RASTRAPATHI BHAVAN POINTS
340 గదులు... 275 ఎకరాలు... ప్రపంచ దేశాధ్యక్ష భవనాల్లో అతి పెద్దది... అదే మన రాష్ట్రపతి భవన్!
మన దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠమని తెలుసు. మరి రాష్ట్రపతి నివాసం గురించిన విశేషాలు తెలుసా? 275 ఎకరాల ప్రాంగణంలో నాలుగు అంతస్తుల భవనంగా 340 గదులతో విశాలంగా నిర్మించిన ఈ భవనానికి ఒక రికార్డుంది. అదేంటంటే ప్రపంచ దేశాధినేతలు ఉంటున్న భవనాలన్నింటిలో అతి పెద్దది ఇదే. ఇంతకీ ఈ భవనాన్ని ఎందుకు కట్టారో తెలుసా? బ్రిటిష్ గవర్నర్ జనరల్ నివాసం కోసం. ఎందుకంటే 1911కి ముందు మన దేశ రాజధాని కలకత్తాలో ఉండేది. దాన్ని ఢిల్లీకి మార్చాలని కింగ్ జార్జి-5 నిర్ణయించినపుడు అప్పటి నిర్మాణాల్లో ప్రముఖమైనదిగా దీన్ని కట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1950లో దీన్ని రాష్ట్రపతి నివాసంగా ప్రకటించి 'రాష్ట్రపతి భవన్' అని పేరు పెట్టారు. అంతకు ముందు 'వైస్‌రాయ్ హౌస్' అని పిలిచేవారు.
దీని నిర్మాణం 1912లో ప్రారంభమైంది. నాలుగేళ్లలో కట్టాలనుకున్నా పూర్తవ్వడానికి 17 ఏళ్లు పట్టింది. ఈ భవన నిర్మాణానికి అప్పట్లోనే సుమారు కోటి రూపాయలైంది. సుమారు రెండు లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ముఖ్య ఆకర్షణ దర్బార్ హాల్. దీంట్లోనే ప్రధాన మంత్రితో సహా, మంత్రి మండలి ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్రపతి చేయిస్తారు. ఈ హాలుకి మధ్యలో 2 టన్నుల బరువుండే పెద్ద షాండ్లియర్ (దీపతోరణం) ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది.
ఇక ఈ భవనం ఉండే ప్రాంగణంలోని మొఘల్ గార్డెన్స్ గురించి వినే ఉంటారు. దాదాపు 13 ఎకరాల్లో ఉన్న ఈ తోటలో తామర పువ్వుల ఆకారంలో ఉన్న అందమైన ఆరు ఫౌంటేన్లు ఉన్నాయి. వందల రకాల రోజాపూలతో పాటు, ఎన్నో పూల మొక్కలతో కళకళలాడే మొఘల్ గార్డెన్ నిర్వహణకు 400 మందికి పైగా తోటమాలులు పనిచేస్తారు. ఈ గార్డెన్‌లోకి సందర్శకులను ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అనుమతిస్తారు. దీంతో పాటు టెన్నిస్‌కోర్టు, పోలోగ్రౌండ్, గోల్ఫ్‌కోర్స్, క్రికెట్ మైదానం కూడా ఉన్నాయి.
COMMENTS