SEVEN LAKH CHEATING IN JAGTIAL
రూ.7 లక్షలు ఇవ్వండి, రూ.35 లక్షలు చేస్తాం అన్నారు - చివరికి కట్‌చేస్తే
అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు - నల్ల కరెన్సీని రసాయనంలో ముంచితే అసలుగా మారుతుందని ప్రగల్భాలు - జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో ఘటన.
Fake Currency Cheating In Jagtial : బ్లాక్ కలర్లో ఉండే రూ.500 నోటు సైజు కాగితాలు రసాయనంలో ముంచితే అసలు కరెన్సీలా(నిజమైన) మారుతుందని నమ్మ బలికి ఓ వ్యక్తికి ఓ ముఠా రూ.7లక్షలు టోకరా పెట్టింది. వారిని జగిత్యాల పోలీసులు పట్టుకుని మంగళవారం అరెస్ట్ చేసి ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
డీఎస్పీ రఘుచందర్ వెల్లడించిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాంకు చెందిన రామిల్ల విజయ్‌సాగర్‌ను తన మిత్రుడు బీర్‌పూర్ మండలం తుంగూరుకు చెందిన కంది నరేష్ నల్ల రంగులో ఉండే కాగితాలను రసాయనంలో ముంచితే రూ.500 నోట్లుగా మారతాయని నమ్మబలికాడు. ఈ కుట్రలో భాగంగా నరేష్‌తో పాటు పాలాజి శ్రీనివాస్, కడెం మండలం నర్సింగాపూర్‌కు చెందిన అల్తాపు రాజు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం చెన్నూర్‌కు చెందిన ఎంబడి మల్లేశ్, బుట్టాపూర్‌కు చెందిన మగ్గిడి కిషన్‌లు ఉన్నారు.
నల్ల కరెన్సీని రసాయనంలో : ఫిబ్రవరి 17న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లిలో కిషన్ తన వద్ద ఉన్న నలుపు రంగు నోట్లను శాంపిల్‌గా అసలైన నోట్లుగా మార్చి చూపించారు. వీటిని రూ.లక్షకు రూ.5 లక్షలు, రూ.7 లక్షలు ఇస్తే రూ.35 లక్షలు వస్తాయని విజయ్‌సాగర్‌కు చెప్పారు. విజయ్‌సాగర్ మార్చి 4న చెగ్యాంలో రూ.7 లక్షలను ఎంబడి మల్లేశ్‌కు అప్పజెప్పారు. బదులుగా ఇవ్వాల్సిన నల్ల కరెన్సీని కోటిలింగాల వద్ద ఇస్తామని చెప్పి, అక్కడ బాధితుడికి నకిలీ కరెన్సీ నోట్ల కట్టలను చూపించారు.
నగదును తీసుకుని కారులో : అదే సమయంలో కడెం మండలం కల్లెడకు చెందిన ఎంబడి రాజశేఖర్, జన్నారం మండలానికి చెందిన కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పోలీసులమని బెదిరించారు. ఈ క్రమంలో వారంతా కారు, ద్విచక్ర వాహనాలపై విజయసాగర్ వద్ద ఉన్న నగదును తీసుకుని ఉడాయించారు. బాధితుడు ఫోన్ చేసి డబ్బులు అడిగితే మర్డర్ చేస్తామని బెదిరించారు.
హరిత హోటల్ వద్ద :
ఈ ఘటనపై మే 2న విజయ్‌సాగర్ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం(మే 6) స్తంభంపల్లి శివారులోని హరిత హోటల్ వద్ద నిందితులు శ్రీనివాస్, రాజు, మల్లేశ్, రాజశేఖర్, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కిషన్, నవీన్, కార్తిక్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. రూ.2.04 లక్షల నగదు, కారు, బైక్, 5 సెల్‌ఫోన్లు, బ్లాక్ కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు. సీఐ రాంనర్సింహా రెడ్డి, ఎస్సైలు, కానిస్టేబుళ్లు త్వరితగతిని కేసును పూర్తి చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు వారిని అభినందించారు.
COMMENTS