Danger foods: These five types of food are equal to stomach poison, the less you eat, the better
Danger foods: ఈ ఐదు రకాల ఆహారాలు పొట్టకు విషంతో సమానం, తినడం ఎంత తగ్గిస్తే అంత మంచిది.
Danger foods: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినమని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అయినా కూడా రకరకాల స్నాక్స్‌ను తినే వారి సంఖ్య ఎక్కువే. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషించేది ఆరోగ్యకరమైన పొట్ట. అయితే మనం తినే కొన్ని రకాల ఆహారాలు పొట్టకు హాని కలిగిస్తాయి. పొట్ట ఎప్పుడైతే అనారోగ్యం పాలవుతుందో.. శరీరం మొత్తం మూల పడిపోతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఏది తిన్నా వాంతులు అవుతాయి. కాబట్టి పొట్ట ఆరోగ్యానికి కీడు చేసే ఆహారాలను దూరంగా పెట్టాలి. ఇవి జీర్ణాశయానికి కూడా హాని కలిగిస్తాయి. మనం తినే ఆహారాల్లో పొట్టకు విషంతో సమానమైన స్నాక్స్ కొన్ని ఉన్నాయి. వీటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేదా పూర్తిగా మానేసినా మంచిదే.
తీపి పదార్థాలు:
క్యాండీలు, చాక్లెట్లు, పంచదారతో చేసిన అనేక రకాల స్వీట్లు తినేందుకు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ పొట్టలో చేరాక అవి చేసే కీడు అంతా ఇంతా కాదు. అధిక చక్కెర ఉన్న పదార్థాలు పొట్టలోని మంచి బాక్టీరియాను సమతుల్యతను దెబ్బతీస్తాయి. పొట్టలో అధిక చక్కెర కంటెంట్ హానికరమైన బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మంచి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణాశయంతర అసౌకర్యం వంటివి కలుగుతాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి బారిన పడతారు. కాబట్టి తీపి పదార్థాలను ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఫ్రెంచ్ ఫ్రైస్:
బంగాళదుంపలతో చేసే ఆహారం ఇది. బంగాళదుంపలు ఉడకబెట్టి కూర వండితే ఆరోగ్యానికి మంచిదే. కానీ బంగాళదుంపలను వేడి నూనెలో డీప్ ఫ్రై చేస్తే మాత్రం అవి విషాహారంగా మారిపోతాయి. పొట్టకు ఎంతో కీడు చేస్తాయి. అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులను పొట్టలో చేరుస్తాయి. వీటిలో ఉప్పు కూడా అధికంగా ఉంటుంది. ఇవి పొట్ట ఆరోగ్యానికి హానిని కలుగజేస్తాయి. పొట్టలోని మంచి సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గిస్తాయి. ఇందులో ఉండే అధిక కొవ్వు, జీర్ణ క్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఇది అనేక రకాల పొట్ట సమస్యలకు కారణం అవుతుంది.
సోడాలు:
ఎంతోమంది ప్రతిరోజూ సోడా తాగుతూ ఉంటారు. ఇది పొట్టకే కాదు మొత్తం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా పేగుల ఆరోగ్యాన్ని సోడా దెబ్బతీస్తుంది. సోడాల్లో చక్కెర నిండి ఉంటుంది. డైట్ సోడాల్లో కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి. ఈ రెండూ కూడా పొట్ట ఆరోగ్యానికి కీడు చేసేవే. ఇందులో ఉండే చక్కెర... పేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుంది. ఇక కృత్రిమ స్వీటెనర్లు మొత్తం ఆరోగ్యానికి కీడు చేస్తాయి. ఇవి పొట్టలోని మైక్రో బయోమ్‌లకు ప్రతికూలంగా పనిచేస్తాయి. ప్రయోజనకరమైన బ్యాక్టీరియాల సంఖ్యను తగ్గిస్తాయి.
కేకులు - పేస్ట్రీలు:
కేకులు, పేస్ట్రీలను చూస్తేనే నోరూరి పోతుంది. ఇక పిల్లలను ఇవి తినకుండా ఆపడం చాలా కష్టం. ఇందులో చక్కెర, అనారోగ్యకరమై కొవ్వులు, కృత్రిమ రంగులు నిండి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి ఎంతో కీడు చేస్తాయి. ఇందులో ఉండే అధిక చక్కెర కంటెంట్ పొట్టలో మంచి బ్యాక్టీరియాను దెబ్బతిస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాలో వైరస్‌లు పొట్టలో పెరిగేలా చేస్తుంది. అలాగే పొట్ట లైనింగ్ ను కూడా ఇబ్బంది పెడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌కు కారణం అవుతుంది. జీర్ణం కావడం కూడా కష్టంగా మార్చేస్తుంది.
కుకీలు:
బేకరీలలో అనేక రకాలైన కుకీస్ కనిపిస్తాయి. వీటిని మైదాతో చేస్తారు. అలాగే పంచదారతో నిండి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, కృత్రిమ రంగులు, చక్కెర శరీరంలో చేరిపోతాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని, పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాలను పెంచుతాయి. వీటి కోసం వాడే పిండి మంచిది కాదు. కాబట్టి కుకీలను ఎంత తక్కువగా తింటే అంత ఉపయోగం.
మీ పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే పైన చెప్పిన ఆహారాలన్నింటికీ దూరంగా ఉండాలి. ద్రవాహారాలను అధికంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలతో చేసిన పదార్థాలను తినాలి. అప్పుడప్పుడు లీన్ ప్రోటీన్ నిండిన మాంసాన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజూ ఒక కోడి గుడ్డును తింటే ఇంకా మంచిది.
COMMENTS