Chilli Crop : మిరపలో బ్యాక్టీరియా తెగుళ్ళు… నివారణ చర్యలు
Chilli Crop : వాణిజ్య పంటల సాగులో మిరపసాగు ముఖ్యమైనది. మనదేశంలో ఆంధ్రప్రదేశ్ మిరపసాగులో మొదటి స్ధానంలో ఉంది. మిరప పంట ఉత్పత్తిలో 50శాతం ఈ రాష్ట్రం నుండి ఉత్పత్తి అవుతుంది. నీటి వసతి ఉన్న నల్లరేగడి నేలల్లో మిరప పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. 15 డిగ్రీల నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వాతావరణంలో మిరపపంటను సాగుచేపట్టవచ్చు.
మిరపసాగులో బాక్టీరియా తెగుళ్ళ సమస్య అధికంగానే ఉంటుంది. ప్రధానంగా మిరప పంటకు కొమ్మ కుళ్ళు తెగులు ఆశిస్తుంది. ఇది వచ్చిన సందర్భంలో మొక్కల లేత ఆకులు, చిగుళ్ళు మాడిపోయిచ కొమ్మల కణుపుల వద్ద కుళ్ళిపోయినట్లు ఉండి విరిగిపోతుంటాయి. ఈ తెగులును గుర్తించిన రైతులు నివారణకు ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
అధిక వర్షాలు, వాతావరణంలో తేమ అధికంగా ఉన్న సమయంలో ఆకుమచ్చ తెగులు వ్యాపిస్తుంది. ఆకులుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండు బారి పోయి క్రమేపి రాలిపోతుంటాయి. దీనిని నివారణకు రైతులు ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, 1 గ్రాము స్ట్రెఫ్టోసైక్లిన్ లేదా 2గ్రాముల పోషామైసిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకుంటే ఆకుమచ్చ తెగులును నివారించుకోవచ్చు.
పేను బంక కూడా మిరప పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. పేనుబంక కనుగొన్న వెంటనే ఎసిఫెట్ 1.5గ్రాముల లేదా, మిథైల్ డెమటాన్ 2మిల్లీలీటరు, లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.25మిల్లీలీటరు చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ పంటను ఆశించిన సమయంలో పొలంలో అక్కడక్కడ అట్టలకు ఆయిల్ గాని, లేకుంటే గ్రీజుకాని పూసి ఉంచితే దీనిని నివారించుకోవచ్చు.
కాయకుళ్ళు తెగులు మిర్చి పంటకు అశించే ప్రధానమైన తెగులు. ఈ తెగులు సోకితే కాయల పైన నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతాయి. ముదురు కొమ్మలపై గోధుమరంగు మచ్చలు వస్తాయి. దీనివల్ల పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. దీని నివారణకు క్లోరాంట్రానిల్ 2మిల్లీలీటర్లు, మాంకోజెబ్ 2.5 గ్రాములు విత్తనంలో కలిపి శుద్ధి చేసుకుంటే ఈ తెగులు రాకుండా మొక్కలను రక్షించుకోవచ్చు.
సాధ్యమైనంత వరకు వైరస్ తట్టుకునే రకాలను సాగుకు ఎంపిక చేసుకోవటం మంచిది. పొలం చుట్టూ గట్ల అంచుల్లో మొక్కజొన్న పంటను రక్షణగా వేసికుంటే కొంత మేర మిరప పంటకు మేలు కలుగుతుంది. వైరస్ సోకిన మొక్కలను పొలలో గుర్తించినట్లైతే వెంటనే వాటిని పీకివేసి నాశనం చేయాలి. అలా చేయకుంటే ఆ వైరస్ ఇతర మొక్కలకు అలా పొలం మొత్తం వ్యాపించేందుకు ఆస్కారం ఉంటుంది.
COMMENTS