Tornado : వరిలో సుడిదోమ…సస్యరక్షణ
Tornado : వరి పంట ప్రస్తుతం అంకురం దశ నుంచి చిరుపొట్ట దశలో ఉంది. ఈ దశలో ఉన్న వరి పంటకు సుడిదోమ ఎక్కువగా వచ్చే అస్కారం ఉంది. ఇప్పటికే రైతులు పొలాల్లో సుడిదోమ ఉనికిని గుర్తించారు. ఈ దశలో రైతులు అప్రమత్తమైతే పంటనష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా సుడిదోమ సెఫ్టంబర్ నుంచి నవంబర్ వరకు ఎక్కువగా ఆశిస్తుంది. సుడిదోమ రెండు రంగుల్లో ఉంటుంది. వీటిని గోధుమరంగుదోమ, తెల్ల వీపు సుడిదోమ అని పిలుస్తారు.
పిల్ల, మరియు తల్లి పురుగులు నీటి పై భాగంలో దుబ్బు,మొదళ్ళ దగ్గర ఉండి. రసం పీల్చుతాయి. దీనివల్ల పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో నీటిని గమనిస్తే తెట్టులాగా కనపడతాయి. వీటివల్ల పైరు సుడులు,సుడులుగా వలయాకారంలో ఎండిపోవడం జరుగుతుంది. దీనినే హపర్‌బర్న్ అని అంటారు. ఉధృతి ఎక్కువైనప్పుడు చేను ఎండిపోయి, తాలు గింజు ఏర్పడటం లేదా గింజ నూర్చినప్పడు గింజ ఎక్కువగా నూకగా మారడం జరుగుతుంది.
సుడిదోమ వరి పంటను ఆశించటానికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక వర్షాలు కురవడంతో పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం ముఖ్యకారణంగా చెప్పవచ్చు. ప్రతి 2 మీటర్ల పొడవుకు 20 సెంటిమీటర్ల చొప్పున కాలి బాటలు తీయకపోవటం వల్ల సుడిదోమ పంటను ఆశిస్తుంది. నత్రజని ఎరువు మోతాదుకు మించి వాడటం వల్ల కూడా వస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు 26`30 డిగ్రీలు మరియు రాత్రి ఉష్ణోగ్రత 19`20 డిగ్రీల మధ్య ఉన్నప్పడు సైతం సుడిదోమ కనిపిస్తుంది. తొలి దశలో ఆకుమడత, తాటాకు తెగులు, వరి ఈగలాంటి పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్, ఫ్రొఫెనోఫాస్, అలాగే సింధటిక్ 6,పైరిథ్రాయిడ్ మందును అధికమోతాదులో పిచికారి చేయడం వల్ల సుడిదోమ ఎక్కువగా ఆశించే ప్రమాదముంది.
ఈ సమస్య నుండి బయటపడాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నత్రజని ఎరువును మోతాదుకు మించకుండా ,ఎక్కువ దఫాలుగా పొలంలో వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వకుండా పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి. దుబ్బుకు 20- 25 పురుగులను గమనించినప్పుడు ఎసిఫేట్ 75 ఎస్‌పి 300 గ్రా లేదా బ్యూఫ్రోఫెజిన్ 320 మిలీ లేదా ఎసిఫేట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ కలిపి ఉన్న మిశ్రమ మందు 300 గ్రా ఎకరానికి చొప్పన పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పడు థైనో టెఫ్యూరాన్ 80 గ్రా ,లేదా ఇధోఫెన్‌ప్రాక్స్ 400 మిలీ లేదా పై మిట్రోజన్ 120 గ్రా ఎకరానికి చొప్పున కులుపుకుని పిచికారి చేయాలి.
COMMENTS