PHONE MITRA IN RESIDENTIAL SCHOOLS
గురుకుల విద్యార్థులకు ఇక నో హోమ్‌సిక్ - 'ఫోన్ మిత్ర'తో ఆ ప్రాబ్లెమ్‌కు చెక్.
రోజుకు 25 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు - విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులూ చేయవచ్చు.
Phone Mitra in Residential Schools : గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు సెలవు రోజుల్లో వారి తల్లిదండ్రులతో మాట్లాడటానికి చాలా అవస్థలు పడేవారు. తోటి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లను వినియోగించి తమ కుటుంబసభ్యులకు కాల్ చేసేవారు. కానీ ఈ సంవత్సరం నుంచి వారికి ఈ కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వారి ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో '‘ఫోన్ మిత్ర'’ పేరిట ఫోన్లు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
25 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడే వీలు :
ప్రతి నలుగురు విద్యార్థులకు కలిపి ఒక స్మార్ట్ కార్డుతో రోజులో 25 నిమిషాల పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడే వీలు కల్పించనున్నారు. ఇకపై విద్యార్థులు ఎలాంటి అవస్థలూ లేకుండా నేరుగా వారి తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు. దీనిలో భాగంగా కొత్తకోట బాలికల పాఠశాల, కళాశాలకు 7 ఫోన్లు, 150 స్మార్డ్ కార్టులను అందించారు. కొత్తకోట సమీపంలోని వీపనగండ్ల బాలుర గురుకుల పాఠశాలలో 6 ఫోన్లు, 140 స్మార్ట్ కార్డులను ఏర్పాటు చేశారు.
ఫోన్ నంబర్ల నమోదు :
స్కూల్లో కేటాయించిన ఫోన్లో ముందుగా స్మార్ట్ కార్డు అందించే సమయంలో వారి తల్లిదండ్రులు ఏదైనా ఓ ఫోన్ నెంబరును పాఠశాల సిబ్బందితో నమోదు చేయించుకోవాలి. ఏ ఫోన్ నంబరు నమోదు చేశారో కేవలం దానికి మాత్రమే స్మార్ట్‌కార్డు సేవలను వినియోగించుకోవచ్చు. ప్రతి గురుకుల పాఠశాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఫోన్లో స్మార్ట్‌కార్డును ఉంచి, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు.
సమస్యలపై ఫిర్యాదులూ చేయవచ్చు :
గురుకుల పాఠశాలలో ఏదైనా సమస్యలుంటే విద్యార్థులు గతంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఫోన్ ద్వారా నేరుగా టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి, ఉన్నతాధికారులతో మాట్లాడే సదుపాయం కూడా ఉంది.
పాఠశాలలు ప్రారంభించే నాటికి :
పాఠశాలలు పునః ప్రారంభించే నాటికి గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఫోన్ మిత్ర ద్వారా ఫోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే చాలా వరకు పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు వచ్చిన తరువాత వారి ఫోన్ సంఖ్యలను నమోదు చేయిస్తారు. ఏ నంబరు నమోదు చేస్తారో వాటికి మాత్రమే వారు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది.
COMMENTS