Rats : కోకో, కొబ్బరి తోటల్లో ఎలుకల నివారణ ఎలాగంటే?..
Rats : ఎలుకలు పంటలకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఎలుకల కారణంగా లక్షల టన్నుల ఆహార ధాన్యాలకు నష్టం వాటిల్లుతుంది. పంటలను నాశనం చేయటం ద్వారా ఎలుకలు రైతులకు తీవ్రనష్టాన్ని మిగులుస్తున్నాయి. కొబ్బరి, కోకో పంటల్లో సైతం ఎలుకలు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా కొబ్బరి పంటలో విత్తనపు కాయలను తినటం, నారు దశలో మొలకల సూదిమొనలను కొరికివేయటం, కొబ్బరి వేళ్ళను ఎలుకలు కొరికి వేయటం వంటివాటి వల్ల ఆకులు ఎండిపోవటం, మొక్కలు చనిపోవటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఆఖరుకు చెట్లపైకి ఎక్కి పూత దశలో ఉన్న కొబ్బరి పువ్వులను కొరికివేయటంతో కాయదశకు చేరకుండానే కొబ్బరి పూత దశలోనే నిర్వీర్యమైతోంది. కాయలు పక్వానికి వచ్చే దశలో కాయలకు బొరియలు చేయటం వల్ల కాయలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.
కోకో పంటలోను ఎలుకల బెడద అధికంగానే ఉంది. ఎలుకలతోపాటు ఉడతలు సైతం కోకో పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి. పక్వదశలో ఉన్న కాయలను , పిందెలను కొరికి తినేస్తుండటంతో రైతులు ఏంచేయాలో పాలుపోని పరిస్ధితుల్లో ఉన్నారు. కోకో కాయలకు రంధ్రాలు చేయటం వల్ల పంటలో నాణ్యత తగ్గిపోతుంది. ఈ క్రమంలో కొబ్బరి, కోకో ఎలుకల నివారణకు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టటం ద్వారా వాటిని నియంత్రించుకోవచ్చు. తద్వారా పంటలను కాపాడుకోవచ్చు.
వేసవిలో లోతు దుక్కులు దున్నటం ద్వారా కలుపు మొక్కలను తొలగించటం, గట్లు వెంబడి శుభ్రంగా ఉంచటం ద్వారా ఎలుకలకు ప్రత్యామ్నాయ ఆహారం దొరకకుండా చూడాలి. దీని వల్ల ఎలుకలు ఆశ్రయం పొందేందుకు అవకాశం లేకుండా చేస్తుంది. తద్వారా ఎలుకలను నివారించుకోవచ్చు. అదే విధంగా రైతులంతా కలసి ఎలుకలు పట్టుకునేందుకు పొలంలో ఎలుక బుట్టలను కాని, బోనులు, జిగురు అట్టలు అమర్చుకోవాలి.
గాల్వనైజడ్ ఐరన్ బ్లోయర్ డ్రమ్ము గాలి మర సహయంతో ఎలుక బొరియల్లో పొగ ను నింపటం ద్వారా ఎలుకలు ఊరిడాకుండా చేయటం ద్వారా చనిపోయేలా చేయవచ్చు. పర్యావరణానికి హానికలగని ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. జింక్ ఫాస్పైడ్ మందును ఎలుకలకు ఎరగా వినియోగించి వాటిని చంపవచ్చు. ఈ విధానం ద్వారా తక్కవ సమయంలో ఎక్కవ ఎలుకలను నివారించుకోవచ్చు.
బ్రోయాడయొలోన్ మందును వినియోగించి ఎలుకల బెడదను నివారించుకోవచ్చు. ఈ మందు బూడిద రంగులో ఉంటుంది. ఈ విషాన్ని కలిపిన ఎరను ఎలుకలు తింటే 5రోజుల్లో రక్తహీనతతో చనిపోతాయి. పంటల కాలంలో అప్పుడప్పుడు ఈ మందును అక్కడక్కడ ఉంచటం ద్వారా ఎలుకలను పూర్తిగా నివారించవచ్చు.
COMMENTS