High Wire Crop: శాశ్వత పందిరి విధానంలో పెట్టుబడులు తక్కువ పంట ఎక్కువ
High Wire Crop: శాశ్వత పందిరి విధానంలో తక్కువ సమయంలోనే పంట కూరగాయలు చేతికొస్తాయి. వీటిని నేలపై సాగుచేస్తే అధికంగా చీడపీడల ఆశించి పెట్టుబడులు పెరుగుతాయి. నాణ్యమైన దిగుబడులు రావు. ఇది గమనించిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.. రెండున్నర ఎకరాల్లో శాశ్వత పందిళ్లు వేసుకొని తీగజాతి కూరగాయలను సాగుచేస్తున్నారు. పంట వెనుక పంటను వేస్తూ.. రోజూ లాభాలను చూస్తున్నారు.
ఎత్తైన బెడ్లపై నిండుగా బీర, కాకర, చిక్కుడు తీగలు అల్లుకున్నాయి. . పశ్చిమగోదావరి జిల్లా, ద్వారాకాతిరుమల మండలం, ఎం.నాగులపల్లి గ్రామంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం రైతు సత్యనారాయణది. 5 ఏళ్లుగా పందిరి కూరగాయల సాగుచేస్తున్నారు ఈ రైతు. అయితే ప్రణాళికబద్ధంగా పంటల వెనుక పంటలు వేస్తూ.. ఏడాదికి 3 పంటలు సాగుచేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు భలే డిమాండ్ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఆసరాగా చేసుకొని రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో సొంత డబ్బులతో శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. బోదెలను పోసి దానిపై మల్చింగ్ షీట్ ఏర్పర్చుకున్నారు. ఎకరంలో బీర, మరో ఎకరంలో కాకర, అర ఎకరంలో చిక్కుడును సాగుచేశారు. ప్రస్తుతం బీర, కాకర దిగుబడులు ప్రారంభమయ్యాయి.
సెమీ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టిన రైతు నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. బీర మొదటి కోతలో 50 కిలోల దిగుబడి రాగా, కాకర 1 టన్ను వరకు తీశారు. పందిరి విధానంలో సాగుచేయడంతో కాయ పొడవు పెరిగి , నాణ్యంగా ఉండటంతో మార్కెట్ లో మంచి ధర పలుకుతోంది.
ఏడాదికి 3 పంటల సాగులో.. మొదటి పంట కాకర పంటమీదే అన్ని పెట్టుబడులు పోను రూ.1 లక్షా 50 వేల నికర ఆదాయం పొందగా, బీర పంటపై మరో రూ. లక్షా 50వేల ఆదాయం పొందుతున్నారు. చిక్కుడుపై రూ. 50 వేల ఆదాయం వేసుకున్నా.. మొత్తం మూడున్నర లక్షల నికర ఆదాయం. ఏడాదికి మూడు పంటల్లో దాదాపు 10 లక్షల నికర ఆదాయం పొందుతున్న ఈ రైతు సాగు విధానం తోటి రైతులు పాటిస్తే ఇక లక్షాధికారులే..
COMMENTS