Ivy Gourd : దొండసాగులో మెళుకువలు, యాజమాన్య పద్దతులు
Ivy Gourd : కూరగాయాల సాగులో దొండ సాగు రైతులకు అనుకూలమైన పంట. లాభదాయకంగా ఉండటంతో రైతులు ఈ పంట సాగువైపు దృష్టి సారిస్తున్నారు. దొండలో విటమిన్ బి1, విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి. పోషకాలైన ఐరన్, కాల్సియంతోపాటు పీచు పదార్ధాలు అధికంగా లభిస్తాయి. ఒకసారి పొలంలో దొండపంట నాటుకుంటే మూడు సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. పందిరి నిర్మాణానికి ఎకరానికి 2లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుంది.
దొండసాగుకు సారవంతమైన నీటి లభ్యత కలిగిన నేలలు అవసరం, పొడివాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంకమట్టినేలు, మురుగునీరు పోయే వసతి కలిగిన ఒండ్రునేలలు సాగుకు బాగా పనికొస్తాయి. నీటి వసతి ఉంటే ఏడాదిలో ఏమాసంలోనైనా దొండను నాటుకోవచ్చు. కాండం ముక్కలను ప్రవర్ధనం చేయటం ద్వారా 20 సెంటీమీటర్ల ఉండేలా కాండాన్ని ముక్కలుగా చేసుకుని కణుపులు ఉండేలా చూసుకోవాలి. ఎకరం పొలానికి సుమారు 2000 కాండం ముక్కలు అవసరం అవుతాయి.
కాండం ముక్కలను ముందుగా 3గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణంలో ముంచి తీయాలి. ఆతరువాత ముందుగా తీసుకున్న గుంటల్లో నాటుకోవాలి. పాదుల వద్ద కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. ఎక్కవ సమయం పాదుల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్తులు పాటిస్తే మొక్క ఎదుగుదల బాగుంటుంది. నాటిని 60 రోజుల సమయానికి పూత ప్రారంభమై 100 రోజుల్లోపుగా దొండ కోతకు వస్తుంది. ఎకరం దొండ సాగుతో 60టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.
దొండ సాగులో చీడపీడలు అధికంగానే ఉంటాయి. ప్రధానంగా పండు ఈగ సమస్య పంటకు నష్టాన్ని కలుగజేస్తుంది. పువ్వులపై గుడ్లు పెట్టి పూత, పిందెల్లోకి వెళ్ళి కాయలను నాశనం చేస్తాయి. దీని నివారణకు మలాధియాన్ 2మిల్లీలీటర్లు లీటరు నీటితో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. మలాథియాన్ 100 మిల్లీలీటర్లు, 100 గ్రాముల చక్కెర లేకుంటే బెల్లం పాకం లీటరు నీటితో కలిపి చిన్నచిన్న మట్టి పాత్రల్లో పోసుకుని పొలంలో అక్కడక్కడ ఉంచితో పంటను ఆశించే పురుగులను నాశనం చేయవచ్చు.
గల్పై పురుగులు దొండపంటను నష్టం కలుగజేస్తాయి. తొలిదశలో ఉన్నప్పుడే వేపకషాయాన్ని పిచికారి చేస్తే పురుగును సులభంగా నివారించవచ్చు. ఒకవేళ ఈ పురుగు పంటను ఆశిస్తే ఆశించిన కొమ్మలను కత్తిరించుకోవాలి. దీని నివారణకు ఎసిఫేట్, క్లోరోఫైరిపాస్, డైమిధోయేట్ వంటి మందులను వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు 1.5గ్రాముల నుండి 2 గ్రాముల వరకు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
దొండపంటలో ప్రధానంగా వేరుకుళ్ళు తెగులు, వెర్రి తెగులు ఆశిస్తుంటాయి. వేరు కుళ్ళు తెగులు వస్తే మొక్కలు కాండం ప్రాంతం కుళ్ళిపోతుంటాయి. దీని నివారణకు మొక్కల చుట్టూ మెటాలాక్సిల్ లీటరు నీటిలో 2గ్రాములు కలిపి ఆ ద్రావణాన్ని నేలంతా తడిసేలా పోయాలి. వెర్రి తెగులు ఆశించిన మొక్కల ఆకులు సార్లతో నిండి ఉంటాయి. పూత, పిందెలు కాయకుండా గిడసబారి పోతాయి. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. ఈ తెగులుకు కారణమయ్యే పేనుబంక నివారణకు 2మిల్లీలీటర్ల డైమిధోయేట్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
దొండపంటసాగులో అధిక లాభాలను రైతులు పొందుతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని తెగుళ్ళు, పురుగుల బెడద నుండి పంటను ఎప్పటికప్పుడు కాపాడుకోగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. పొలంలో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని పంటసాగులో మెళుకువలు పొందవచ్చు.
COMMENTS