Credit Card: Even if you don't have rupees.. you can pay your credit card bill on time.. see how..
Credit Card: మీ దగ్గర రూపాయి లేకపోయినా.. సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించొచ్చు.. అదెలాగో చూడండి..
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం సర్వసాధారణమైపోయింది. చాలా మంది వ్యక్తులు తమ ఇంటి రెంట్, విద్యుత్ బిల్లు చెల్లింపులు, షాపింగ్, రీఛార్జ్, సబ్‌స్క్రిప్షన్‌లు మొదలైన వాటి కోసం క్రెడిట్ కార్డ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిర్ణీత వ్యవధిలో ఎటువంటి వడ్డీ లేకుండా కార్డులు వినియోగించుకునే అవకాశం ఉండటంతో అందరూ వీటికి మొగ్గుచూపుతున్నారు. పైగా మన పాకెట్ లోని డబ్బు ఆదా అవడానికి సహాయపడే పలు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ల వంటి ఆఫర్లు కూడా క్రెడిట్ కార్డులపై వస్తుండటంతో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. కొంతమంది ఒకటి కంటే అధికంగానే కార్డులు వినియోగిస్తున్నారు. అయితే బిల్లు జనరేట్ అయిన తర్వాత నిర్ణీత గడువులోపు కార్డు బిల్లు కట్టకపోతే మాత్రం అదొక పీడకలగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకర్లు భారీగా వడ్డీ వసూలు చేస్తారు. అందుకు తగిన నగదు మీ వద్ద ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ సమయానికి డబ్బులు లేకపోతేనే ఇబ్బంది వస్తుంది. అయితే అటువంటి సందర్భంలో మిమ్మల్ని వడ్డీల భారం నుంచి తప్పించే ఓ ఆప్షన్ ఉంది. దీనివల్ల మీకు కార్డు బిల్లు చెల్లించేందకు మరింత అధిక సమయం వస్తుంది. అదే క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అసలేంటి ఈ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్..
దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులపైనా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ ఎంటంటే.. ఒక కార్డులోని అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేయడం. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అలా రెండు మూడు కార్డులు వాడుతున్న వారికి ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కార్డు బిల్లు చెల్లింపు సమయానికి మీ దగ్గర సరిపడిన నగదు లేకపోతే ఆ మొత్తాన్ని మరో కార్డుపైకి బదిలీ చేయవచ్చు. దీంతో మళ్లీ ఆ కార్డు బిల్లు జనరేట్ అయ్యి.. బిల్లు చెల్లింపు తేదీ వచ్చే వరకూ మీకు ఆ నగదు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది.
చార్జీలుంటాయి..
అయితే ఈ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ వినియోగించాలంటే దానికి ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఇతర చార్జీలు బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించాలి. ఈ చార్జీలు బ్యాంకును బట్టి మారుతుంది. ఆ ఆప్షన్ వినియోగించుకొనే ముందు ఆ నిబంధనలు, చార్జీల వంటి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
ప్రయోజనం ఏంటి..
క్రెడిట్ కార్డులోని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ వల్ల వినియోగదారులకు కొంత వెసులుబాటు కలుగుతుంది. అలాగే కార్డు బిల్లు చెల్లించకపోవడం వల్ల పడే అదనపు చార్జీలు, వడ్డీల భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్యాలెన్స్ వేరే కార్డుపైకి వెళ్లిపోతుంది కాబట్టి బిల్లు సరియైన తేదీకే చెల్లించే అవకాశం ఉంది.
COMMENTS