం అవుతుంది.
దేశంలో ఎకానమీ 2024కి 5ట్రిలియన్ డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. దీనిని అందుకోవాలంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎంత ఎక్కువ సంఖ్యలో ఈ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ఏర్పడతాయో అంత పెద్ద మొత్తంలో దేశ ఎకానమీ పెరుగుతుంది. సరిగ్గా ఇదే అంశంలో కేంద్రం ఔత్సాహికల వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం ఇస్తోంది. మంచి ఆలోచనతో వస్తే అందుకు అవసరమయ్యే నిధులను సబ్సిడీతో కూడిన లోన్ రూపంలో అందిస్తోంది. ఈ స్కీమ్ ఏంటి? ఎంత మొత్తం లోన్ గా ఇస్తారు? సబ్సిడీ ఎంత? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పీఎంఈజీపీ కింద..
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్( పీఎంఈజీపీ) కింద ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ద్వారా చేయూతనందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ(ఎంఎస్ఎంఈ)నిర్వహిస్తోంది. దీనిని నోడల్ ఏజెన్సీగా జాతీయ స్థాయిలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) వ్యవహరిస్తోంది. రాష్ట్ర స్థాయిలో కేవీఐసీ, కేవీఐబీ, జిల్లా పరిశ్రమల సెంటర్ దీనిని నిర్వహిస్తుంది.
పీఎంఈజీపీ కింద రుణ పరిమితి..
పీఎంఈజీపీలో భాగంగా వ్యవసాయేతర కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పీఎంఈజీపీ కింద తయారీ రంగానికి చెందిన ప్రాజెక్టుకు గరిష్ట పరిమితి ఇటీవల రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు. అలాగే సర్వీసు రంగానికి చెందిన వ్యాపారాలు రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచారు. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన జనరల్ కేటగిరీ వారికి 25శాతం సబ్సిడీ ఉంటుంది. అలాగే ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ, మైనారీటీస్, దివ్యాంగులకు 35శాతం సబ్సిడీ ఉంటుంది. దేశ వ్యాప్తంగా 27 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దరఖాస్తుల కోసం కేవీఐసీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి.
COMMENTS